ప్రియమైన నీకు…

ఈ ఉత్తరం నీకందే సమయానికి నేను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వు నన్ను కలవడానికి వచ్చేముందు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా నీకు చెప్పదల్చుకున్నాను. చదివిన తరువాత రాకపోయినా, నీమీద నాకున్న అభిప్రాయం గానీ, గౌరవం గానీ ఏ మాత్రం మారదు. నిర్ణయం ఎప్పుడూ నీదే.

నేను గతేడాది మార్చి పదకొండున నా స్నేహితురాలిని కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో, దారిలో ఒకతను రోడ్డుకు ఒక ప్రక్కగా పడి ఉండడం గమనించాను. అప్పటికే కాస్త చీకటి పడుతుండడం వలన, ఆ చుట్టూ ఎవరూ లేకపోవడం గమనించని నేను, వెంటనే బండిదిగి అతడి దగ్గరగా వెళ్ళి చూశాను. అతడు స్పృహ కోల్పోయినట్టు అనిపించి, మొహమ్మీద నీళ్ళు చల్లుదామని చుట్టూ నీళ్ళకోసం చూసాను. ఎక్కడా మనుషుల అలికిడి లేక, కాస్త దూరంలో ఉన్న చిన్నషెడ్డు దగ్గరకి వెళ్ళి, లోపల చప్పుడు విని పిలిచాను.

అదే నేను చేసిన పొరపాటు అని ఆ తర్వాతే తెలిసింది. ఆ షెడ్డు లోపలనుంచి ఒక బలమైన వ్యక్తి బయటికి వచ్చాడు. అదోరకమైన వాసన, విచిత్రమైన వాటం. నామనసు కీడు శంకించింది. వెనక్కి కదలబోయా, కానీ నా వెనకే, దగ్గరగా ఇందాకా రోడ్డుమీద స్పృహతప్పి పడున్న మనిషిని చూసి ఉలిక్కిపడి, పక్కకి తోసి ముందుకు పరుగెత్తబోయా. వాళ్ళ బలంముందు నాకున్న బలం సరిపోలేదు.

ఏం చెయ్యాలి అని నా మెదడు ఆలోచించేలోపుగానే వాళ్ళు నన్ను గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకుపోయారు. నా ప్రతిఘటన వాళ్ళ పాశవికత ముందు సరిపోలేదు. వారి దుర్మార్గానికి నేను బలైపోయాను. స్పృహ కోల్పోయిన నన్ను అక్కడే వదిలేసి వాళ్ళిద్దరూ ఎటో వెళ్ళిపోయారు.

చీకటి, తెలియని ప్రదేశం, జరిగిన సంఘటన వలన మొద్దు బారిపోయిన శరీరం, ఈ దారుణం వలన ఏం చెయ్యాలో తెలియనంతగా స్థబ్దత సంతరించుకున్న మెదడు. నెమ్మదిగా, నేను కాస్త ఓపిక తెచ్చుకుని, ఎలాగో బయటకు వచ్చి, నా బండి దగ్గరకి చేరుకున్నాను. కానీ అక్కడే ఉంటే వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారేమో అనే భయంతో, అసలు చుట్టుపక్కలకి చూడకుండా, సాధ్యమైనంత వేగంతో బండిమీద ఇంటికి చేరుకున్నా.

అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్తే వాళ్ళ గుండె పగిలిపోతుంది, అందుకే ఎవరికి చెప్పుకోవాలో, అసలు ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో నాకున్న ఒక మంచి స్నేహితురాలు స్వప్న గుర్తొచ్చింది. ఆమె మంచి సైకాలజిస్ట్ కాబట్టి, నేను ఏం చేయాలో తనైతే మంచి దారి చూపగలదు అని అనిపించి తనకి ఫోన్ చేసి విషయంచెప్పి సలహా అడిగాను.

ముందుగా తను నాకు సాంత్వన ఇచ్చి, నన్ను డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్ళి అవసరమైన వైద్యం చేయించి, తర్వాత నాకు ధైర్యంచెప్పి తోడుగా ఉంది.

పోలీసులకు జరిగినది అంతాచెప్పి, కంప్లైంట్ ఇద్దాం అని అలోచించి, ధైర్యం చాలక ఆగిపోయా. ఒకవేళ నేను ధైర్యంగా ముందడుగు వేసినా, ఇదంతా తెలిసిన మా అమ్మ నాన్నలు దాదాపు ఆత్మహత్య చేసుకుంటారు అనే భయంకూడా వేసింది. అదొక్కటే కాదు, నిజానికి నేను ఈ విషయాన్ని ఒక పీడకలగా అనుకుని వదిలేసినా, ప్రపంచం దృష్టిలో ఇది ఒక ఘోరమైన అపరాధం. తప్పు ఎవరో చేసినా, దానికి శిక్ష మాత్రం నేనే అనుభవించల్సిరావడం నిజంగా దారుణం. ఒక స్త్రీని మన సమాజంలో ఎలా చూస్తారో నీకు బాగా తెలుసు.

ఎంతైనా, నేనూ మామూలు అమ్మాయిగా ఎన్నో కలలు, ఆశలతో జీవితాన్ని గడపాలి అనుకున్నాను. ఈ సంఘఠన వలన ఎన్నో కోల్పోయాను. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా, మనసు విలవిల్లాడిపోయి దాదాపు పిచ్చిదానిలా అయిపోయా. దానికి నేను చాలాకాలం మానసికమైన ఒత్తిడికి, వైద్యం చేయించుకోవల్సి వచ్చింది.

నా స్నేహితురాలు స్వప్న, “జరిగిన దానిలో నీ తప్పు లేదు. ఇది కూడా ఒకరకమైన ఏక్సిడెంట్ అనుకుని మర్చిపోయి, మామూలు జీవితం గడపడానికి ప్రయత్నించు” అని ప్రోత్సహించి, నన్ను మళ్ళీ మామూలు మనిషిగా బ్రతకడానికి సహాయపడింది. లేకపోతే నేను ఎప్పుడో ఒక విపరీతమైన నిర్ణయం తీసేసుకుందును.

ఇంతలో, ఇవన్నీ తెలియని మా అమ్మా, నాన్న నాకు పెళ్ళి చేస్తామంటూ ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టేరు. నేను మానసికంగా ఇంకా కోలుకోలేదు. పైగా, ఒకవేళ కోలుకున్నా, పెళ్ళి అనే మాట కలలో కూడా ఊహించుకోలేను. అందుకే వాళ్ళకి ఏదో ఒక సాకు చెప్పి ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్న సమయంలోనే, నీ పరిచయం జరిగింది.

నెమ్మదిగా నీగురించి, నీ సమాజ సేవా ధృక్పథం గురించి, నీ ఆలోచనా సరళి, ఆదర్శవంతమైన జీవితం అన్నీ తెలిసి నీమీద ఎంతో గౌరవం కలిగింది. అందుకే నీతో పరిచయం స్నేహంగా మారింది. ప్రపంచంలో ఏ బంధం అయినా, నమ్మకంతోనే ఎక్కువ కాలం నడపగలం అనేది నా నమ్మకం. అందులో స్నేహం ఎంతో అపురూపమైనది. అందుకే, నీకు జరిగినది అంతా చెప్పాలని ఆలోచిస్తున్న సమయంలో, అనూహ్యంగా నీనుంచి పెళ్ళి ప్రస్తావన వచ్చింది. ఇది నేను ఊహించనిది. అసలు ఏది ఆలోచించాలన్నా, ముందు జరిగినది నీకు దాపరికం లేకుండా చెప్పాలి అని నిర్ణయించుకున్నా, ఎదురుగా నిలబడి ఇదంతా చెప్పే ధైర్యం లేక ఈ ఉత్తరం వ్రాస్తున్నా.

నిజానికి ఆ సంఘటన నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. జీవితం పట్ల ఒక అవగాహన కలిగేలా చేసింది. నా జీవితానికి ఒక సరైన అర్ధం తెలిసేలా చేసింది. అందుకే, నాలా అన్యాయం జరిగి, సమాజ బహిష్కరణకు గురవుతున్న స్త్రీల జీవితాలకు నేనూ నావంతు తోడ్పాటుగా ఉందామని నిర్ణయించుకున్నాను. అలాంటివారికి స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఆత్మస్థైర్యాన్ని నింపుకుని, జీవితాన్ని ఎలా గడుపుకోవాలో తెలియజేసే మార్గాలను తెలియజేయడానికి అవగాహనా సదస్సులు యేర్పాటు చేస్తూ నా జీవితానికి ఒక అర్ధాన్ని చూసుకుంటున్నాను.

ఈ మార్గంలో ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నా. ఈ మార్గంలో ఒక స్నేహితునిగా నువ్వూ నాకు తోడుగా ఉంటావని నీతో ఇదంతా పంచుకుంటున్నా.

ఇట్లు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *