అమ్మాయి ఇంకా రాలేదు…

పరుగుపరుగున వచ్చి తన‌లేత చేతులతో తనని చుట్టుకుపోయిన కూతుర్ని చూసి మనసు ఉప్పొంగిపోయింది స్రవంతికి. “ఏమ్మా! స్కూల్ అయిపోయిందా. కొత్త స్కూల్ నచ్చిందా” అంటూ దగ్గరకి తీసుకుని తన ఆరేళ్ళ కూతురు సాహితిని ముద్దాడుతూ గారంగా అడిగింది స్రవంతి.

“బావుందమ్మా స్కూలు, అందరూ చక్కగా ఆడుకున్నాం. మా టీచరు బోలెడు కథలు కూడా చెప్పేరు తెలుసా” అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న కూతురిని బండి మీద ఎక్కించుకుని ఇంటివైపు ప్రయాణమైంది స్రవంతి.
స్రవంతి భర్త చనిపోయి ఏడాది అవుతోంది. ఆమెకు సాహితి ఒక్కతే కూతురు. ప్రేమించి పెళ్ళి చేసుకుని నా అనేవాళ్ళందరినీ వదిలి భర్తతో వచ్చేసింది ఏడేళ్ళ క్రితం. వాళ్ళసంసారం చక్కగా సాగుతోంది. అతడికి స్రవంతి అంటే చాలా ప్రేమ. ఇద్దరూ కలిసి ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లని పెంచుతూ వచ్చారు. అనుకోకుండా ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా ఒక లారీ డ్రైవరు తాగి లారీ నడిపి అతని బండిని ఢీకొన్నాడు. అతడి ప్రాణం అక్కడికక్కడే గాల్లో కలిసిపోయింది.

స్రవంతికి ఈ వార్త తెలిసిన‌వెంటనే ప్రాణాలు పోయినంత పనైంది. ఇంతలో కూతురి ఏడుపు వినిపించి, భర్త తనమీద వదిలి వెళ్ళిన బాధ్యత గుర్తొచ్చి గుండె రాయి చేసుకుంది. తనూ తన భర్త కలిసి‌ పాప భవిష్యత్తును గురించి కన్న కలలను తనే ఎంత కష్టమైనా భరించి నిజం చెయ్యాలని నిర్ణయించుకుంది. తను ఉద్యోగం చేస్తూ, మిగిలిన టైం లో వర్క్ ఫ్రం హోం టాస్క్స్ కూడా చేసి సంపాదన మొదలు పెట్టింది. ఏడాది తిరిగేసరికి ఒంటరి బ్రతుకు భారమైనా మెల్లిగా ఆ బిజీ జీవితానికి అలవాటు పడింది. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. కూతురే ప్రపంచం. పనిలోనే లోకం. ఈ స్కూల్ లో చేర్చాలని తనూ భర్త అనుకున్నారు. అందుకే కాస్త ఖర్చు ఎక్కువైనా అక్కడే పాపని చేర్పించింది. మొత్తానికి పాపకి ఇబ్బంది కలగలేదన్న విషయం తనకి ఆనందమనిపించింది.

రోజులు గడుస్తున్నాయి. పాప పెరిగి పెద్దదవుతోంది. తన కష్టం వల్ల మంచి ఫలితం దక్కింది. కొద్దికాలం లోనే తన పాత స్నేహితురాలి సలహాతో చిన్న కుటీర పరిశ్రమ లాంటిది మొదలుపెట్టి తనతో బాటుగా తనవంటి మరికొందరు మహిళలకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది.

తల్లిని అంచలంచెలుగా ఎదుగుతుండగా చూస్తూ పెరిగిన సాహితిలో కూడా అవే ఛాయలు కనిపించడం మొదలుపెట్టాయి. ఎవ్వరిమీదా ఆధారపడకపోవడం, ఎంత కష్టమైనా సాధించాలనే పట్టుదల, ఆత్మవిశ్వాసాలలో తల్లిని మించిపోయింది సాహితి. చదువులో చక్కగా రాణించింది. అన్నింటిలోనూ అందెవేసిన చెయ్యిగా పెరిగింది. ఇటు ఇంట్లో కూడా తల్లికి చేదోడువాదోడుగా ఉండటం ఆమెకు తలదలిపై ఉన్న ప్రేమను తెలిపేది. రోజులు గడుస్తున్నాయి. అమ్మాయి నెమ్మదిగా కాలేజీకి వచ్చింది. స్రవంతికి కూతుర్ని చూసి ఆనందంగా ఉండేది. కించిత్ గర్వంగా కూడా. అమ్మాయికి మంచి కాలేజ్ లో సీటొచ్చి చదువు సాగుతోంది.

“సాయంత్రం ఎనిమిదైపోయింది, సాహితి ఇంకా రాలేదు, ఒకసారి తన ఫ్రెండ్ జయా వళ్ళింటికి కాల్ చేసి అడుగు పిన్నీ” అంటూ ఎన్నేళ్ళుగానో వాళ్ళనే అంటిపెట్టుకుని వాళ్ళకి పెద్దదిక్కుగా ఉన్న సావిత్రికి చెప్పింది స్రవంతి.
“ఇప్పుడే కాల్ చేసానమ్మా, ఈరోజసలు సాహితిని కలవలేదని చెప్పింది జయ. ఇంకా తనే మనకి కాల్ చేద్దాం అనుకుంటోందట, సాహితి గురించి అడగడానికి” అంది‌ సావిత్రి.

ఈ మాట వింటూనే స్రవంతి మనసెందుకో కీడు శంకించింది. అదేంటి, తనకి చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళదే. ఏమై ఉంటుంది? అనుకుంటూ కార్ తీసి పోలీస్ స్టేషన్ వైపు పోనిచ్చింది.

కార్ మలుపు తిరుగుతుండగా ఎవరో చేతులు ఊపుతూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. చీకటిలో ఆకారం కనిపించటం లేదు స్పష్టంగా. కాస్త ముందుకి పోనిచ్చింది. ఒళ్ళంతా దెబ్బలతో తన కూతురు సాహితి. ఒక్కసారి ప్రాణాలు లేచొచ్చాయి స్రవంతికి. వెంటనే కారాపి టకటకా దిగి ఒక్క ఉదుట్న పరుగెడుతూ కూతురిదగ్గరకు వెళ్ళింది. కూతురు ఒళ్ళంతా గాయాలతో, రక్తం కారుతూ ఏడుస్తూ తనవైపు వస్తోంది. స్రవంతికి మనసంతా చెప్పలేనంత బాధ నిండిపోయింది ఆమెను అలా చూసేసరికి. అమ్మా సాహితీ! ఏమైందే? ఏంటిదంతా? ఏం జరిగింది? అసలెలా జరిగింది? కూతుర్ని దగ్గరకి తీసుకోబోయింది. చేతులు గాల్లోనే కదులుతున్నాయ్. ఎంత ప్రయత్నించినా కూతుర్ని పట్టుకోలేకపొతోంది. ఏదో జరిగింది. ఆమెకు అంతా అయోమయంగా ఉంది. “అమ్మా సాహితీ” గట్టిగా ఏడుస్తూ అరుస్తోంది. తన నోట్లోంచి మాట బయటికి రావటం లేదు. ఇంకా గట్టిగా అరవబోయింది.

మాట బయటికి వచ్చే సమయానికి గబుక్కున మెలకువ వచ్చింది. నోరంతా తడారిపోయింది. “ఇదంతా కలా!” పక్కకి తిరిగి చూసుకుంది. కూతురు సాహితి ఆదమరచి చంటిపాపలా నిద్రపోతోంది తన పక్కనే. ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకుని, పక్కనున్న గ్లాస్ లో మంచినీళ్ళు తాగి మళ్ళీ నిద్రకి ఉపక్రమించింది.

తెల్లవారాకా ఈ కలంతా సావిత్రి పిన్నికి చెప్పింది. అయ్యో పిచ్చితల్లీ, భయపడకమ్మా. నీకు నీ భర్త లేకపోయినా, అతని అండ ఎప్పుడూ ఉంటుంది. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. బెంగ పడకు, పద కాస్త కాఫీ తాగుదువుగాని అని ఓదార్చి ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పి మనసు మళ్ళించింది. ఇంతలో కూతురు కళకళలాడుతూ గదిలోంచి బయటికి వచ్చి “అమ్మా! నేను కాలేజ్ కి వెళ్ళొస్తా!” అంటూ హుషారుగా బయల్దేరింది. ఆరోజంతా స్రవంతికి మనసంతా అదోలానే గడిచింది. సాయంత్రం ఎనిమిదైనా కూతురు ఇంటికి రాలేదు………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *