శారదాస్ డైరీ…. !
- Bhavalavanyam
- 0
- on Sep 07, 2022
కొన్ని జ్ఞాపకాల చిన్ముద్రలు మస్తిష్కంపై కనీసం నామమాత్రంగా కూడా కనపడవు. మరి కొన్ని శిలా ఫలకం మీద చెక్కినట్టు లోతైన ముద్రలు వేసుకుని ఉండిపోతాయి. మీరెప్పుడైనా గమనించారా?
ఈరోజు సముద్రం ఒడ్డున ఇసుక తెన్నెల్లో పిల్లలు హాయిగా ఆడుకోవడం చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు నా పుట్టిన రోజు. నేను మా వారు కలిసి చాలా కాలం తర్వాత ఇంట్లోంచి బయటికి కలిసి వచ్చేము. దాదాపు నాలుగేళ్ళ తర్వాత. నా పేరు శారద, మా వారు బ్రహ్మాజీ. మాది అన్యోన్య దాంపత్యం అని చూసిన వాళ్ళు అందరూ అంటారు.
పెళ్ళైన కొత్తల్లో నాకు భయం భయం గా ఉండేది, ఏదైనా మాట్లాడాలన్నా, ఏ పని అయినా చెయ్యాలన్నా. తనే అన్నీ దగ్గరుండి నేర్పించేవారు. అమ్మ నాన్నలని వదిలి దూరంగా ఉండడం అదే మొదలు కావడం వలన బెంగ బెంగ గా ఉండేదాన్ని. చాలాసార్లు అవసరం లేకపోయినా ఏడుపు, అదోలా మొహం పెట్టుకుని కూర్చోవడం లాంటివి అందరు ఆడపిల్లల్లాగే నాకూను.
తను ఎన్నో యేళ్ళుగా ఇంటికి దూరంగా ఉండడం వలనేమో, అలాంటివేమీ అనిపించేవి కావు అనుకుంటా. కానీ నన్ను అర్ధం చేసుకుని నాకు అన్నీ నేర్పించడమే కాకుండా, నేను బెంగగా ఉన్న ప్రతిసారి ఈ సముద్ర తీరానికే తీసుకుని వచ్చేవారు. చాలాసేపు కూర్చునే వాళ్ళం గానీ, కబుర్లు మాత్రం చాలా తక్కువ ఉండేవి నానుంచి. తను తన చిన్నతనం గురించి, తన జీవితం లో జరిగిన వివిధ రకాల మలుపుల గురించి, తన బంధువులు, స్నేహితులు, కుటుంబం, అలవాట్లు, ఇష్టాఇష్టాలు లాంటివి ఎన్నో చెప్తూ ఉండేవారు. నేను విని ఊ కొట్టడమే గానీ, నా గురించి ఏదీ చెప్పడం ఉండేది కాదు, తనూ నన్నెపుడూ బలవంతం కూడా చెయ్యనూ లేదు. ఇలా తనతో నా జీవితం గడుస్తున్న క్రమం లో నేనూ మా అమ్మానాన్నల్ని ఎప్పుడూ గుర్తు చేసుకోలేదు. కానీ అప్పుడప్పుడూ నా ఇష్టాఇష్టాలను గురించి చెప్పడం లాంటివి మాటల సందర్భంలో జరిగి నాగురించి కొంత కొంతగా తను తెలుసుకోవడం మొదలు పెట్టేరు.
కొంత కాలం గడిచేసరికి నేనే మాట్లాడడం, నాకేమనిపిస్తోందో, ఏమి కావాలో అన్నీ చెప్పడం, చనువు పెరగడం లాంటివి పెరిగి మా మధ్య మూడు ముళ్ళ పేరుతో పడిన సామాజిక బంధం ఒక ఆత్మ గత సంబంధంగా పెనవేసుకుపోయింది. రోజులు ఎంత త్వరగా గడిచిపోతాయో కదా అన్నీ బాగుంటే.. ఏదైనా కష్టం వస్తేనే సమయం నెమ్మదిగా నడుస్తుంది అనిపిస్తుంది..
నిజానికి కాలానికి, గడియారంలో ముల్లుకి ముందు వెనకలు ఉండవు, అది దాని స్పీడు లో సాగిపోతూ ఉంటుంది. మన మనోస్థితిగతులను అనుసరించే అది త్వరగా అయిపోయినట్టు లేదా నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా జీవితం మాత్రం తన గమనం ఆపదు.
ఆరోజు నాకిప్పటికీ గుర్తే..
నేను హాల్ లో సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నాను. అనుకోకుండా ఒక గాలి తెమ్మెర నా ముందు కదలాడి ఏదో రకమైన ఆనందం కలిగించింది. అటు కళ్ళు తిప్పి చూసే లోపుగానే గుమ్మంలో ఎదురుగా తను ప్రత్యక్షమయ్యేరు. అది ఆ టైమ్ లో నిజంగా నమ్మలేని నిజం. ఆఫీసులో ఉండాల్సిన సమయంలో ఇంట్లో ఎందుకు ఉన్నారు? అంటూ ఆశ్చర్యపోతున్న నాకు ఒక చిన్న గిప్టు ఇచ్చి, “పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు” అంటుంటే నన్ను నేనే గిల్లుకుని చూసుకున్నాను. నిజమేనా, తనకి అలాంటి విషయాలమీద ఆసక్తి ఉండదు. తన పుట్టిన రోజు కి కూడా నన్ను ఏమీ చెయ్యనివ్వలేదు. ఏం సాధించేనని? నాకిలా ఇష్టం ఉండదు అని నన్ను ఆపేసిన తను, ఈరోజు నాకు ఇలా ఆశ్చర్యం కలిగేలా రావడం నిజంగా బాగుంది. నిజానికి నేనూ ఏమీ చేసుకోకూడదు అని నిర్ణయించుకుని కూర్చున్నాను.
తను రావడం తోనే మనసంతా సందడిగా తయారయ్యింది. తేలిక పడిన మనసుతో వెంటనే తనకి నచ్చిన వంట నేనే స్వయంగా నాచేత్తో చేసి, హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం. మళ్లీ మాకు నచ్చిన చోటు ఆ సముద్రపు ఒడ్డుకే వెళ్లి కూర్చున్నాము. ఇప్పుడు ఇద్దరికీ అది ఇష్టమైన చోటే. పైగా కబుర్లు కూడా ఒకరితో ఒకరు పోటీ పడి ఇద్దరమూ చెప్పుకుంటున్నాము.
అంతలో అక్కడికి మాలాంటి మరో జంట వచ్చి కూర్చున్నారు. నవ్వుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. అబ్బాయి ఏదో అనగానే అమ్మాయి అలుగుతోంది. అబ్బాయి బతిమాలుకుంటున్నాడు. ఆమె అలక తీరి సుమనోహరంగా నవ్వుతుంటే ఎవ్వరికైనా మనసు తేలిక పడిపోవల్సిందే. అలాంటిది, అతగాడెంత, అతనూ అదే తన్మయత్వానికి లోనవుతూ ఇంకా ఇంకా అమ్మాయికి కబుర్లు చెప్పి నవ్వించే పనిలో పడ్డాడు.
ఇంతలో ఆమె పక్కగా ఒక చిన్న పాప, వాళ్ళ అమ్మాయే అనుకుంటాను, అచ్చం తల్లి లాగే ఉంది. చాలా చక్కగా ఉంది. అమ్మా, రా అమ్మా, ఆడుకుందాం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాగి ఒడ్డును తాకుతున్న అలలలో కాళ్ళు కొట్టుకుంటూ సంబరపడిపోతోంది. అతడు మాత్రం అక్కడే కూర్చుని సముద్రం వైపు చూస్తున్నాడు. ఏదో ప్రశాంతత అతడి వదనంలో. చక్కని కుటుంబం కదండీ అన్నాను.. అవునంటూ తనూ తలూపేరు. ఇంతలో తల్లీ కూతుళ్ళ ఆటలు పూర్తి అయినట్టున్నాయి, వెళ్దాం అన్నట్టు అతడి చెయ్యి పట్టుకుని పైకి లేపే ప్రయత్నం లో ఉన్నారు. అతగాడు లేచేకా గమనించా, అతడి చేతిలో సెన్సర్స్ ఉన్న చేతికఱ్ఱ.. అతడికి కళ్ళు కనిపించవు అని ఒక నాలుగు అడుగులు వేసేకా గానీ మాకూ తెలియలేదు. వాళ్ళు మాత్రం కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నడుచుకుంటూ సాగిపోవడం ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతూనే ఉండే దృశ్యం. మాకు మాత్రం మా కళ్ళని మేమే నమ్మలేని నిజం.
ఆరోజు చాలాసేపటివరకూ మేము ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకోలేకపోయాం. ఆ విషయం ఇప్పటికీ తల్చుకుంటే మనసు ఏదో తెలీని భావనతో బరువెక్కిపోతుంది. ఉన్న అవిటితనం వారి మధ్య ప్రేమ ముందు అడ్డుగోడగా నిలబడలేదు. అది ఆ దంపతుల చిరునవ్వుల్లో స్పష్టంగా తెలుస్తోంది. ప్రేమ అంటే బహుశా ఇలా పైకి కనిపించే రంగు రూపు లాంటి బాహ్యసంబంధిత విషయాలమీద ఆధారపడి ఉండదు అనేది చాలా చక్కగా ఆ క్షణంలో తెలిసింది.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ఆ తర్వాత వాళ్ళని నేను యెప్పుడూ చూడలేదు. వాళ్ళగురించి తెలుసుకోవాలనీ అనుకోలేదు. అదొక అందమైన చిత్రం నా మనోఫలకం మీద ముద్ర పడిపోయింది. ఆ క్షణానికి నేను చూసినదే నాకు తెలిసిన విషయం.
మళ్లీ ఈరోజు ఆ పిల్లలని చూస్తే నా మనసులో మెదిలిన దృశ్యం అదే. నా చిరునవ్వు తనకి అదే విషయాన్ని తలపించింది అంటే నాకు నమ్మబుధ్ధి కాలేదు. నాగురించి అంతలా తెలుసా అని. నిజానికి ఆ సంఘటన తర్వాత చాలాకాలం మేము ఆ ఊరికి ఆ సముద్ర తీరానికి దూరంగా ఉండాల్సొచ్చింది. తన ఉద్యోగం, ఇంట్లో వివిధ పరిస్థితులు లాంటివి ఎన్నో మేము అక్కడికి వెళ్లడానికి కుదరకుండా చేసేయి.
గత నాలుగేళ్ళుగా నాకు అనారోగ్యం. మరెందుకో ఏమిటో ఎవరూ చెప్పలేదు. డాక్టర్లు వచ్చి మందులు రాసి ఇవ్వడం, నాకోసం తను అహర్నిశలూ నా పక్కనే ఉండి సపర్యలు చెయ్యడం మాత్రమే తెలుస్తోంది. నాకు నా గతం ఏదీ గుర్తు లేదు. ఈ పైన చెప్పిన సంఘటన దాదాపు ఒక నాలుగేళ్ళ క్రితం జరిగిందని తను చెప్తే తెలిసింది. కానీ నాకు నిన్ననే చూసినట్టుంది. అలాగని నా చుట్టూ వచ్చి పోయే మనుషులు, జరిగిన విషయాలు, తను చెప్పిన ఈ కాలంలో జరిగిన యే విషయాలు నాకు లీలామాత్రంగా కూడా గుర్తు లేవు.
కాస్త లేచి తిరగగలుగుతున్నాను కాబట్టి నాకిష్టమైన ఆ సముద్ర తీరానికే తీసుకొచ్చానని తను చెప్తే తెలిసింది, నాకు సముద్రం అంటే ఇష్టం అని. కానీ ఆ చిత్రం మాత్రం అలాగే గుర్తుంది. అదే తనతో చెప్తే, అప్పుడు జరిగిన నాలుగు సంవత్సరాల కాలాన్ని వెనక్కి తిప్పి ఒక్కో విషయాన్ని చెప్పడం మొదలు పెట్టేరు. ఆరోజు ఇంటికి తిరిగి వెళ్ళే సందర్భంలో, నడిచి వెళ్తుండగా ఒక కారు గుద్ది జరిగిన ఏక్సిడెంటులో నాకు విపరీతమైన గాయాలు తగలడమే గాక, నేను అపస్మారకంగా ఉండిపోయానుట. కళ్ళు తెరిచిన కొంత కాలానికి కాస్త తేరుకుని మాటలు మాట్లాడినా, తనని గుర్తు పట్టేను గానీ, జరిగినవి ఏవీ గుర్తు లేకపోవడం తల్చుకుని తను బాధపడడం నాలో భయాన్ని కలిగించింది. కానీ, ఆరోజు ఆజంట ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసిన నాకు, నా భర్త లో కూడా నాపట్ల ఉన్న అంకిత భావానికి ముగ్ధురాలినైపోయాను. జరిగినది గతమో, నా స్మ్రుతో నాకైతే తెలీదు. కానీ జీవితం ఇలా ఆత్మీయంగా సాగిపోయేలా నాకు అనుభవంలోకి రావడం నిజంగా నా అదృష్టం అనే అనుకోవాలేమో.
నెమ్మదిగా ఒక్కొక్కటీ గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నా, ఏదీ అంతగా గుర్తు రావడం లేదు. నా మనసులో జరుగుతున్న ఈ జ్ఞాపకాల సంఘర్షణని ఎవరితోనో ఒకరితో పంచుకోవాలి కాబట్టి, ఇలా నీతో పంచుకుంటున్నాను
– శారద
…… అంటూ వ్రాసేది ఆరోజుకి అక్కడ ముగించి పెన్ను పక్కన పెట్టి వెనుదిరిగి గుమ్మంలో తనకోసం నిలబడి ఎదురు చూస్తున్న భర్త వైపు అడుగులు వేసింది..