Share your Responsibilities

బాధ్యతను పంచుకో …

అబ్బబ్బ ఈ కరోనా కాదు గానీ సరదా తీరిపోతోంది. ఓ పనిమనిషి రాదు, వేరే సాయమూ లేదు. అన్నీ ఒంటిచేత్తో చేసుకోలేక ప్రాణాలు పోతున్నాయి… అని తిట్టుకుంటూ ఒక్కొక్క పని చేసుకుంటోంది రాణి. 

రోజూ ఉదయాన్నే ఫ్రెష్ గా భార్యా భర్తలిద్దరు కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగే అలవాటు. ఇంటి పనులు పనమ్మాయి చేస్తుంది కాబట్టి అంత అలసట ఉండదు‌. రోజు కాస్త బద్ధకంగా మొదలై ఆఫీస్ కి వెళ్ళే టైం కి అంతా హడావుడే. చకచకా వంట, టకటకా టిఫిన్ ఏదో చేసేసి అన్నీ ఆదరాబాదరాగా బాక్సుల్లో సర్దేసి బయల్దేరి ఆఫీసుకి వెళ్ళడం. సాయంత్రం అలిసిపోయి ఇంటికొచ్చి ఏదో ఇంత తిని పడుకోవడం. చాలాసార్లు ఓపిక సరిపోక వచ్చేటప్పుడు కొని తెచ్చుకోవడం లేదా వచ్చాకా ఏ స్విగ్గీయో జమేటో యో ఉండనే ఉన్నాయి. నచ్చినదేదో ఆర్డరిచ్చుకొని తినేసి పడుకోవడమే. మధ్యలో పిల్లలు గొడవ చేస్తున్నారనీ, బయట తిని వారమైపోయిందనీ ఇలా రకరకాల కారణాలతో బయటే భోజనాలు. 
ఇదంతా ఒకెత్తయితే, వండడానికి టైం లేదని, అలసటగా ఉందని అన్నమొక్కటీ వండి, కర్రీ పాయింట్ వద్ద నుంచి కర్రీలు, ఉదయం టిఫిన్ ఇలా ఒక ఏభై శాతం ఇంట్లో ఐతే, మిగతా ఏభై శాతం తిండి బయటనుండే ఆధారం. అందువల్ల డబ్బు ఆరోగ్యం ఎలా పోతున్నాయన్న ఆలోచన పక్కన పెడితే, పిల్లలు తల్లి చేతి వంట కన్నా, బయటి తిను బండారాలకే మొదటి ఓటు వెయ్యడం చాలా దారుణమైన విషయం. 

ఇది వంట సంగతి ఐతే, ఇంకా ఇంటి పని చేసే పనిమనిషి గదులు పావుగంటలో చిమ్మేస్తుంది రోజూ. తను అప్పుడే అరగంట నుంచి కష్టపడుతున్నా, పూర్తవదే అనుకుంటూ తిట్టుకుంటూ ఉండగానే మంచం కింద నుంచి తాను ఎప్పటినుంచో కనిపించడం లేదని వెతుకుతున్న చేతి వాచీ బయట పడింది. తనకు ఎంతో ఇష్టం ఆ వాచ్. తన పెళ్ళికి తన స్నేహితురాలు గిఫ్ట్ గా ఇచ్చింది. అయ్యో, ఇదిక్కడుందా. అని ఆశ్చర్యపోతూ తీసి శుభ్రంగా తుడిచి పైన ఒకచోట‌శ్రధ్ధగా పెట్టి మిగతా గదులు చిమ్మడం పూర్తి చేసింది. 

ఇంతలో ఆమె భర్త రాజు లేచి కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె కాఫీ అతడికి కలిపి ఇచ్చేసి తను గిన్నెలు కడిగే పనిలో పడింది. ఒక్కొక్కటీ తోముతూ, జిడ్డు మరకలూ, ఎండిపోయిన గిన్నెలు, అదే కాక మంచినీళ్ళు తాగి పడేసిన గ్లాసులు, ఒక్కసారి గమనిస్తే సగం గిన్నెలు అలాంటివే. కూరలు తరిగిన గిన్నెలు లాంటివి ఒకసారి అప్పటికప్పుడు తొలిచి పక్కన పెట్టుకుంటే సరిపోయేది, మర్నాడు పనిమనిషి వచ్చేదాకా సింకులో నిండి ఎదురు‌చూస్తాయి. సరే ఎలాగో ఒకలాగ గిన్నెల పని అయ్యింది. అయ్యే‌లోపుగానే బట్టలు మిషన్ లోంచి ఎదురు చూస్తున్నాయి, ఆరేయమంటూ. ఇటునుంచి అటు మళ్ళీ ప్రయాణం. బట్టలారేసేటప్పుడు చూస్తే, కొన్ని బట్టలు అసలెప్పుడు కట్టుకున్నారో కూడా తెలీదు పిల్లలు. ఉతకడం అయిపోయి ఆరెయ్యడం లో ఉన్నాయి. ఇంతలోనే టిఫిన్, అది అవకుండానే వంట ఏర్పాట్లు. అందులోనూ సెలవు పేరుతో ఇంట్లోనే ఉండేసరికి రకరకాల కోరికలు. ఉన్నంతలో యూట్యూబ్ చూసి వాళ్ళడిగిన వంటకాలు తయారు‌చేసి పెట్టి ఇంకా కాస్త ఊపిరి పీల్చుకునే లోగా సాయంత్రం స్నాక్ టైం. సాధారణంగా బయట చాట్ భండార్ లో మసాలా చాట్ లు, పాణీపురీలు గట్రాలు అలవాటైన ప్రాణాలకి ఇప్పుడు ఇంట్లో చేసిన జంతికలు, చెగోడీలు, పకోడీలు లాంటివి చేసి పెట్టి ఇంకా అవన్నీ సర్దుకునే లోపే‌డిన్నర్ లో ఏం చేసుకోవాలనే మంతనాలు, ఆరేసిన బట్టలు మడతలు, ఆనక ఆ మూలా ఈ మూలా ఇంకా సర్దలేదంటూ అవి సర్దుకోవడాలూ, వెరసి ఇదీ గత నాలుగైదు రోజులుగా రాణి నిత్యకృత్యం. తనకి కరోనా కారణంగా ఆఫీస్ సెలవు. అందుకే పనులన్నీ నెమ్మదిగా చేసుకుంటోంది. అప్పటికే ఐదురోజుల లాక్డౌన్ పూర్తయ్యింది. ఆరవ రోజు ఉదయం పనులు పూర్తి చేసుకుని భర్త రాజుతో కాఫీ తాగడానికి కూర్చుంది. ఓ అమ్మాయ్ గారికి మాతో కాఫీకి ఖాళీ దొరికిందే అని వెటకారమాడుతున్న రాజుని చూస్తే ఒకింత కోపమొచ్చినా, ఇలా ఉండడానికి కారణం తనేగా అని ఏమీ మాట్లాడకుండా కాఫీ పూర్తి చేసి మళ్ళీ పనులు మొదలు పెట్టి ఆలోచించసాగింది. 

ఒక పని మనిషి రాకపోవడం వల్ల ఇంత పని కాదు. మిగిలిన వాళ్ళు బాధ్యత పంచుకోకపోవడం వలన పని ఒత్తిడి. పంచుకోవాలంటే ముందు అసలు వాళ్ళకి ఆ ఆలోచన వచ్చే అవకాశం కల్పించాలి. పిల్లలు కూడా మరీ చిన్నపిల్లలేం కాదు. ఎనిమిది చదువుతున్న ఆడపిల్ల, పది చదువుతున్న అబ్బాయి. ఆ వయసులో తను ఇంట్లో అమ్మకి సాయం చేసేది. మరి తన పిల్లలకెందుకు నేర్పలేదని ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికొచ్చింది. 

మర్నాడు ఉదయాన్నే తనతో బాటూ ఇంట్లో అందరినీ నిద్రలేపి రెడీ అవమని చెప్పింది. అయ్యాకా ఎవరు చేయదగ్గ పనులు వాళ్ళకి అప్పజెప్తూ ఉంటే అందరూ ఏడుపు మొహాలేశారు. కాస్త జాలి అనిపించినా ఇప్పుడు నేర్పకపోతే తర్వాత నేర్పించలేదు. ఆ అవకాశమూ రాదు. అందుకే తను నిర్ణయానికి కట్టుబడి ఉంది. అందరూ ఒక రెండ్రోజులు అయిష్టంగానే చేసినా నెమ్మదిగా అలవాటైంది. పనులు కూడా త్వరగా అయిపోతున్నాయి. పిల్లలకి కూడా ఇంట్లో పనులమీద అవగాహన వస్తోంది. కొత్తకొత్త పనులు నేర్చుకుంటున్నారు. రాజు కూడా తనకి చేతనైన పనిలో సాయం చేస్తున్నాడు. అందరూ కలిసి త్వరగా పనులు చేసేసుకుని కలిసి కబుర్లు భోజనాలు, చిన్న చిన్న ప్రాజెక్టులు ఇలా సమయం గడుస్తోంది. 

ఒక వారం తిరిగే సరికి రాజు రాణి పిల్లల్ని చూసి ఆనందపడసాగారు. ఎంత మార్పు. చక్కగా కలిసి పని చేసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం లాంటివి. ఎన్నో ఏళ్ళుగా హడావుడి జీవితాలలో ఏవో తెలీని గమ్యాలవైపు పరుగులలో జీవితంలోని చిన్న చిన్న ఆనందాలు ఎన్నో కోల్పోయారు. అవసరం లేని చిన్న విషయాలకు కూడా చికాకులు, గొడవలూ, ఇల్లంతా ఒక గంభీరమైన యుధ్ధ వాతావరణం. ఎవరి ప్రపంచం వారిది. వాళ్ళు టీవీ, కంప్యూటర్ ల ముందు, వీళ్ళు వీళ్ళ మొబైళ్ళలో… అన్నింటికీ మరో మనిషిపై ఆధారపడడం, ఒకరి కష్టనష్టాలు మరొకరికి తెలియకపోవడం ఇలా ఎప్పుడూ గందరగోళంగా ఉండే జీవితాలకి కరోనా ఒక బ్రేక్ వేసింది. 

బహుశా తమని తాము పరికించి చూసుకోవడానికి ఒక అవకాశం ఇలా ఈ రూపంలో ఇచ్చిందేమో జీవితం. ఎవరెవరికి ఈ పెను తుఫాను ఏ విషయాలను అవగతమయ్యేలా చేస్తోందో తెలీదు గానీ, వాళ్ళింట్లో మాత్రం మంచే జరిగిందనిపిస్తోంది. సంపాదించిన డబ్బూ పలుకుబడీ, ఉద్యోగం హోదా ఏదీ లేదు. ప్రాణభయంతో ఇంట్లో ఉండడం తప్ప. అన్నింటికన్నా ఆరోగ్యం ముఖ్యమని ఈ లాక్డౌన్ కారణంగా తేటతెల్లమవుతోంది. 

అవసరం లేకపోయినా డిస్కౌంట్లు ఇస్తున్నారని, చవకగా వస్తున్నాయనీ కొన్న ఏ ఆడంబరాలు ఉపయోగం లేనివేనని తెలుస్తోంది. ఎన్ని అనవసరమైన విషయాలమీద సమయం డబ్బూ వృధా చేశామో తెలుస్తోంది. ఒక్కసారి తిరిగి చూసుకుంటే పోగొట్టుకున్నదేంటి ఇప్పుడు పొందుతున్నదేంటి అనేది స్పష్టంగా తెలుస్తోంది. 

అప్పుడే నిర్ణయించుకున్నారు రాజు, రాణి. కరోనా వలన మొదలైన ఈ సాంప్రదాయం సెలవలయ్యాకా గూడా కొనసాగించాలని. అందరు కలిసి బాధ్యతలు పంచుకోవడం, కలిసి కాలక్షేపం చేయడం లాంటివి విధిగా చేయాలని గట్టిగా అనుకున్నారు… 

అందుకే పెద్దలు చెబుతారు, పరుగు తీసే టప్పుడు మధ్యమధ్యన ఒకసారి ఆగి, చూసి అప్పుడు కొనసాగించమని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *