Critical Thinking

“హమ్మయ్య… 
లాక్డౌన్ లో రెండ్రోజులు గడిచిపోయాయి (21 రోజులు ప్రకటనలో ఒక్కరోజే అనుకోండి). ఫర్వాలేదనిపిస్తోంది నిన్నటి అప్డేట్స్ చూస్తే. కరోనా బారిన పడ్డవారి సంఖ్యను అదుపులోకి తేగలరనే అనిపిస్తొంది ఈ లాక్డౌన్ పద్ధతి వలన. 

జనానికి బాధ్యత ఉండాలి. ప్రమాదమని చెప్పినా, బయటికెళ్ళొద్దని వారించినా అడపా దడపా ఎవరో ఒక ఆకతాయి రోడ్డుమీద కనిపిస్తూనే ఉన్నారు. 

నిన్న అత్యవసరంగా సరుకులు తేవడానికని మన పక్కవీధిలో కిరాణా షాపుకెడితే అక్కడ నలుగురైదుగురు కుర్రాళ్ళు కొనడానికి వచ్చి ఉన్నారు. పాపం రూముల్లోనో ఇళ్ళల్లోనో చిక్కుబడిపోయి ఉన్నవాళ్ళు అనుకున్నాను. తీరా క్యూలో నిలబడ్డది సిగరెట్లు కోసమట?? అలవాట్లు సుధరాయించుకోవడానికి ఇది ఒక మంచి సమయం. ఇదే అదునుగా మానే ప్రయత్నం పోయి, మళ్ళీ స్టాక్ ఎప్పుడు తెస్తారు? మొత్తం పెట్టి ఇస్తారా? మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి అంటూ ఆరా తీస్తున్న ఆ యువతరం కధానాయకుడొక్కొక్కడినీ పిలిచి కనీసం ఒక నాలుగు రోజులు క్వారంటైన్ వార్డులో పెడితే బాగుణ్ణు, బుధ్ధొస్తుందేమో అనిపించింది. 

ఇంతలోనే ఓ పెద్దాయన. నడవడానికి కర్రతోడు లేనిదే అడుగు బయటకేయలేని స్థితిలో చిన్న బిస్కెట్లు పేకెట్ కోసం ఇంట్లోంచి ఈ సమయంలో రావలసిన అవసరమేమిటో మరి. కొంత మొండితనం మరికొంత నిస్సహాయత. రెండూ కలగలిపి నే చూసిన దృశ్యాలు జనానికి ఇదెంత తేలికగా కనిపిస్తోందో చెప్పకనే చెప్తున్న వైనం.” అంటూ గుక్క తిప్పుకోకుండా అద్దం ముందు కూర్చుని తనతో తానే చెప్పుకుంటూపోతోంది జయ. 

జయ ఒంటరి స్త్రీ. ఆమె ఉద్యోగం కోసం ఇంటినుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళది చిన్న పల్లెటూరు. తండ్రి వ్యవసాయం. ఆడపిల్ల చదువుకుంటే కుటుంబం దేశం రెండూ బాగుపడతాయని గట్టిగా నమ్మే వ్యక్తి కావడం చేత ఆమెను కాలేజీ రోజులనుంచి పట్టణంలో హాస్టల్ లో ఉంచి చదివించాడు. ఒక్కతే కూతురు కావడం వలన సెలవు దొరికిన ప్రతిసారి పరుగెత్తుకుంటూ తల్లితండ్రులను చూసొచ్చేది ఆమె. మొదట్లో కాస్త బెంగగా ఉన్నా నెమ్మదిగా అలవాటైంది. చదువై అదే పట్టణంలో ఉద్యోగం దొరికిందని ఒక రూమ్ అద్దెకు తీసుకొని మరొక స్నేహితురాలితో కలిసి ఉంటోంది. 

ప్రతి వారం లాగే ఈ వారమూ వెళ్దామనుకుని, సరే ఉగాదికి మధ్యలో ఒక్కరోజే కదా అని, ఆరోజుకి ఇంటికెళ్ళి పోదామని ఆగిపోయింది. ఆమె స్నేహితురాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉందని ఇంటికెళ్ళి పరిస్థితుల వలన అక్కడినుంచే నడిపించుకుంటోంది. 

తను బొత్తిగా ఒంటరిదైపోయింది. పరిస్థితులకు సంబంధించిన వార్తలు వింటున్న ప్రతిసారి మళ్ళీ తల్లిదండ్రులను ఎప్పటికి చూస్తానో అని ప్రాణమంతా గుబులుగా అయిపోతోంది. తమది పల్లెటూరు కావడం వలన వ్యాధి ఆ ప్రాంతానికి సోకే అవకాశాలు లేవన్న ధీమా. బయటి ఊళ్ళవాళ్ళు వచ్చే సందర్భాలే తక్కువ. సో వాళ్ళ గురించి ఇబ్బంది లేదు. 

పక్కింట్లో ఉండే వృధ్ధ దంపతులకు వచ్చేటప్పుడు కావలసిన అవసరాలకు సరిపడా సరుకులు అందించి, అవసరమైతే పిలవమని చెప్పి వచ్చింది. వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. వీళ్ళిక్కడ ఒంటరి పక్షులు. ఇప్పుడు వీళ్ళలో తను తన తల్లిదండ్రులని చూసుకుంటోంది. 

ఇక తన విషయమే. రూమ్ లోంచి బయటికెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ అవసరమనిపించినంత తెచ్చుకుంది. కానీ ఈ ఒంటరితనం, భయం పంచుకోవడానికెవరూ లేకపోవడం కాస్త ఇబ్బంది. మూలనున్న లైబ్రరీ తెరిచి అప్పుడప్పుడు కొన్న పుస్తకాలవంక చూసి కాస్త ఊరట కలిగింది. చదవడం మొదలు పెడితే ప్రపంచంతో పనుండదు ఆమెకి.

అందుకే సమయం దొరికింది కాబట్టి ఇప్పుడది సద్వినియోగం చేసుకుందామని నిశ్చయించుకుంది. ఎవరితోనైనా మాట్లాడితే బాధ భయం పంచుకోవాలి. కానీ అందరూ అదే స్థితిలో ఉన్నపుడు, ఎవరికి వారే ధైర్యంగా ఉండాలి. ఇదే తను హాస్టల్ లో చేరిన కొత్తల్లో తల్లి చెప్పిన మాట. అందుకే అద్దం ముందు కూర్చుని తనతో తానే మాట్లాడుకోవడం, డైరీ వ్రాయడం వంటివి అలవాటు చేసుకుంది. అదిప్పుడు బాగా ఉపయోగపడుతోంది. 

ఇలా ఏవేవో ఆలోచనలతో ఉండగానే తల్లి ఫోన్. అన్నీ మర్చిపోయి వెంటనే నవ్వుతూ, ఏమీ భయం లేదమ్మా. నేను బాగున్నాను. బయటికి పోవడం లేదు. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. పరిస్థితులు సర్దుకున్న వెంటనే వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అని ఇద్దరికీ చెప్పి కాల్ కట్ చేసి పుస్తకం వైపుకు చెయ్యి చాచింది.

ఇలాంటి ఒంటరి జయ లు ఎంతమందో ఉన్నారు. ఎంత ఆత్మస్థైర్యంతో నిలబడుతున్నారో మరి. మనకున్న చదువు జ్ఞానం మనకి తెలివితో బాటు సమయస్పూర్తిని, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. అన్ని బావున్నప్పుడు అందరూ హీరోలే. బాగా లేనప్పుడే మనమెంత గొప్పగా ఆలోచించి నిలబడగలం అనేది తెలిసేది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *