Empathy

“ఏది ఏమైనా పెద్దాయన చేసినది తప్పే ఒదినా. ఎందుకు ఇలాంటి సమయంలో ఇంట్లోంచి బయటికెళ్ళాలి? అసలు ప్రమాదం వయసు పైబడినవారికేనంటూ పదే పదే ప్రకటనలు వింటూనే ఉన్నాంగా. నీకూ నాకూ తెలిసినప్పుడు, అంత వయసున్న ఆయనకి తెలియదంటే ఏం చెప్పాలి. ఇది కేవలం నిర్లక్ష్యం, మొండితనం తప్ప మరేదీ కాదు”, అంటూ ఆవేశంగా తన ఒదినగారితో బాహాటంగానే ఫోన్ లో మాట్లాడుతోంది సంజన. 

ఇంతలో తన మాటలు వింటూ భర్త వివేక్ బయటికి రావడంతో సంభాషణకు బ్రేక్ వేసి, సర్లే ఒదినా. మీరు జాగ్రత్త. మేమూ జాగ్రత్తగానే ఉంటాంలే అంటూ కాల్ కట్ చేసింది. 

అతడి తండ్రి ఒంటరిగా ఊళ్ళో ఉంటాడు. ఆయనకు 60 పైబడిన వయసు. వీళ్ళతో కలిసే ఉండేవాడు తల్లి పోయిన కొత్తల్లో. కానీ కోడలి పధ్ధతులు నచ్చక, సర్దుకోలేక, కొడుకు సంసారంలో గొడవలు పెట్టడం ఇష్టం లేక “నేను ఆశ్రమానికి దగ్గరగా ఉంటానురా. అమ్మ ఎలాగూ లేదు. ఆమె జ్ఞాపకంగా ఆ ఆశ్రమానికి వెళ్ళొస్తూ అక్కడ నాకు చేతనైనది చేస్తూ కాలం గడిపేస్తా. అక్కడంతా నా వయసు వాళ్ళేగా. అందరం ఒకరికి ఒకరు ఆసరాగా కూడా ఉంటాం. అవసరమైతే నేను కాల్ చేస్తాను. మీకు వీలున్నప్పుడు వచ్చి చూసెళ్దురు” అంటూ కొడుకు నొచ్చుకుంటాడని తెలిసినా బయల్దేరి వెళ్ళి అదే ఊరికి రెండవ వైపున ఉన్న వృద్ధాశ్రమం దగ్గర్లోనే తన భార్య ఉండగా కట్టించిన ఒక గది వంటిల్లు ఉన్న ఇంట్లో ఉండటం ప్రారంభించాడు. అక్కడినుంచే ఆశ్రమానికి రోజూ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో, తన భార్య జ్ఞాపకాలతో గడిపేవాడు. 

ఉగాదికి రమ్మని కొడుకు పిలిచినా, ఎందుకో ఈసారి మనస్కరించలేదు. అప్పటికే ఈ సోషల్ డిస్టెన్సింగ్ అమలులో ఉండడం వలన అదేదో అయ్యాకా వస్తా లేరాఅమ్మాయి, పిల్లలూ జాగ్రత్త అని చెప్పేసేడు. 

ఆరోజు నుంచీ ఆయనా బయటికెళ్ళడం మానేసి ఇంట్లో ఉన్న వాటితోనే కాలక్షేపం చేసుకుంటున్నాడు. స్వతహాగా ఆరోగ్యం, ఆత్మబలం ఎక్కువే ఆయనకి. అందుకే ఒంట్లో ఓపికున్నంతదాకా ఎవరిమీదా ఆధారపడకూడదు. చేతనైతే ఎవరికైనా సాయం చేయాలనే తపనతోనే ఆ వృద్ధాశ్రమానికి తరచూ వెళ్ళి, వాళ్ళతో కబుర్లు చెప్పడం, కొత్తగా వచ్చినవారికి మానసిక బలాన్ని ఇచ్చేలా కౌన్సిలింగ్ చేయడం, చిన్న చిన్న పనులు,వ్యాయామాలు చేయించడం, పోటీలు నిర్వహించి అందరినీ పాల్గొనేలా ప్రోత్సహించడం లాంటివి చేసేవాడు. 

ఆరోజు, ఉన్నపళంగా రావాలి, ఇక్కడ పరిస్థితి ఏమీ బాగా లేదు. రామారావ్ అనే ఒక పెద్దాయన ఆత్మహత్యా యత్నం చేయబోతుంటే అదృష్టం బాగుండి సరైన సమయానికి అటుగా వెళ్తున్న వారెవరో చూసి అడ్డు పడి ఆపారు. అప్పటి నుంచి ఆయన కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాడు. మీరొచ్చి మాట్లాడితే కాస్త ఉపశమనం పొందుతాడేమోనంటూ ఆ ఆశ్రమం నిర్వహిస్తున్న రమేష్ బాబు కాల్ చేశాడు. 

ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలి అని ఆలోచించినా, ఆలస్యం చేస్తే ఆ మిగిలినవారు కూడా ఇలాగే ఆలోచించే ప్రమాదం ఉంది. వెళ్ళడమే సరైన నిర్ణయంగా తోచి ఇంటినుంచి తగిన జాగ్రత్తలతో బయల్దేరాడు. దారిలో ఒక పోలీసాయన ఆపి, తాతగారు, ఈ సమయంలో ఇంట్లోంచి రావద్దంటే బయట ఏం పని మీకు, పదండి లోపలికంటూ వారించాడు. కాస్త మృదు స్వభావిగానే కనిపించిన అతడితో జరిగినదంతా చెప్పి, నాకొక సాయం కావాలి. అవసరం కాబట్టి నాకు మీరు తోడుగా రండి. అక్కడ పరిస్థితి చూసి ఒకసారి మాట్లాడి వచ్చేద్దాం, అన్నాడు పెద్దాయన. 

ఆ పోలీస్ కి ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిదండ్రులు కళ్ళలో మెదిలారో ఏమో, వెంటనే ఒప్పుకొని పెద్దాయనతో ఆశ్రమానికెళ్ళి, అక్కడ వాళ్ళతో కాసేపు సమయం గడిపాడు. ఇంతలో పెద్దాయన రామారావు గారికి ధైర్యం చెప్పి, కౌన్సిలింగ్ ఇచ్చి, రమేష్ బాబు కు అప్పజెప్పి మిగిలిన వారితో కూడా ధైర్యంగా ఉండమని చెప్తూ మాట్లాడుతున్నాడు. ఇంతలో ఆ పోలీసు, వారికి కావలసిన అర్జెంటు అవసరాలు తెలుసుకొని బయటికెళ్ళి తీసుకొచ్చి, అవసరమైతే తనకు కాల్ చేయమని నెంబర్ ఇచ్చి పెద్దాయనని తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు.

ఇంటికి చేరిన రోజున సాయంత్రం ఆ పోలీసు, తను కలిసి వెళ్ళడం, మాట్లాడడం వంటి దృశ్యాలను అసందర్భంగా మీడియాలో ప్రచురించడం జరిగింది. అదే పెద్ద వార్తగా ఊరంతా షికార్లు చేసి కోడలి కంట పడింది. కొడుకు ఇది చూసిన వెంటనే కాల్ చేసి అసలు విషయం తెలుసుకొని, తండ్రిని మరీ మరీ జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కోడలు మాత్రం ఒక వంక దొరికిందని ఆమె ఒదినగారితో ఇదే విషయాన్ని మరింత చిలవలు పలవలుగా చెప్తోంది. 

ఇదీ కథ … (బహుశా వాస్తవమే) 
ఈ కష్టకాలంలో బయటికొచ్చిన ప్రతివారూ నిర్లక్ష్యంతోనే రాకపోవచ్చు. ఇలాంటి అత్యవసర పరిస్థితులెన్ని ఎదురౌతాయో. కాస్త ఆలోచించి అడుగు ముందుకేద్దాం.

కంటికి కనపడేది, చెవులకు వినపడేదీ అన్ని సార్లూ నిజాలు కానవసరం లేదు. మాట పలికే ముందు మంచి చెడు ఆలోచించి మాట్లాడడం అవసరం. 

మనసులలో ఉన్న దూరాలు తొలగించుకోవడానికి ఇదే సరైన సమయం. ఒకరినొకరం అర్ధం చేసుకుని గడుపుదాం. ఒకరికొకరం మానసికంగా మరింత బలాన్ని ఇద్దాం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *