Surya Rekha

“ఎప్పుడూ పూచే మల్లె పరిమళాలెందుకో చల్లగా లేవు
ఎప్పుడూ చూసే గులాబీలెందుకో ఎర్రగా లేవు
ఈ పొద్దు సూరీడు ఎందుకో నిన్నలా లేడు
ఆ గాలి ఈరోజెందుకో హాయిగా లేదు …”
ఇలా కవిత రాస్తూ ఒక్కసారి కలం పక్కకి పెట్టి చూశాడు రవి.

నిలబడి తను వ్రాసే కవితను తదేకంగా చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న చెల్లెలు కాంతి. ఏమైందే, అంతలా మురిసిపోతున్నావు? అయినా నేను వ్రాసుకునేటప్పుడు అలా వెనకనుంచి చూడద్దన్నానా.. అంటూ చిరుకోపం ప్రదర్శించాడు రవి.

ఆ.. అలాగేలే గానీ, ఇంతకీ ఎవర్రా అన్నయ్యా ఆ అమ్మాయి? ఎప్పుడూ చెప్పనే లేదు అంటూ కళ్ళెగరేస్తూ చిలిపిగా అడిగింది కాంతి.

పెదాలపై వచ్చే నవ్వుని బలవంతంగా అదిమి పెడుతూనే, కాంతి నెత్తిమీద చిన్నగా మొట్టి, ఎవరది? ఎవరూ లేరే… ఐనా నీకెందుకే అవన్నీ.. పెద్ద ఆరా తీయడానికొచ్చావ్.. ఫో పోయి నీ పని చూసుకో అంటూ ప్రేమగా చెల్లెల్ని గదమాయించి అక్కడినుండి తప్పుకోబోయాడు.

ఐతే చెప్పవా, ఆగు, అమ్మని పిలుస్తా… అమ్మా, అమ్మా.. అంటూ అరుస్తున్న కాంతి నోరు నొక్కి, తల్లీ నిజ్జంగా ఎవరూ లేరే. నన్ను నమ్ము అంటూ దొంగ ఒట్టొకటి వేసి ఆ గదిలోంచి బయటపడ్డాడు రవి. అతడినే చూస్తూ ఇంకా నవ్వుకుంటూ నిలబడింది ఆలోచిస్తూ.

కాంతికి అన్నగారంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళిద్దరికీ వయసులో తక్కువ తేడా కావడం వలన కలిసే పెరిగారు. చిన్నతనం నుంచీ చెల్లెలంటే రవికి కూడా చాలా ఆప్యాయత. వాళ్ళిద్దరు అన్నాచెల్లెళ్ళే కాక మంచి స్నేహితులు కూడా. అరమరికలు దాపరికాలు లేని వారి అన్యోన్యత తల్లికి ఎప్పుడూ ఆనందాన్నే ఇచ్చింది. మరీ వాళ్ళని చూసి మనసు పొంగిపోతే, అయ్యో పిల్లలకి నా దిష్టే తగిలేలా ఉంది. భగవంతుడా వీళ్ళిద్దరినీ చల్లగా చూడు తండ్రీ అని ఎల్లవేళలా మొక్కుకునేది.

కాంతి ఆలోచనలు ఎటో ప్రయాణం మొదలు పెట్టాయి. నిన్న ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు చూసిన అమ్మాయేనా? అమ్మాయి బాగానే ఉంది. ఒకసారి సాయంత్రం కదిపి చూస్తా ఏమంటాడో. మా రవి లాంటి మంచి అబ్బాయికి భార్యకావడం అంటే ఆ అమ్మాయి పెట్టి పుట్టాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్ రా అన్నయ్యా అనుకుని మెల్లగా అక్కడినుంచి కదిలింది.

రవి బయట గదిలో ఆలోచనలో పడ్డాడు. నిన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దారిలో ఒకమ్మాయి లిఫ్ట్ అడిగింది. బండి ఆపి అటూ ఇటూ చూశాడు. దారంతా ఖాళీగా ఉంది. ఎక్కడా బస్సు ఆటో లాంటి వాటి జాడలేదు. ఆ దారిలో ఇళ్ళు కూడా ఏవీ లేవే అనుకుంటూ, “ఎక్కడికి వెళ్ళాలండీ అనడిగాడు”.
“నన్ను ఊళ్ళో దగ్గర్లో ఉన్న బస్టాప్ దగ్గర దింపుతారా, ప్లీజ్” అనడిగింది. “అది సరే, మీరేమనుకోనంటే ఒక్కమాటడుగుతాను. అసలిక్కడ ఇలా ఒక్కరే ఎందుకున్నారు” అనడిగాడు.

అమ్మాయి మొహం చిన్నబుచ్చుకోవడం కనిపించింది. అనవసరంగా అడిగానా అనుకుని, కాదులే, తెలుసుకోవడం అవసరమే అని మళ్ళీ సర్దుకున్నాడు.

“ఈ రోడ్ చివర దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక వృద్ధాశ్రమం ఉంది. దాదాపు నలభై మంది పెద్దవాళ్ళుంటారు అక్కడ. తరచూ నేను ఇక్కడికి వచ్చి వాళ్ళని పలకరించి నా సమయాన్ని గడిపి వెళ్తుంటాను. ఈరోజు నా పుట్టిన రోజు కావడం వలన ఉదయాన్నే వాళ్ళకి కావలసిన స్వీట్లు అవీ తీసుకొని వచ్చి ఇప్పటిదాకా గడిపాను. సాధారణంగా ఈ రెండు కిలోమీటర్లు నడిచే వెనక్కి వస్తాను. ఇంకాస్త దూరంలో ఒక బస్టాండు ఉంది. అక్కడికెళ్తే నాకు ఇంటికి బస్సు దొరుకుతుంది.

అందుకే ఇలా నడుస్తూ వచ్చాను. ఇంతలో ఇద్దరు ఒక ఆటోలో వెళ్తూ నా దగ్గర ఆపి ఎక్కమని గొడవ చెయ్యబోయారు. వాళ్ళదగ్గర ఏదో కంపు. వాటం కూడా అదోలా ఉండేసరికి భయం వేసి ఎవరైనా సాయానికి వస్తారేమో అని చూస్తూ త్వరగా నడక సాగిస్తుండగా వెనక మీ బండి చప్పుడైంది. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నాకింకా దడ తగ్గలేదు. కాస్త భయంగా ఉంది మళ్ళీ వస్తారేమో అని. అందుకే మిమ్మల్ని లిఫ్ట్ అడిగానంది.”

అప్పుడు చూశాడు ఆ అమ్మాయి మొహం వైపు పరిశీలనగా. చిరుచెమటలు పోసి భయంతో ఇంకా వణుకుతున్నట్టే ఉంది. చూడడానికి పసిమి ఛాయతో చక్కని కళ ఉట్టిపడుతూ ఉంది. ఆమె చెప్పేదానిలో ఏమాత్రం అబధ్ధం ఉందనిపించలేదు. జాలి కలిగి సరే పదండి అని బండి ఎక్కించుకొని బయల్దేరాడు.

బస్టాప్ లో దింపెయ్యడానికి మనసు రాలేదు. “మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇల్లెక్కడో చెప్తే అక్కడే దింపుతాను. మళ్ళీ బస్సు అదీ ఎందుకు అన్నాడు.” ఆమె మారు మాట్లాడకుండా సరేనంది. ఎంతగా భయపడిందో మరి. ఆమె దారి చూపిస్తుంటే నెమ్మదిగా ఇంటి దగ్గర వదిలిపెట్టి, వెనక్కి తిరిగాడు. ఆమె థాంక్స్ చెప్పడం పూర్తిగా చూడకుండానే బయల్దేరి పోయాడు. వదిలేస్తున్నా అన్నీ చిరు బాధ కలిగినా, తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది.

తన ఇంటికి చేరి ఫ్రెష్ అయి భోజనానికి కూర్చున్నాడన్న మాటే గానీ మనసంతా ఇంకా ఆమె చుట్టూనే తిరుగుతోంది. చక్కని రూపం, అంతకన్నా చల్లని మనసు. అరుదైన కాంబినేషన్. అసలు మళ్ళీ కనిపిస్తుందా? ఒకవేళ కనిపించినా, ఏం చెప్పాలి? అది సరికాదనిపించింది. అంతే అక్కడితో ఆ ఆలోచనకు స్వస్తి పలికి నిద్రకి ఉపక్రమించాడు.

ఉదయం లేవగానే నిన్న జరిగినదంతా ఒక కలలా అనిపించింది. స్వతహాగా కవి కావడం వలన కలం దానంతటదే ముందుకు కదిలింది.

కొన్ని స్మృతులు స్మృతులుగా మనసులోనే పదిలంగా ఉండి తీయగా గుర్తొస్తేనే బాగుంటుంది.

కాలాన్ననుసరించి ప్రాధాన్యతలు మారవచ్చు. కానీ కొన్ని అనుభవాల తీపిగుర్తులెప్పుడూ తీయని చిరునవ్వులే తెస్తాయి.

సాయంత్రం చెల్లెలు అడిగినప్పుడు కూడా అదే చెప్పాడు… ఆమె కూడా మనసారా సంతోషపడింది అన్నగారి సంస్కారాన్ని వ్యక్తిత్వాన్ని చూసి.

నెల రోజుల తర్వాత తమ బంధువొకాయన రవికి సంబంధం తీసుకొని వచ్చాడు. అతడి తల్లికి ఆ అమ్మాయి వివరాలు, ఫొటో రెండూ నచ్చాయి. సరే రవితో మాట్లాడి చెప్తానంది ఆమె.

రవి టేబుల్ మీద అమ్మాయి ఫోటో ఉంచి, తీరిక కుదిరాకా చూడమని చెప్పింది తల్లి ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు. సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూనే బల్ల మీద ఫొటో సంగతి గుర్తొచ్చి అటు తల తిప్పి చూశాడు. అక్కడున్న ఫొటోలో అదే అమ్మాయి….
పేరు “రేఖ”…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *