• lavibuddha@gmail.com
  • +91 81603 83161

Noble Mother’s Innocent Daughter

“నటించాలంటే పాత్ర కావాలన్నారని, ఈ పాత్ర తీసుకెళ్తున్నాను నాన్నా” అంటున్న కూతురి అమాయకత్వం చూసి తల బాదుకుంటుంటాడు నాగభూషణం.

అతడొక నగల వ్యాపారి. అడ్డగోలుగా వ్యాపారం చేస్తూ, కల్తీ నగలమ్ముతూ, నమ్మిన వారినే మోసం చేస్తూ కావలసినంత లాభం పొందాడు. కానీ భార్య కడుపు పండలేదనే దిగులు చాలా కాలం అలాగే ఉండిపోయింది.

కాంతం అతని సతీమణి. సినిమాల్లో సావిత్రిలా మహా సాధ్వి. అతడెంతగా మొత్తుకున్నా వినకుండా దానాలు ధర్మాలు దండిగా చేసేది. పూజలు, ఉపవాస దీక్షలు, వ్రతాలు నోములు మొక్కుబడుల పేరుతో వాయనాలనీ, దక్షిణలనీ, ముడుపులనీ ఏదో ఒక ఖర్చు చేస్తూనే ఉండేది. అతగాడేమో, “నీ పిచ్చి గానీ నా సంపాదననంతా ఇలా దండిగా దండగగా ఖర్చుపెడుతూ పోతే పిల్లలు పుట్టడం, పుణ్యం రావడమటుంచి పుట్టగతుల్లేకుండా పోతాం. అప్పుడు నువ్వు విరాళమిచ్చి ఉద్ధరించిన గుడి బయటే అడుక్కు తినాలి మనం” అనేవాడు నాగభూషణం.

అతడెంత మొత్తుకున్నా కాంతం మాత్రం తన పనులు తాను అనుకున్నట్టే చేసేది. మరి ఏ దేవుడు కరుణించాడో, ఏ దేవత మొరాలించిందో, పెళ్ళైన పదిహేనేళ్ళకి ఆమె కడుపు పండి చక్కని ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాప పెరుగుతూ ఉన్న క్రమం లోనే, బిడ్డలు కలిగారన్న ఆనందం నిలవకుండా, పాపకు మతి స్థిమితం లేదనీ, అమాయకంగానే ఉంటుందనీ తెలిసింది.

ఎంతమంది డాక్టర్లు, మానసిక వైద్యనిపుణులు ఇలా ఎందరిని కలిసినా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఆ దిగులు తోనే మంచం పట్టి రెండేళ్ళ క్రితమే కాంతం తను నిత్యం భక్తిశ్రద్ధలతో పూజించుకొనే భగవంతుడిని చేరుకుంది.

అతడు, అతని కూతురు దాదాపు ఒంటరి పక్షుల్లా మిగిలిపోయారు. భార్య మరణం నాగభూషణంలో చాలా మార్పును తెచ్చింది. కూతురిని తల్లీ తండ్రీ తానే అయి చూసుకోసాగాడు. ఇప్పుడు మనసునిండా కూడగట్టుకున్న దిగులు అతడిని కలచివేస్తోంది. తెలివితేటలు కలిగిన పిల్లైతే బానే ఉండేది. ఇప్పుడు ఆ పాపకీ తల్లీ లేదు, మతి స్థిమితం లేదు.

తన తర్వాత ఈ పిల్లకి దిక్కేమిటి? ఒంటరిగా ఎలా బ్రతుకుతుందంటూ ఆలోచిస్తూ దుఃఖపడసాగాడు. ఈ దుఃఖంలో అతడూ పనులన్నీ మానుకుని దిగులుగా ఉండిపోవడం వలన అనారోగ్యం పాలయ్యి రోజులు అతికష్టం మీద గడుపుకొస్తున్నాడు. ఈ పిల్లకి ఒక దారి చూపించు భగవంతుడా అంటూ వేడుకోని క్షణం లేదు.

ఈమధ్య తన కూతురితో ఏదో మార్పు కనిపిస్తోంది. అమాయకత్వం ఎలా ఉన్నా, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం, కాఫి, టీ, మంచినీళ్ళలాంటివి అందించడం అతడి దృష్టిని దాటిపోలేదు. అదే కాదు తనవైన చిన్న చిన్న పనులు చేసుకోవడం, ఇదివరకంతటి అల్లరిగా లేకపోవడం లాంటివి కూడా చూస్తున్నాడు. అతడికి ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. ఈ మార్పుకి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించసాగాడు.

కూతురు రోజూ ఒకటి రెండు గంటల సమయం పైన అద్దెకున్నవారింట్లో గడుపుతోందని అర్ధమైంది. 

ఈమధ్యే ఒక పెద్దావిడ, ఆమె కూతురు అద్దెకు దిగారు తమ పై వాటాలో. వాళ్ళిద్దరే ఉంటారనీ, వాళ్ళకి ఎవరూ లేరనీ చెప్పారు. తను ఇంట్లో ఉన్న ఒంటరి ఆడపిల్లకి కాస్త తోడుగా ఉంటారన్న ఆలోచనతో అద్దెకు ఇచ్చాడు. పెద్దామె పూజలు, పునస్కారాలలో తన సమయం వెళ్ళబుచ్చంకుంటోంది. ఆమె కూతురు సైకాలజిస్టుట. తన స్వంత ప్రాక్టీసు ఉందని చెప్పారు. అప్పుడే కొంత కొంతగా అర్ధమైంది. బహుశా ఆ అమ్మాయే తన కూతురిలో మార్పుకి కారణమని. తను ఒకరోజు చూడడానికి వెళ్ళేసరికి ఆమె తన కూతురిని కూర్చోబెట్టి ఏదో పుస్తకం చదివిస్తోంది డాక్టరమ్మ. తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా చూస్తూ ఉండిపోయాడు.

కాసేపటి తర్వాత డాక్టరమ్మతో మాట్లాడినప్పుడు తెలిసింది. అందరికీ ఒకే రకమైన గ్రహింపు శక్తి ఉండదు. ఒక్కొక్కరిని ఒక్కోలా డీల్ చేయాల్సి ఉంటుంది. తన కూతురు అమాయకంగా ఉన్నప్పటికీ, ఆమె ఒక సైకాలజిస్టుగా పూర్తిగా అర్ధం చేసుకుని, ఆమెకు సైకలాజికల్ థెరపీ ఇవ్వడం ప్రారంభించింది. మొదట్లో స్థిరంగా కూర్చునేది కాదు. నెమ్మదిగా మార్పు వచ్చింది. ఇప్పుడామె నమ్మకం వ్యక్తపరుస్తోంది. “మీ అమ్మాయికి ఏ భయమూ లేదు. తను ఒంటరిగా కూడా ధైర్యంగా తన కాళ్ళపై తాను నడిచేలా నేను తయారు చేస్తాను. మీరు దిగులు పడకండి” అని చెప్పిన ఆ డాక్టరు తనకి దేవతలా కనిపించింది.

క్రమేణా కూతురిలో మార్పు వచ్చింది. కానీ అప్పటికే నాగభూషణానికి అనారోగ్యం ముదిరిపోయి చివరి శ్వాసలు లెక్కపెడుతున్నాడు. డాక్టరమ్మని పిలిపించి తన కూతురిని ఆమెకు అప్పగించి ఇక ఆమె బాధ్యత వాళ్ళే చూసుకోవాలనీ, తన ఆస్తి కూతురి పేరు మీద ఉందని, ఆమెకు అన్నిరకాల తోడుగా ఉండి మంచి వరుణ్ణి చూసి వివాహం చేయాలని తన ఆఖరి కోరికగా చెప్పి కన్ను మూసాడు.

ఈ దుఃఖం నుంచి కరుణ (నాగభూషణం కూతురు) తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. అప్పుడు కూడా డాక్టర్ తన స్వంత చెల్లెలి లాగే ఆమెను సాకింది. కాస్త తేరుకున్నాకా ఆమె తండ్రి చివరి కోర్కెను తెలియజేసింది డాక్టరు. “మంచి సంబంధం చూస్తాను, పెళ్ళి చేసుకొని ప్రశాంతంగా జీవితం గడుపుదువుగాని” అని చెప్పింది. 

కానీ కరుణ అప్పటికే ఒక నిర్ణయానికొచ్చింది. వెంటనే ఆలస్యం లేకుండా, తన ఆలోచనని డాక్టరు ముందు ప్రస్తావించింది. “అక్కా, నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. నీ దయ వలన ఒక నార్మల్ జీవితాన్ని గడపగలుగుతున్నాను. నాలాంటి వాళ్ళెందరో ఈ ప్రపంచంలో ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. నా వంతుగా ఈ ఆస్తిపాస్తులన్నీ వినియోగించి ఒక మానసిక చికిత్సాలయం ఏర్పాటు చేద్దాం. మనమే సేవ చేద్దాం. కొంతమంది నైనా నాలా నార్మల్గా వారి జీవితాలు గడుపుకోగలిగేలా చేయగలిగితే మా అమ్మ ఆశ ఆశయం తీరుతుంది. ఆమె చనిపోయేటప్పటికి నాకు పదమూడేళ్ళ వయసు. అర్ధం చేసుకోలేక పోయినా ఆమె మాటలు నాకు గుర్తున్నాయి. ‘మనకి చేతనైనంతలో ఇతరులకి సాయం చేయాలి. జీవితమంటే కేవలం బ్రతికెయ్యడం కాదు. ఒక సార్ధకతను వెతకడం’ అని చెప్పి నన్నొదిలి వెళ్ళిపోయింది మా అమ్మ.

అదృష్టమో దురదృష్టమో, మా నాన్న చాలానే ఆస్తి వదిలి వెళ్ళాడు. దాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం ప్రారంభిద్దాం” అని చెప్పింది.

డాక్టరమ్మ కళ్ళలో అప్రయత్నంగానే నీరు నిండింది. అంతటి అమృతమూర్తి కడుపున ఇలాంటి బిడ్డలే పుడతారని స్పష్టంగా తెలుస్తోంది. కాంతం గారు బ్రతికున్న రోజుల్లో చేసిన దానధర్మాలు అందుకున్న ఎంతో మందిలో ఆమె ఒకత్తి. తన చదువుకు సంబంధించిన అన్ని ఖర్చులూ ఆమే భరించారు. డాక్టరు కావాలన్న తన కల నెరవేరడానికి ఆమే కారణం. అలాంటి కాంతంగారి మరణ వార్త విని చూడడానికొచ్చినప్పుడే కరుణను గురించి తెలుసుకుని, ఎలాగైనా ఆమె ఋణం తీర్చుకోవాలనే తపనతో ఆ ఇంట్లో అద్దెకు దిగారు వాళ్ళు. ఆ కృతజ్ఞతతోనే కరుణకి తోడుగా నిలబడింది.

కానీ కరుణ ఈరోజు ఎంతో ఎత్తుకి ఎదిగిపోయి కనిపిస్తోంది. ఆ ఆలోచనని సాకారం చేయడానికి తన వంతు కృషి చేస్తానని మాటిచ్చి ఏర్పాట్లు మొదలు పెట్టించింది. కరుణ డాక్టరమ్మ కలిసి తమవంటి సేవా దృక్పధం ఉన్న మరికొందరిని తమతో చేర్చుకొని ఆ చికిత్సాలయాన్ని సమర్ధవంతంగా నడుపుతూ ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు కూడా నెర్పించే ఏర్పాట్లు చేస్తూ రకరకాల శిక్షణా తరగతులని కూడా ఏర్పాటు చేయిస్తూ సాధ్యమైనంతగా వారి ఉధ్ధరణకు కృషి చేస్తున్నారు. దీనంతటికి కారణం మానవత్వం పట్ల కాంతం గారికి ఉన్న గౌరవమే కారణమని నమ్ముతారు వారిద్దరూ….

సర్వే జనాః సుఖినో భవంతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *