• lavibuddha@gmail.com
  • +91 81603 83161

Sometimes Ego Costs a Lifetime

“ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి
విసిగి వేసారిపోయిన మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమై పోతోంది.
అసలెప్పటికైనా మళ్ళీ కలుస్తామా?
ఆనాటి జ్ఞాపకాల తీపి గురుతులని మళ్ళీ ఒకసారి కలుసుకొని, తలుచుకుని మురిసిపోగలమా
కష్టసుఖాలను నేరుగా కూర్చుని పంచుకోగలమా?”
కంటి కొసల్లోంచి వెచ్చని కన్నీటిబొట్టు వెచ్చగా చెక్కిలి మీదకి జారింది.

ఆలోచనల్లోంచి తేరుకోలేకపోతోంది తను. వద్దన్నా వినకుండా అమ్మా నాన్నలు పంతం పట్టి తెచ్చి ఇక్కడ పడేసారు. తీరా వచ్చాకా, ఎవరికో బాగోలేదంటూ చూడడానికెళ్ళినవాళ్ళులాక్డౌన్ కారణంగా అక్కడేఇరుక్కుపోయారు. తనొక్కత్తే పుట్టింట్లో, భర్త అత్తమామలు అక్కడ. అమ్మా నాన్న ఎక్కడో చుట్టాలింట్లో. ఇలా చెట్టుకొకరం పుట్టకొకరం లా అయిపోతుందనుకోలేదు.

పెళ్ళైన కొత్తలు. అత్తమామలు కాస్త పధ్ధతులు, మడి ఆచారాలంటూ పాతకాలం అలవాట్లు, పట్టింపులు కలిగిన వాళ్ళు.

తనేమో ఆధునిక భావజాలం, ఒక్కగానొక్క కూతురు కావడం వలన, గారం. తనేదంటే అది ఇచ్చి పెంచారు. పనులు, పధ్ధతులు అనేవి ఎలా ఉంటాయోకూడా తెలియదు. ఎప్పుడైనా అమ్మ చెయ్యమన్నా, నాన్న అడ్డుపడేవాడు.

అక్కడ అత్తగారి పర్యవేక్షణలో పనులన్నీ నేర్చుకుంటూ చేయాల్సిరావడం వలన, కాస్త ఇబ్బందిగా ఒకరకమైన బాధగానే ఉంది. కానీ, భర్త తనవంతు సహకరిస్తున్నాడు. తన మనసు తెలుసుకొని తనకు కావలసిన విధంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా పట్టుమని రెండు నెలలు కూడా పూర్తవలేదు.

ఒకరోజు, అత్తగారినడిగి వంట మొదలు పెట్టిన సమయంలో ఆరోజేవో బజ్జీలకోసం బంగాళా దుంపలు తరుగుతుంటే వేలు తెగింది. రక్తం చిమ్మి కళ్ళు తిరిగినట్టయ్యింది. పక్కనే ఉన్న అత్తగారు, అయ్యో తెగిందా, వెళ్ళి చెయ్యి కడుక్కో. నేను చూస్తాలే అంది తప్ప ఉన్నచోటు నుంచి కదలలేదు.

అదే మా అమ్మ అయితే వెంటనే డెట్టాల్ తెచ్చి క్లీన్ చేసి వేలుకి బేండెయిడ్ వేసేది. అయినా అసలు మా అమ్మ పనే చెప్పదు, అనుకుంది నెప్పెడుతున్న వేలుని చూసుకుని.

ఇంతలో భర్త ఒక బేండెయిడ్ తెచ్చి అంటించాడు. వెళ్ళి మళ్ళీ తన పనిలో పడ్డాడు. సినిమాల్లోలా ఒక ఓదార్పు లేదు, హడావుడీ లేదు. ఇంకా ఉక్రోషం వచ్చేసింది. ఇంతలో తల్లి కాల్. విషయమంతా చెప్పింది. కొన్ని చిలవలు పలవలు కూడా కలుపుకుని. వెంటనే తల్లి కోపంతో రగిలిపోయింది. పిల్లని ఇంత హింస పెడతారా? నేను వాళ్ళ సంగతి చూస్తాను అంటూ రంకెలేసింది. అప్పటికి ఆ కాల్ పూర్తి చేసి సాయంత్రం టీలు అందించే పనిలో పడింది. ఉదయం ఉన్నంత నెప్పి ఇప్పుడు లేదు. అనవసరంగా అమ్మతో చెప్పేనా అనుకుంది. ఇంక ఇప్పుడేం చెయ్యలేదు కాబట్టి ఊరుకుంది.

మర్నాడు ఉదయం గుమ్మంలో ఆగిన కారుని చూశాకా అర్ధమైంది తనెంత తప్పుచేసిందో. కానీ తల్లి పంతం తాను ఊహించినదానికంటే పెద్ద స్థాయిలో ఉంది. ఏది ఏమైనా కూతురిని అత్తవారు సరిగ్గా చూసుకోవడం లేదని, ఇప్పటికిప్పుడు తనతో తీసుకెళ్ళి పోతాననీ వాళ్ళతో గొడవ పడింది. హుటాహుటిన బయల్దేరదీసింది. తను ఎటూ చెప్పలేని స్థితి. తను చెప్పిన మాటలవలనే ఇంతదాకా వచ్చిందన్న అభిప్రాయం అత్తవారిలోనే కాక భర్త మాటల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తనూ తట్టుకోలేకపోయింది. మనసులో తను చేసిన తప్పు తెలిసినా, అహంభావం (ఆత్మాభిమానం అనే భ్రమ) తో ఎవరికి క్షమాపణ చెప్పే ప్రయత్నం గానీ, ఇలా అనంకోలేదనే సంజాయిషీ గానీ ఇవ్వలేకపోయింది. తల్లితో కదిలి వెళ్ళిపోయింది.

మీ అబ్బాయే వచ్చి క్షమాపణ చెప్పి మళ్ళీ మా అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు వస్తుందని చెప్పి తీసుకొచ్చే సింది.

వాళ్ళకి కూడా ఇది ఊహించని పరిణామం. తప్పు లేకుండా ఈ నింద భరించలేని వాళ్ళు, పంతం పట్టి, తనంతట తనుగా వచ్చినా లేక మళ్ళీ మీరే తీసుకొచ్చినా పెద్దలతో మాట్లాడిన తర్వాత ఆలోచిద్దామని చెప్పేసేరు.

తను రోజు రోజుకీ అపరాధ భావంతో కుమిలిపోవడం మొదలు పెట్టింది. ఎవ్వరికీ నచ్చజెప్పలేదు. అలాగని ఇక్కడే ఇలా ఉండిపోలేదు. ఒక వారం రోజులు గడిచిపోయాయి. భర్త నుంచి కబురు లేదు. ఇటూ వీళ్ళు హాయిగా జీవితాన్ని గడిపేస్తున్నారు. నష్టపోయింది తనే. స్పష్టంగా తెలుస్తోంది.

ఇంతలో తన మేనత్తకి ఆరోగ్యం బాగాలేదని చూడడానికి వెళ్ళారు అమ్మా నాన్న. రెండ్రోజుల్లో వచ్చేస్తారు.

తను ఇక్కడుందని తెలిసి చూడడానికి వచ్చిన తన ప్రాణ స్నేహితురాలికి విషయం తెలిసి బాగా గడ్డిపెట్టి, పంతం పక్కన పెట్టి ఇప్పుడే అతనికి కాల్ చేసి మాట్లాడు. క్షమాపణ చెప్పు. బ్రతిమాలుకో. తప్పేం లేదు. ఇకపై పద్ధతిగా ఉండు. ఇలా చీటికి మాటికీ అక్కడి కబుర్లిక్కడ చెప్తే ఇలాగే ఉంటుంది. అంటూ గట్టిగా తిట్టాకా, నిజమే అని ఆలోచించి, భర్తకి కాల్ చేసింది. అతడు ఎత్తలేదు. రెండు మూడుసార్లు చేసాకా ఇంక చేసేది లేక మెసేజ్ పెట్టింది. కానీ సమాధానం లేదు.

ఇప్పుడదే ఆలోచిస్తోంది. తన బ్రతుకిలా అయిపోతుందని కల్లో కూడా ఊహించలేదు. అసలు తన భర్త తనని మళ్ళీ కలుస్తాడా? అనే ఆలోచనలోనే రోజంతా కన్నీటితోనే కాలక్షేపం జరిగిపోయింది. ఈ హడావుడిలో తను గమనించలేదు, వార్తల్లోని లాక్డౌన్ ప్రకటన.

సాయంత్రం ఫోన్ మ్రోగుతుంటే చూసింది. తను భర్త నెంబర్. ఆనందం భయం ఆందోళన కలగలిపిన ఆలోచనలతో, ఏమంటాడో అంటూ కాల్ తీసి హలో అంది.

అతడు, ఎలా ఉన్నావు? ఉదయం నుంచి ఖాళీ లేదు. వర్క్ ఫ్రం హోం చేయాల్సొస్తుందని, టీం లో అందరికీ ఆ ఏర్పాట్లు చేసే హడావుడిలో ఉన్నాను. కాల్ చూసే అవకాశం కుదరలేదు అన్నాడు. అతడి మాట వినగానే ఆమెకు దుఃఖం పెల్లుబికి వచ్చింది. అతడు సముదాయించాడు. ఆమె క్షమాపణ వేడుకుంది. అతడు అనునయ వాక్యాలు పలికాడు. ఆమెకు ఊరట కలిగింది. సరే నేను అమ్మా వాళ్ళకి నచ్చజెప్తాను, నువ్వు బాధపడకంటూ ధైర్యం చెప్పాడు. తను సరేనంది. మర్నాడు వచ్చి తనని తీసుకెళ్తానన్నాడు. కానీ లాక్డౌన్ తమ మధ్య దూరాన్ని మరింతకాలం పొడిగించింది.

ఇది పూర్తైతే తప్ప వాళ్ళిద్దరూ తిరిగి కలవలేరు. అమ్మా నాన్న ఇంటికి చేరలేరు. అంతదాకా తనొక్కత్తే అన్ని పనులూ చేసుకుంటోంది. వంటతో సహా …. కాదు కాదు నేర్చుకుంటోంది. ఈ లాక్డౌన్ అయ్యేసరికి ఒక మాదిరిగా పనులన్నీ అలవాటైపోతాయి. అప్పుడనుకుంది, ఇదేదో అక్కడే కాస్త ఓరెంతో చేసుకునుంటే ఈ రోజులిలా గడవాల్సిన అవసరం లేకపోవును. పోన్లే ఇదొక గుణపాఠం అనుకుని ఎప్పుడు లాక్డౌన్ పూర్తయ్యి తన ఇంటికి తను వెళ్తానా అని ఎదురు చూస్తోంది … ఆమె….. !!

2 thoughts on “Sometimes Ego Costs a Lifetime

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *