• lavibuddha@gmail.com
  • +91 81603 83161

Timeline Story got Viral – Marriage of my Son

టైమ్ లైన్ వెంట పరుగులు తీస్తున్న కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి.. ఈ వార్త నిజమేనా? లేక నా భ్రమా అంటూ మనసింకా సంభ్రమాశ్చర్యాలలోంచి తేరుకోక ముందే పెద్దబ్బాయి గేటు దగ్గర నిలబడి తలుపు కొడుతూ అమ్మా, తలుపు తియ్యి, త్వరగా, నేనొచ్చేశా అంటూ నా ఆశర్యానికి మరింత అనుమానాన్ని జోడించాడు.. గిల్లుకుని చూసుకుంది, నేనేనా.. ఇదంతా నిజమేనా అనుకుంటూ.. స్ అబ్బా నెప్పి.

ఇది నిజమే. వాడే.. అదేంటీ, అలా ఎలా వచ్చేసాడు? అంత దూరం నుంచి ఎలా రానిచ్చేరు? ఎమైనా అయిందా నాకు తెలియకుండా? అంతా బాగానే ఉందా? వెయ్యి ప్రశ్నలు వేధిస్తూ ఉండగానే, గుమ్మంలోనే కొడుకుని నిలబెట్టి అడిగెయ్యలేక, మనసులోని ఆనందాన్ని ఆందోళననూ మిళితం చేసుకున్న భావాల్ని దాచుకునే ప్రయత్నం చెయ్యకుండానే పరుగు పెట్టినట్టు వెళ్లి తలుపు తీసింది. కొడుకు సందీప్ గుమ్మంలో నుంచుని తనవైపే చూస్తున్నాడు. వెంటనే చెయ్యి పట్టుకుని, ఏరా, ఎలా ఉన్నావు? ఎలా వచ్చేవ్? ఏం జరిగింది అంటూ ప్రశ్నలు కురిపిస్తూనే లోపలికి నడిచింది..

తను తన టైమ్ లైన్ లో చూసిన వార్త నిజమేనా, అందుకేనా కొడుకు వచ్చేసాడా? నిన్న రాత్రి నిద్రపోయేదాకా ఏం లేదే? మరి లేచేలోగా ఎలా? వాడికి రావడానికి రెండు రోజులు పడుతుంది. మరి రాత్రికి రాత్రే ఎలా వచ్చేసాడు?

ఇంతలో భర్త సుమన్ ఆఫీస్ కి రెడీ అయి బయెల్దేరుతూ, ఒరేయ్, అప్పుడే వచ్చేసావా? అన్నీ తెచ్చేవా? ఏమైనా మర్చిపోయావా? నేను ఒక గంటలో పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాను. అసలే అమ్మాయికి ఇల్లు కొత్త. కాస్త కనిపెట్టుకుని ఉండు. ఆ అమ్మాయి మొహమాట పడుతుందేమో, ఏం కావాలో దగ్గరుండి చూసుకో అని చెప్పి బయల్దేరాడు. తనని పట్టించుకోవడం లేదేంటి? అనుకుని అసలు ఎవరా అమ్మాయి? ఎవరిని జాగ్రత్తగా చూసుకొమ్మని కొడుకుకి చెప్తున్నాడు సుమన్ అనుకుంటోంది.. మరింత అయోమయం.

కొడుకు లోపలికి యేమీ పట్టనట్టు వెళ్లి పోయాడు. అప్పుడు గమనించింది. వాడి చేతిలో బ్యాగ్ లేదు. ఏవో ప్యాకెట్లు ఉన్నాయి. తనూ పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లింది. లోపల చక్కని రూపసి, చూడ్డానికి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉన్న ఒక అమ్మాయి.. ముడుచుకుని కూర్చుని ఉంది. కొడుకు తన పక్కన కూర్చుని ఏవో మట్లాడుతున్నాడు. తనని వాళ్లిద్దరూ గమనించినట్టు లేదు. ఆ పక్కన వాళ్ల అమ్మ, ఎవో పూజకి పువ్వులు సర్దుతోంది. అప్పుడు ద్రుష్టికి వచ్చింది. అక్కడేదో వ్రతం చేసుకుంటున్నట్టు యేర్పాట్లు చెప్తున్నాయి. తన ఇల్లే గా అంటూ పరికించి పరీక్ష గా చూసింది. ఇల్లంతా అలంకరణ, అటూ ఇటూ వస్తున్న చుట్టాలు, బయట ఆడుకుంటున్న పిల్లలు, పెరట్లో రంగుల ముగ్గులు, ఇదేంటి? నిన్ననే గా ఈ అమ్మాయి ఫోటో వాడికి పంపేము? ఇంటర్నెట్ లో.. మరింతలో ఏమైనట్టు? యెప్పుడిదంతా జరిగిపోయింది?

అసలు లాక్దౌన్ సమయంలో పెళ్లి, జనం, ప్రయాణాలు ఇవన్నీ ఏంటి? పైగా, నన్నెవరూ పట్టించుకోరు ఏంటి? నేను ఎక్కడున్నాను? అనుకుంటూ, తల గట్టిగా పట్టుకుని బలంగా అరవబోయింది.. నోట్లోంచి మాట బయటికి రావడం లేదు. ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. ఇంకా బలంగా ఊపిరి బిగించి అరవబోయేంతలో తనని ఎవరో పట్టుకుని గట్టిగా గుంజుతున్నారు ఆపకుండా.. అబ్బా, ఎవరది? అనుకుంటూ కళ్లు తెరిచే సరికి పక్కనే తన భర్త సుమన్. నిద్ర లేపుతున్నాడు. సరళా, ఇంకా నిద్రలేవలేదేంటి? ఒంట్లో బాగోలేదా అంటూ? పైగా పొద్దెక్కి పోయాకా ఈ పలవరింతలేంటి అంటుంటే, అప్పుడు అర్ధం అయింది.. ఇదంతా తన కల అని..

రాత్రి కొడుకుతో వీడియో కాల్ మాట్లాడి, ఆ అమ్మాయి ఫోటో పంపించి ఒప్పుకుంటే లాక్దౌన్ అవగానే పెళ్లికి యేర్పాట్లు అని చెప్పి చలా సేపు కబుర్లు చెప్పి అప్పుడు నిద్ర పోయింది. కొడుకు ఒప్పేసుకున్నట్టు, పెళ్లి అయిపోయినట్టు అన్నీ కలలో వచ్చేయన్నమాట..

తన టైమ్ లైన్ లో ఉన్నది తన కొడుకు, కోడలు, తనూ, తన భర్త సుమన్ కలిసిన పెళ్లి ఫోటో.. దండలతో నవదంపతులు బుగ్గన చుక్కతో కళ కళ లాడుతూ ఉన్నారు.. ఫేస్భుక్ లో దాదాపు అయిదు వందల లైకులు, మూడొందల కామెంట్లు అభినందనలు మరియు ఆశీస్సులతో కనిపించగానే మతి పోయినట్టయింది..

ఇదంతా తన భ్రమన్నమాట.. 😛😅🤔

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *