
కలా నిజమా…!!
- Bhavalavanyam
- 0
- on Sep 07, 2022
సాయంత్రం అయ్యింది…
వేసవికాలం ఎండ వేడి తగ్గి చల్లగాలేస్తోంది…
రవళి ఇంకా ఆలోచిస్తూనే ఉంది…
తల్చుకునే కొద్దీ ముచ్చెమటలు పోసేస్తున్నాయి.
ఇంతకీ తను చూసింది నిజమేనా? నమ్మలేకపోతోంది.
ఇంతలో మూడేళ్ళ కూతురు కనిష్క పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ళకి చుట్టుకుంది…
దాన్ని చూసినా భయమేస్తోంది…
పాప పిలుస్తూనే ఉంది గానీ తను ఈ లోకం లోకి రాలేకపోతోంది
ఆ షాక్ లోంచి ఇంకా తేరుకోలేదు
ఇంతలో పాప పక్క గదిలోంచి అరుస్తూ ఆడుతూ నవ్వుతూ పిలుస్తోంది…
అమ్మా, రా అమ్మా, ఆడుకుందాం…
ఈ అక్క నాతో మంచి మంచి ఆటలు ఆడిస్తోంది, రామ్మా, నువ్వూ రామ్మా అంటూ నవ్వుతూనే ఉంది…
సడన్గా ఆ పిలుపుకి స్పృహలోకొచ్చి పరుగెత్తుకుంటూ పక్కగదిలోకెళ్ళింది…
పదేళ్ళ పిల్ల, తీక్షణంగా చూసే కళ్ళు, విరబూసిన జుత్తు, పాపతో ఆడుకుంటోంది… తను కళ్ళు తిరిగి పడిపోతోందా?
ఏం జరుగుతోంది? ఆ పాప ఇదివరకెప్పుడూ లేదే? ఎవ్వరూ ఆ పాపతో రాలేదే? తనకెవ్వరూ అప్పచెప్పలేదే? అసలెవరంటే మాట్లాడదేం?
మద్యాహ్నం నుంచీ తను నమ్మలేకుండా షాక్ కి గురైన విషయం ఇదే, పెరట్లో మంచి ఎండలో బట్టలు ఆరేస్తుండగా పక్కనే ఎవరో కదిలినట్టైంది.
పక్కకి తిరిగి చూస్తే ఈ పాపే, సడన్ గా చూసి తుళ్ళిపడింది. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగేసరికి అక్కడ లేదు. ఏదో భ్రమ అనుకుంది..
మళ్లీ ఇలా పాప తన కూతురితో ఆడుకుంటూ….
“ఎవరు నువ్వు?” అని గట్టిగా అరిచింది…. కాదు, అరిచాననుకుంది…
మాట పెగలలేదు, గిలగిలా కొట్టుకుంటోంది, అరవడానికి శతథా ప్రయత్నిస్తోంది…. అయినా మాట పెగలటం లేదు
ఎవరో నోరు నొక్కేసినట్టు…
తను కదలలేకపోతోంది, గింజుకుంటోంది
కాళ్ళు కొట్టుకుంటోంది…
సరిగ్గా మాట బయటికొచ్చే సమయానికి కళ్ళు తెరుచుకున్నాయ్..
తను తన మంచం మీద ఉంది
పక్కనే తన భర్త శ్రీధర్ … ఆతృతగా చూస్తున్నాడు, “రవళీ, రవళీ, ఏమైంది, అంటూ లేపుతున్నాడు”….
ఆమె ముఖం నిండా చెమటలు పోసేసాయి ఏసీ లో కూడా
ఒక్కసారిగా లేచి కూర్చుంది…. “ఇదంతా కలా!” ఒళ్ళు జలదరించింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. పక్కనే ఉన్న మంచినీళ్ళ బాటిల్ అందుకుని గడగడా ఉన్న నీళ్ళన్నీ తాగేసింది.
వెంటనే భర్తకు దగ్గరగా జరిగి కూర్చుని జరిగినదంతా చెప్తోంటే, తన శరీరం భయంతో కంపించిపొవడం స్పష్టంగా తెలుస్తోంది.
ఇలాంటి కలలు ఎంతమందికి వచ్చుంటాయి?
ఇప్పుడు హాయిగా నిద్రపొండి… గుడ్నైట్