• lavibuddha@gmail.com
  • +91 81603 83161

కొత్తిల్లు!!

సరోజ వాళ్ళు కొత్తింట్లో దిగారు ఈమధ్యే…

ఇల్లు చాలా విశాలంగా ఉంది. ముందు వెనక చక్కగా బోలెడంత స్థలం.. పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది ఉండదు అనుకుంది చూసిన వెంటనే. అందుకే ఆమె భర్త ఆ ఇంటికి ఎడ్వాన్స్ ఇచ్చేస్తా అంటే ఎంతో సంబరపడిపోయింది.
ఇంట్లోకి దిగాకా సర్దుకోవడాలు మామూలే… ఆయనా ఓ రెండ్రోజులు సెలవు పెట్టాడు, పిల్లలూ సాయానికి ఉన్నారు.. సెటిల్ అయ్యాం అనుకున్నాకా, తన పనులు రెగ్యులర్గా చేసుకోవడం మొదలు పెట్టింది.
పిల్లలు స్కూల్ కి, భర్త ఆఫీస్ కీ, వెళ్ళాకా “పనులన్నీ అయ్యాయి, హమ్మయ్యా!!” అంటూ తన బెడ్రూం లోకి వచ్చి నడుం వాల్చింది.
పడుకుని తన మొబైల్ లో ఉదయం నుంచీ వచ్చిన మెసేజ్లు అన్నీ తిరగేస్తూ ఒక్కొక్కదానికే జవాబులిస్తోంది. ఎప్పుడూ లేనిది ఒక కొత్త నంబరు నుండి మెసేజ్ ఉంది. ఎవరబ్బా అనుకుంటూ ఓపెన్ చేస్తే మెసేజ్ బాక్స్ ఖాళీ గా ఉంది. “ఆఁ, ఎవరో పొరపాట్న పంపి ఉంటారులే” అనుకుంటూ మళ్ళీ తన పనిలో పడింది. ఇంకో రెండు మెసేజ్ లకి జవాబు అయ్యేలోగా ఇంకోసారి అదే నంబర్ నుంచి మెసేజ్. ఈసారి “మళ్ళీ వచ్చిందా” అనుకుంటూ ఓపెన్ చేసింది.
ఇందాకటిలాగే ఖాళీ బాక్స్. ఈసారి టెక్నికల్ ఫాల్ట్ ఏమో అనుకుని బయటికి వద్దాం అనుకుని ఎక్జిట్ బటన్ ప్రెస్ చేసింది. బయటికి రాలేదు. మళ్ళీ ట్రై చేసింది రాలేదు. అలా ట్రై చేస్తూనే ఉంది. కానీ రావటం లేదు. ఇంతలో ఆ నంబర్ ఎక్కడో చూసినట్టు అనిపించింది. బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. తను తన రూం శుభ్రం చేస్తున్నప్పుడు చూసింది. అది ఆ ఇంటి ఓనర్ పెద్ద కొడుకు ఫోటో లో ఉన్న నంబర్. అతడు చనిపోయాడు. గుర్తు ఉండడానికి కారణం నంబర్ లో 131313 అనేవి ఆఖరి సంఖ్యలు. పదమూడు అనేది చాలా అరుదైన నంబర్. ఇన్నిసార్లు రిపీటెడ్ గా ఉందే అనుకుంది. అదే గుర్తొచ్చింది. గుండె ఒక్కసారి ఝల్లుమంది. ఇదేం వింత? అనుకుంటూ పక్కకి తిరిగి తన బీరువా అద్దం వైపుకు చూసింది. అంతే!! గుండె ఆగిపోయింది. శ్వాశ ఆగిపోయింది. ఆఖరిసారిగా ఆమె చూసిన చిత్రం ఆ ఇంటి ఓనర్ పెద్దకొడుకుది.. అద్దం లో స్పష్టంగా, తనవైపే తీక్షణంగా చూస్తూ….
ఇక ఆమె లేదు….. ఈ విషయం చెప్పడానికీ ఎవ్వరూ లేరు…
ఇంటికొచ్చిన పది రోజులకే ఇలా జరగడంతో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుండగా ఆ వీధి చివర ఒక అవ్వ “ఎవరు మీరు?” అనడిగింది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. ఇలా జరగడం వల్ల ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అన్నారు. విన్న వెంటనే ఆమె గజగజా ఒణికిపోవడం స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళువెళ్ళడం ఆ ఇంటి ఓనర్ చనిపోయిన పెద్ద కొడుకు ఇంకా గేటు దగ్గర నిలబడి చూస్తూనే ఉన్నాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *