నీ పాఠాలు నీ నిర్ణయాలు నీ గమ్యాలు
- Bhavalavanyam
- 0
- on Jun 04, 2026
కొన్నిసార్లు జీవితం ఒక నాలుగురోడ్ల కూడలిలోకి తెచ్చి వదిలేస్తుంది.
ఏ దారి నీదని ఎంచుకుంటావో తేల్చుకొమ్మని నిలదీస్తుంది.
గమ్యాలు వేరయినచోట మార్గాలు కూడా వేరుగానే ఉంటాయని హెచ్చరిస్తుంది
నీ గమ్యానికి నువ్వు చేరుకునే దారిలో నువ్వెన్నో నీవైనవాటిని కోల్పోవాలని బెదిరిస్తుంది
కాదు కూడదు నువ్విక్కడే ఉంటా అన్నా ఆయా దారులలో ఎవరికి వారు సాగిపోతారు, నువ్వు మాత్రం ఏ గమ్యానికీ చేరక ఒంటరై మిగిలిపోతావని బుజ్జగిస్తుంది
నీవైన ఎన్నో అనుభూతులను నీనుంచి విడదీస్తుంది
నీకంటూ ఏదీ లేదని విసిగిస్తుంది
నువు చేసిన సావాసాలు కేవలం నీ భ్రమలు అని తేల్చి పడేస్తుంది
నువ్వున్నంతవరకే నీ తలపు, నీ అడుగు జాడ లేనినాడు నీ ఊసైనా రాదని స్పష్టం చేస్తుంది
గమ్యం లేని నీ ప్రయాణానికి అంతం కూడా అవివేకమై మిగిలిపోతుంది
అంతదాకా కలిసి నడిచిన బాటసారులు నీ సహగమ్యచారులు కాదు కేవలం సహప్రయాణీకులని మేల్కొలుపుతుంది
ఆ బాటన నడిచిన నీ అనుభవాలు నీకొక పాఠమై ముందుకు సాగాలని ప్రేరేపిస్తుంది
కొన్ని దారులు ముందుకు సాగడమే గానీ వెనుతిరిగి చూడడానికి కుదరదని నీరు గారుస్తుంది
ఇంతకాలం నువ్వు చేస్తూ వచ్చిన ప్రతి పని నీ కర్తవ్యంలో భాగమని గుర్తు చేస్తుంది
ఆ నాలురోడ్ల కూడలిలో ప్రతి దారి ఒక గమ్యాన్ని సూచిస్తుంది
ఇన్నాళ్ల నీ పయనంలోని పాఠాలు గుణపాఠాలుగా తీసుకుని ఒక గమ్యాన్ని ఎంచుకొమ్మని ప్రోత్సహిస్తుంది
మిగిలిన మూడు దారులూ నిన్ను చూసి వెక్కిరించేలా చేస్తుంది
గమ్యానికి సాగే ప్రయాణం ఎవరికి వారే ఒంటరిగా పోరాడుతూ చేయాలని సూచిస్తుంది
నిర్ణయం నీది
గమ్యం నీది
అడుగులు నీవి
సమయం మాత్రం చెప్పలేనిదని వివరిస్తుంది
ఆ ధోరణిలో నీలో నీకే జరిగే సంఘర్షణలో నీనుంచి నిన్నే విడదీస్తుంది
ఒక్కసారి కొత్తగా నిన్ను నువ్వు చూసుకొమ్మంటుంది
ఈ ప్రయాణంలో ఎవరి మజిలీలు ఎవరి గమ్యాలు వారు ఎంచుకోవడం స్వార్థం కాదు జీవిత సత్యం అని ఒప్పుకొమ్మంటుంది