• lavibuddha@gmail.com
  • +91 81603 83161

ఏమిటో ఈ మాయా

చాలా రోజులుగా సోషల్ మీడియా ధోరణి గమనిస్తుంటే కొన్ని రకాల పోస్టులకు అత్యంత ఎక్కువ ఆదరణ లభిస్తున్నట్టు తెలుస్తోంది… 

టాప్ 10: 

1. దేశానికి చేసినది ఏమీ లేకపోయినా కులం లేదా మతం పేరుతో పక్క వారిని దూషిస్తూ ఒక పోస్టు పెడితే చాలు గిగిలిన అందరూ రెచ్చిపోయి దానిమీద నోటికి వచ్చిన ప్రేలాపనలు చేస్తూ ఆ పోస్టు రాసిన సదరు పోస్టరుకి పాపులారిటీ తెస్తారు 

2. ఒక రాజకీయ పార్టీ వారు రెండవవారిని దూషిస్తూ చీత్కరిస్తూ వీలైతే బూతులు కూడా కలిపి ఒక పోస్టు వేస్తారు – ఆ దెబ్బకి అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళకు ఒళ్ళు మందుకొచ్చి ఆ పోస్టు మీద అత్యంత హేయమైన హీనమైన పదజాలంతో మాటల దాడి చేసుకుంటూ ఒక డిజిటల్ యుద్ధం చేస్తారు (ఆ పదాలతో వాళ్ళు ఎంతగా దిగజారిపోతున్నారో, కొంతమంది తమకున్న నోటి దూ… ఎలా తీర్చుకుంటున్నారో, వారి వారి మానసిక వికృతాలను ఎలా బయట పెట్టుకుంటున్నారు మనం గమనించవచ్చు) 

3. అమ్మాయిలు (చిన్న పెద్ద తేడా లేదు, మర్యాదస్తుల కుటుంబాలకు చెందినవారిలా ఉన్నా కూడా) కొన్ని పాటలకు లేదా కొన్ని సందర్భాలకు రకరకాల ముఖ కవళికలు, శరీర కదలికలు, వారి దుస్తులు, ఆ హావభావాలతో జనాలలో మానసికమైన శృంగార ధోరణిని రెచ్చగొట్టే విధంగా చేసే వికృత చర్యల వీడియోలు డిమాండ్ (ఈ తరహా వీడియోలు వైరల్ అవడమే కాదు ఆ కామెంట్ల సెక్షన్ ఐతే ఇక చదవనక్కర్లేదు (ఘోరాతి ఘోరమైన ఆయా కామెంట్లు రాసే పెద్దమనుషులు మన మధ్య మన ఫ్రెండ్ లిస్ట్ లో కూడా కనిపించే అవకాశాలు లేకపోలేదు. వారిని friendlist లో ఉంచాలా తీసెయ్యాలా అనేది ఎవరి అభిప్రాయాలు వారివి) 

4. ఇక పిల్లలకు రకరకాల దుస్తులు వేసి, రకరకాల డాన్సులు చేయించి, రకరకాల ముదురు డైలాగ్స్ చెప్పించి నవ్వు తెప్పించే వీడియోలు – వీటిల్లో కొన్ని ఆ పిల్లల expression వైపు మనల్ని ముగ్ధుల్ని చెయ్యగలిగితే మరికొన్ని మాత్రం పిల్లల్ని తల్లిదండ్రులే ఇలాంటి వీడియోల వైపు ప్రోత్సహించడం చూసి కళ్ళు చెవులు మూసుకోవడం తప్ప ఏం చెయ్యలేం 

5. ఈ వీడియోలు కొన్ని సినిమాలలోని కామెడీ లేదా యాక్షన్ సీన్లు పై హాఫ్ లేదా కింద హాఫ్ లో పెట్టి దాని అటువైపు ప్రయోగకర్తలు సొంత అభిప్రాయాలు లేదా facial expression లతో ప్రేక్షకులను అలరించే బ్యాచ్ 

6. ఇది అసలు పీక్స్ అనిపిస్తుంది నాకు… 

భార్యాభర్తల చిన్న చిన్న సందర్భాలు లేదా డ్యూయెట్లు లాంటివి – ఆ మధ్య ఒక జంట కేవలం పాటలకు డాన్స్ (దుర్గారావ్ అండ్ his wife) చేసి వైరల్ అయిన వారిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఎన్నో సీరియస్ విషయాలను సింపుల్ గా తమ ధోరణిలో చెప్పేసి నవ్విస్తూనే సందేశాలు ఇస్తున్న వారు 

7. తల్లి కొడుకుల వీడియోలు – ఈనాటి పిల్లల ధోరణి, వారితో ఆ తల్లి చేసే సంభాషణలు లాంటివి అన్నీ చెప్తూ నవ్వులు కురిపిస్తూనే ఒక సందేశాన్ని ఇస్తున్నట్టే అనిపిస్తున్న విషయం 

ఇక మొదలవుతుంది అసలైన సంత… 

8. ఇది నగలు, వస్తువులు, బట్టలు, జిగిబిగిలు, అలంకరణలు ఇంటికి వంటికి… ఇక వీటి సంగతి చెప్పుకోవాలంటే – వివరణ ఇచ్చేవాళ్ళు, కొనుక్కోండి ఫలానా చోట అనేవాళ్ళు, కొన్నాను మోసపోయాను అని చెప్పేవాళ్ళు, నేను కొన్నాను చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేవాళ్ళు…. దీనికైతే అత్యంత ఆదరణ అనిపిస్తుంది నాకు 

చివరికి వచ్చేస్తున్నా….

9. ఇదైతే హైలైట్… 

మనిషి ఎందుకు పుట్టేడు అంటే తినడానికే అన్నట్టుగా వచ్చే ఫుడ్ వీడియోలు – అసలు దీని ఆదరణ, ఆ వీడియోలలో ఉండే పదార్థాలు, ఆఫర్లు, చోట్లు చూస్తూ ఉంటే అప్పుడే భోజనం చేసినా వెంటనే వెళ్ళి భోజనం చేసేయాలి అనేంతగా చూపించే ఈ వీడియోలు అసలు మనుషులు తిండికి ఎంతగా వెంపర్లాడాలో చూపిస్తూ ఇంట్లో వంటిల్లు అలంకరణ వరకే మిగిలిపోయేలాంటి రోజులు రాబోతున్నాయి అనిపిస్తోంది నాకైతే… 

ఇక నా లిస్టులో ఆఖరిది కానీ నాకింకా అద్భుతం అనిపించేది…

10. రెమెడీస్ – ఇది మాత్రం నిజం అబద్ధం అనే నమ్మకాల గురించి చెప్పడం లేదు నేను, కానీ ఉప్పు, పసుపు, జీలకర్ర, మెంతులు, జీడిపప్పు, బాదం, లవంగం, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యాని ఆకు, తులసి అంటూ ఇలా పాసిటివిటీ మీ ఇంట్లోకి రావాలన్నా లేక మీకు డబ్బులు మీ నట్టింట్లో కురవాలన్నా ఫలానాది చేస్తే చాలు, మీరు ఏం చెయ్యక్కర్లేదు, result ఖచ్చితం అనే నమ్మకాల వీడియోలు.. ఇక్కడ కేవలం నమ్మకాన్ని మాత్రమే అమ్ముతారు, సొమ్ము చేసుకుంటారు. అంటే వాళ్ళ నమ్మకం ఎంత నిజం అనేది నాకు తెలీదు, నేను కామెంటను కూడా. కానీ అది చేస్తే చాలు ఇంక నా వంతు ఏం ఉండదు అనే ధోరణిని పెంచుతున్న ఆ విషయం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 

సరే ఇవి టాప్ 10 వరకే 

ఆ పైన psychology facts అని, physical fitness అని, health tips అని, alternate medicine అని, tourism అని, events అని, spirituality అని, హీలింగ్ అని, ఇలా కుక్కపిల్ల సబ్బుబిళ్ళ అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అనే విధంగా కాదేదీ వీడియోకి అనర్హం అంటున్న ఇన్ఫ్లుయెన్సర్లు మనల్ని అందరినీ ఆడిస్తున్నారు…

మనం ఆలోచించకుండానే ఏది నచ్చితే అటే ఒకపక్క నడుస్తూ మరో వైపు ఉన్న గమ్యాలను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నాం… 

ఏమిటో ఈ మాయా… 🙋🤦😋😁🥳🥳🥰😍😋😛🫣

– Lavanya Buddhavarapu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *