
Coffee with Lavanya..
- Bhavalavanyam
- 0
- on Sep 07, 2022
కాఫీ కలుపుకుందామని స్టవ్ మీద పాలు పెట్టిన వెంటనే ఒక విషయం గుర్తొచ్చి వెంటనే ఇలా వచ్చానండీ…
“అన్నట్టు ఈరోజు ఫేస్బుక్ చూసారా, వనజ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు, మర్చిపోకుండా విష్ చేసెయ్యండి” అంటూ గుర్తుచేసుకునే రోజులోచ్చేసేయ్… సొంత చుట్టాలవి గాని, తోడబుట్టిన వారివి గాని ఎటువంటి విషయాలైనా గుర్తు రావు… ఇక్కడ చూస్తె తప్ప… సరే ఇంతకీ ఉపోద్ఘాతం ఎందుకా అనుకుంటున్నారా?
ఉదయాన్నే నిద్రలేస్తూనే టైం చూడడానికి కాకుండా మన ఆడవారికి ఏ గేడ్జేట్ వైపూ తొంగి చూసే అవకాశముండదు కదండీ. టైం చూస్తూనే గుండెల్లో రైళ్లు పరుగులు పెడతాయి. ఆదరాబాదరాగా పనులు మొదలుపెట్టేయ్యాలి. ఇక్కడ ఎన్ని పనులు చేసుకుంటున్నా మనసు మాత్రం ఒకపక్క సోషల్ నెట్వర్క్ ల పైనే ఉంటుందంటే నన్ను తిట్టుకుంటారేమో…. ఒకపక్క వంట చేసుకుంటూనే అయ్యో, ఈరోజు ఎవరెవరు ఏయే పోస్టులు పెట్టేసేరో… అనుకుంటూనే ఉంటాము. అక్కడికెళ్ళి చుస్తే నాలాంటి ఒక అమ్మ చెప్పే ఈ కాలక్షేపం కబుర్లు, ఎవరో ఉత్సాహకర కొటేషన్లు, ఎవరో భగ్న ప్రేమికులు పెట్టె బాధాకర ఫోటోలు, ఒక బామ్మగారి స్వగతాలు, ఒక తాతగారి నీతి సూత్రాలు, ఒక అమ్మాయి సేల్ఫీ, వేరే ఎవరో పెట్టిన కొత్త రకం వంటకాలు (బంగాళా భౌ భౌ లా అన్నమాట), ఇలా ఇన్ని పోస్టులు మన లైక్ ల కోసం ఎదురుచుసేస్తూ ఉంటాయనే ఆందోళనలో, త్వర త్వరగా పనులన్నీ పూర్తీ చేసేసుకుని అప్పుడు మొదలెడతాం మన సోషల్ మీడియా కాలక్షేపాలు…. ఇంతలో పని చేసుకుంటున్నంతసేపూ స్వర్ణకమలం సినిమా లో భానుప్రియ లాగా “ప్రపంచం అంతా ముందుకు పోతూ ఉంటె మనమే వెనక బడిపోయాం” అని సెల్ఫ్ పిటి తో బాధపడిపోతూనే ఉంటాం.
సరే ఇంతకీ ఇలా మొబైల్ తీసమో లేదో ఇందాక చెప్పిన రక రకాల పోస్టుల మత్తులో పడి పనులన్నీ అయ్యాకా తీరికగా తాగుదాంలే అని మనకోసం కాఫీ కలుపుకోవడానికి మనం స్టవ్ మీద పెట్టుకున్న పాలు కాస్తా పొంగి కిందకి పోయి, వాసన పక్కింటి పంకజం దాకా వెళ్లి, “అమ్మాయి వనజా, పాల వాసనొస్తోంది, పోయ్యమీద ఎదో మాడిపోతున్నట్టుంది చూసుకో తల్లీ, ఎం పిల్లలో ఏమో… ఈకాలం వారికి అసలు పని అంటే శ్రద్దే లేదు” అని తిట్టుకుంటూ పిలిచిన పిలుపుకి స్పృహలోకి వచ్చి అప్పుడు ఈ ప్రపంచం వైపు దృష్టి మర్లిస్తాం….
మన సంగతి ఇలా ఉంటే, మరి మగవారేం తక్కువ తిన్నారా? వారికి మనలా ఉదయాన్నే పనులు ఉండవు కదండీ… వారికీ తీరిక దొరికేది ఆ సమయంలోనే కాబట్టి, అప్పుడు దిగుతారు రంగంలోకి. ఇదివరకు పేపర్ తీసుకుని చక్కగా ప్రపంచంలో ఏ మూల ఎం జరుగుతోందో అని వార్తలు గట్రా చూసేవారు కాస్తా, టీవీ నుంచి మొబైల్ కి బదిలీ అయిపోయారు. ఉదయాన్నే లేస్తూనే మొబైల్ చేత పుచ్చుకుని వచ్చిన మెసేజ్ లన్నింటికీ తీరికగా జవాబులు, ప్రతి పోస్టుకు లైక్ లూ కామెంట్లు… ఇలా వారి ప్రపంచంలో వారు మునిగి తేల్తూ, మనమిచ్చిన కాఫీ లో పంచదార ఉన్నలేకున్నా, పెట్టిన తిఫిన్లో ఉప్పు (ఆనక టూత్పేస్ట్ లో ఉందికదా అని సరిపెట్టుకుంటారు లెండి 😉) ఉన్నాలేకున్నా తినేసి అయిన్దనిపించుకుంటారు.
అసలు ఈ మత్తులో పడి ఒకరితో ఒకరు అవసరమైన మాటలు కూడా మాట్లాడుకోవడం మానేసేరంటే ఆశ్చర్యమేమీ లేదు. సరే, ఇంతలో టైం చూసే సరికి హమ్మబాబోయ్, లేట్ ఐపోయింది అనుకుంటూ పరుగులతో రెడి అయ్యి ఆఫీస్ ల వైపు పయనాలు…
ఇదిలా ఉండగా ఇంకొక ముఖ్య విషయం చెప్పలన్డోయ్… ఈమధ్య కొత్త రకం ట్రెండ్ ఫాలో అవుతున్నారు… స్మార్ట్ ఫోను, ఫేస్బుక్ ఏప్, మెసెంజర్, వాటిని నడపడానికి కావలసిన మొబైల్ డేటా ఇన్ని ఖర్చులకు పెట్టగాలిగినవాళ్ళు, మెసెంజర్ లో అప్పులడుగుతున్నారు… చాలా ఆశ్చర్యం వేసింది… వినే దద్దమ్మలు ఉంటే ఎన్నైనా చెప్తారు… డబ్బులు లేనివాడికి ఇవన్ని ఎలా వచ్చేయో అర్ధం అవదు నాకు… ఇదే కాదండీ, ఇంకా ఎన్నో రకాల మోసాలు జరుగుతూనే ఉన్నాయ్, గుంభనంగా… కొన్ని చెప్పుకోవడానికి కుడా కష్టమనిపించి మనసులోనే దాచుకుని కుంగిపోయేవారెందరినో నేను చూసాను… ఇటువంటివాటన్నింటికి కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరమని నా సలహా… మీకు తెలుసనుకోండి…..
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, నిద్రలేస్తూనే ఎవరెవరికో గుడ్ మార్నింగ్ మెసేజ్ లు పెట్టడానికి తహతహ లాడే మనసుని ఒక్కసారి తట్టి లేపి, ఇంట్లో వారికీ చిరునవ్వుతో విష్ చెయ్యాలనే విషయాన్ని గుర్తు చేస్తే బావుంటుంది అంటున్నాను… చిరునవ్వు ఒకరికొకరు పంచుకోగల సంపద… అది ఇంటినుంచే మొదలైతే ఆ ఇల్లు, ఆ రోజు ఎంతో ఆహ్లాదంగా నడుస్తుంది. ఇక విజయం వైపు పయనానికి ఉత్సాహం వస్తుంది. ఇంటికోసం, కుటుంబంకోసం సాధ్యమైనంత సమయం వెచ్చించండి… సోషల్ మీడియా లోని రంగుల హంగులను చూసి దూరపు కొండలు నునుపు అనే సామెతను గుర్తు చేసుకోండి. వేరొకరితో మనం పోల్చుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు, ప్రతిఒక్కరి లోను ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది, అదేదో గుర్తించి దానిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే బావుంటుంది…
కబుర్లన్నీ బావున్నాయా? అమ్మో!! మీతో కబుర్లలో పడి నా కాఫీ కి వేడి చేసుకున్న పాలు పొంగిపోతే, అసలే మా పక్కింట్లో పంకజమ్మగారికి కోపం కూడాను, వచ్చి తిట్ల దండకం మొదలు పెట్టేస్తారు. 😉 మరి ఉంటానండి…