• lavibuddha@gmail.com
  • +91 81603 83161

Police Story – Corona diaries

“నేను బయల్దేరుతున్నా.. నువ్వు తలుపులేసుకో. బయటికి వెళ్ళద్దు. పిల్లలు జాగ్రత్త. వాళ్ళని ఆ ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవమను. మిస్సవ్వద్దు. లాక్డౌన్ పూర్తి కాగానే మళ్ళీ స్కూళ్ళూ కాలేజీలు అన్నీ తెరుస్తారు. పైగా ఇదివరకటి కంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక రకంగా నిలదొక్కుకోలేకపోతే కష్టమైపోతుంది.” అంటూ చెప్తూ గేటు దాకా అడుగులేసిన కిరణ్ కి గుమ్మంలో భార్య, ఇద్దరు పిల్లలు నిలబడి టాటా చెప్తున్నారు.

కిరణ్ పోలీస్ ఇన్స్పెక్టర్. లాక్డౌన్ డ్యూటిలో రెడ్జోన్ కి వెళ్తున్నాడు. ఇన్ని చెప్తున్న మనసులో ఒక రకమైన భయం. ఏం పరిస్థితుల్లో ఇంటికి తిరిగొస్తానో అని.

ఇంట్లో తన భార్య సమర్ధవంతంగా నడుపుకుంటోంది. లేకపోతే ఈ పరిస్థితుల్లో మానసికమైన ఒత్తిడి ఎక్కువైతే, డ్యూటీ ఎలాగూ తప్పదు. కానీ ఇలాంటి ఇబ్బందులు ముందుగానే రుగ్మతలకు దారి తీస్తాయి. అనుకుంటూ తన భార్య తనకి అందిస్తున్న సహకారానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

అలా ఆలోచనల్లో సాగిపోతుండగానే తన డ్యూటీ ప్లేస్ కి చేరుకున్నాడు. అంతే, ఇంక తనలోని పోలీస్ అలెర్ట్ అయిపోయాడు. రిపోర్ట్ చేసి, కాపలా మొదలుపెట్టారు తమ బృందం.

ఇంతలో ముగ్గురు కుర్రాళ్ళు, ఒకే బండి మీద మాస్కులు గ్లౌజు ఏవీ లేకుండా అటుగా వస్తూ కనిపించారు. వాళ్ళని అడ్డుకుని “ఎందుకొచ్చారు? బయట మీకేంపని? పైగా ముగ్గురు, ఏ జాగ్రత్త లేకుండా ఏంటిది” అనడిగారు. ఒక్కడి దగ్గరా సరైన సమాధానం లేదు. అందులో ఒకడు సరిగ్గా తన పెద్ద కొడుకు లాగే ఉన్నాడు.

“ఒక పక్క భగభగలాడే ఎండ, రెండో పక్క ఈ కరోనా భయం, పైగా ఈ టైంలో ఇలా అజాగ్రత్తగా బాధ్యత లేకుండా ఎలా ఉంటారు? ఇంట్లో వాళ్ళు ఏమీ అనరా?” అంటూ చిర్రెత్తిపోయి, వాళ్ళని గట్టిగానే మందలించాడు. “మళ్ళీ రోడ్డు మీద కనిపిస్తే స్టేషన్ లోనో క్వారంటైన్ వార్డులో నో పెట్టేస్తా జాగ్రత్త” అంటూ వార్నింగిచ్చి బండి సీజ్ చేసేసి వాళ్ళని సాగనంపాడు.

రోజూ ఇలాంటివి ఏవో ఒక చేదు అనుభవాలు. ఎవరినైనా బెదిరించినా, బళ్ళు సీజ్ చేస్తున్నా మనసుకి కలిగే బాధ వర్ణనాతీతం. ‘జనం ఇలా బాధ్యత లేకుండా ఎలా ఉంటారు? అరే! ఒక పక్క మాలాంటివాళ్ళెందరో వీళ్ళ ఆరోగ్యాలకోసం, క్షేమం కోసమేగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబాలని వదిలి రోడ్ల మీద ఎండల్లో ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేస్తున్నది. మరి వీళ్ళకి అర్ధమవదెందుకు?’

ఇలా ఆలోచిస్తూ రోడ్డు దాటుతున్నాడు భోజనానికి. అడ్డంగా వచ్చిన కారు దాదాపు అతడి మీదకి ఎక్కెయ్యాల్సిందే. సడెన్ బ్రేకుతో ఆగిన చప్పుడుకి తలెత్తి చూస్తే అందులో ఒక నడి వయసు స్త్రీ. ముఖమంతా చెమటలతో, కంగారుగా దిగింది.

ఏం జరిగిందంటూ అడిగేసరికి వెనక సీట్లో నెప్పులతో ఎప్పుడైనా ప్రసవమయ్యేలా ఉన్న ఆమె కూతురు. అయ్యో, అనుకుని, ఆమెను కారు నడపమని అతగాడు కూడా బండితో ఎస్కార్టుగా వెళ్ళి హాస్పిటల్లో దింపాడు. వాళ్ళు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి వైద్యం మొదలు పెట్టారు. అప్పుడు చెప్పింది ఆమె తల్లి, భర్త ఉద్యోగం వల్ల పొరుగూరిలో ఉంటాడట. కొడుకూ పై చదువులకోసం పరాయి దేశం లో. ఇద్దరూ లాక్డౌన్ వల్ల ఇరుక్కుని రాలేని పరిస్థితి. ఇప్పుడేమో ఇలా అంటూ కంట తిండి పెట్టుకున్న ఆమెలో తన సోదరి కనిపించింది. ఆమెను. ఓదార్చి, అవసరమైతే ఫోన్ చేయమని తన నెంబరు ఇచ్చి, అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని నిర్ధారించుకొని అక్కడినుంచి కదిలాడు.

అప్పటికే సాయంత్రం ఐదుగంటలు అయ్యింది. తల నెప్పికి కనీసం కాఫీ తాగుదామంటే అవకాశం లేదు అనుకుంటుండగా గుర్తొచ్చింది. తను మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేదని. …. !!!

ఇలా, జనాల మాన ధన ప్రాణాలను నిరంతరం కాపు కాస్తున్న పోలీస్ సోదర సోదరీ బృందమంతటికీ మనఃపూర్వక కృతజ్ఞతాభివందనాలు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *