Self-Dependency
- Bhavalavanyam
- 0
- on Sep 14, 2022
నా జన్మ భూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశమూ
నా సామి రంగా
హైహై నా సామి రంగా…
ఈ పాట తొలిసారి విన్న సామాన్యుడెవడైనా అసలిప్పుడు దేశాన్ని ఎవరేమన్నారని అని ఆలోచించే అవకాశాలు లేకపోలేదు.
దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా
అంటూ వినిపించిన ప్రతిసారీ ఒళ్ళు పులకరించిన భావమేదో తెలిస్తే బహుశా అదే దేశభక్తి మనలోనూ ఉందని అనేసుకుని మళ్ళీ స్కూటరెక్కి ఆఫీసుకెళ్ళి పనులలో మునిగిపోయిన సందర్భాలెన్నో
ఒకప్పుడు…
అందమైన పల్లెటూరు, అందులో చక్కని పెంకుటిల్లు, మండువా లోగిళ్ళు, ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, ఊరిలో లెక్కగా ఉండే నాలుగు వీధులు, అందరూ అందరికీ ఆప్తులు, ఊరవతల అందరికీ తలో చిన్న పొలం, ఊరి మధ్యన గుడి, గుడి పక్కన కోనేరు, ఇంటి కొట్టాలో పశువులు, పాడి, పాలు, పళ్ళు, గోతాంలో నిల్వ ఉంచిన ధాన్యపు బస్తాలు, సమయానికి పడే వానలు, వేసవిలో కాసే ఎండలు, తెల్లవారుజామున పొలానికెళ్ళే రైతులు, దుక్కిదున్నే కాడెడ్లు, నారు వేసే పొలం కూలీలు, బువ్వ తినిపించే అవ్వలు, బోసి నవ్వుల పసిపాపలు, కల్మషం లేని చిన్నతనం, ఆకతాయిల కుర్రతనం, అరవిరిసిన మందారనవ్వుల ఆడపిల్లలు, ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే ఇల్లాలి నేర్పరితనం, కోవెల గంటల నాదాలలో ఒక ప్రశాంతమైన ఉదయం….
మరిప్పుడు….
చక్కని జీవితాలు, ప్రాపంచీకరణ, సులువైన బ్రతుకులు, స్టాండింగ్ కిచెన్, రైడింగ్ బైక్, మొబైల్ ఫోన్లు, ఏసీలు, స్మార్ట్ టీవీలు, ఒకరి మొహాలోకరు చూసి పలకరించుకోలేని పర్సనల్ జోన్, ప్రైవసీ, స్వాతంత్ర్యం పేరుతో విచ్చలవిడిగా వాడుకొనే స్వేచ్ఛ, ప్రేమ పేరుతో ఒకరినొకరు చేసే మోసం, మమత పేరుతో అతిగా చేసే గారం, మొండితనంతో కష్టాన్ని ఎదుర్కోలేని భీరువుగా మారిన యువతరం, ఎప్పుడూ ఎంటర్టైన్మెంటులలో మునిగి తేలుతూ స్వంత మెదళ్ళను కోమాలో పెట్టిన మధ్యతరగతి జీవనం, ఎవరికో ఊడిగం చేసి ఆధారపడితే తప్ప జీవితం వెళ్ళదని దృఢంగా నమ్మికకు చేరిన నిస్సహాయత నిండిన మనస్తత్వం, ఆలోచనా ధోరణిని ఆవేశాన్ని సరైన పంథాలో పెట్టుకొమ్మని చెప్పే పెద్దల్ని శతృవులుగా చూసే ఆ ఆధునిక వ్యవహార శైలి….
మనమెప్పుడో మనల్ని మనం, మన ఆలోచనల్ని కలిపి ఈ ప్రాపంచీకరణకు తాకట్టు పెట్టేసేం. కాబట్టే ఈరోజు ఒక నెల పనిలేదంటే ఇకపై బ్రతికేదెలాగంటూ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.
నా దేశ యువతరం ప్రపంచం మొత్తంమీద దృఢమైనది. అత్యంత ఎక్కువ శాతం యువత కలిగిన నా ఈ దేశం తల్చుకుంటే దారిద్ర్యం మన దరిదాపులకెన్నడూ చేరదు. తమ తెలివి, బలం, సమయం విలువ తెలిసీ పరాయి దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడే ఒక్కోక్క యువతకూ నే పిలుపునిస్తున్నా. ఇదే సరైన సమయం. మనకున్న వనరులతో, శక్తి సంపదలతో సంఘటితమై మనకోసం మనమే పాటు పడదాం. సర్వ స్వతంత్రులుగా చరిత్రలో నిలిచిపోదాం. మనమెంత ఉన్నతమైన భూమిపై జన్మించామో ఆ నేలకెంతటి శక్తి ఉందో మనమంతా కలసి నడుం కట్టి ముందుకు నడిచి ప్రపంచానికి చాటిచెప్పుదాం.
భారతదేశానికి ప్రపంచపటంలో ప్రపంచదేశాలన్నిటిలో ఎప్పుడూ ఒక ఉన్నతమైన ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని నిలబెట్టుకుని ప్రపంచం మొత్తం నోరెళ్ళబెట్టుకుని మనవైపు చూసేలా చేయగల శక్తి మనకుంది. నమ్మకంతో ముందుకు నడుద్దాం.
మనకున్న స్వదేశీ వనరులతో వ్యవసాయం, వ్యాపారాలపై ఇప్పటికైనా దృష్టి సారిద్దాం.
రైతు దేశానికి వెన్నెముక అని నమ్మిన మనం ఆ రైతును ప్రోత్సహిద్దాం. కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం కాకుండా నిలుపుకుందాం. ఆధునికీకరణ వైపు కాకుండా ప్రకృతి సిద్ధంగా ఉన్న జీవితం వైపొకసారి దృష్టి సారిద్దాం…