
తస్మాత్ జాగ్రత్త!!
- Bhavalavanyam
- 0
- on Sep 07, 2022
ఎధావిధిగా ఉదయాన్నే డిజిటల్ న్యూస్ పేపర్ లో కరెంట్ స్టేటస్ చూస్తున్న సూర్యకి “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు” అంటూ ముద్దు ముద్దుగా పలుకుతున్న తన కొడుకు సహజ్ మాటలు వినిపించాయి. వాడికి రెండున్నరేళ్ళు. ఆశ్చర్యపోతూ, ఒరేయ్ పండూ, ఎంత బాగా చెప్తున్నావో. ఏదీ మరోసారి చెప్పు అంటూ దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడబోయాడు. “ఉండు నాన్నా, కరోనా వస్తుంది. మీటర్ దూరంగా ఉండి మాట్లాడు” అంటూ చురచురా బుగ్గ తుడిచేసుకుంటూ దూరంగా వెళ్ళి నుంచున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం సూర్య వంతయ్యింది.
ఇదంతా గుమ్మంలో నిలబడి ముసిముసిగా నవ్వుతూ చూస్తున్న ప్రభ అప్పుడే పనులు పూర్తి చేసుకుని వంటింట్లోంచి కాఫీ, సహజ్ కు పాలు కలుపుకొచ్చింది. అందరూ సోఫాలో ఎదురెదురుగా కూర్చొని తాగుతున్నారు.
“నాన్నా, బయటికెళ్ళొద్దని టీవీలో చెప్తున్నారు కదా, నువ్వెందుకెళ్తున్నావు మరి?” అని అమాయకంగా అడుగుతున్న కొడుకు మొహం చూసి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి ప్రభకి.
ఇంతలో సూర్య ఆ చిన్నారి చెప్పే చిట్టి చిట్టి కబుర్లు వింటూనే చకచకా రెడీ అయి భుజాన తెల్లకోటు, మెడలో స్టెతస్కోప్ వేసుకుని గుమ్మంలో నిలబడి, కొడుకుని దగ్గరికి పిలిచి ముద్దు పెట్టుకుని, సరే ప్రభా, వెళ్ళొస్తా అంటూ బయల్దేరాడు హాస్పిటల్ కి. అతను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్.
అతడు గుమ్మం దాటగానే ప్రభకి మనసంతా భారంగా అయిపోయింది. కరోనా గురించిన అత్యవసర సేవా విభాగాల్లో డాక్టర్లు మొదటి స్థానంలో ఉంటారన్న సంగతి ఆమెకు ముందే తెలుసు. డాక్టర్ భార్య కదా. ఇదే కాదు, ఏ రకమైన వాతావరణంలో ప్రబలే రోగాల సమయంలోనైనా, లేక ప్రకృతి విపత్తు సమయంలోనైనా, మరే ఇతర సమయాలలోనైనా వైద్యులదెప్పుడూ అత్యవసర సేవా విభాగమే. అందుకే “ఆరోగ్యమే మహాభాగ్యం” అనేది. ప్రభ పరిస్థితి దాదాపు యుధ్ధానికెళ్తున్న సైనికుని భార్య లాగే ఉంది. ఏరోజు ఎలా ఇంటికొస్తారో, అసలోస్తారో రారో, ఏం క్షణం ఏ వార్త వినాల్సొస్తుందోననే భయం ఆమెని వెంటాడుతోంది.
నిత్యం ఇంట్లోంచి బయటికెళ్తూనే కాల్ లో, మెసేజెస్ లో తిరిగి ఇంటికి చేరే వరకూ తన అప్డేట్స్ ఇచ్చే అవకాశముండే ఉద్యోగమూ కాదు, పరిస్థితులూ కావవి. ఆమె అర్ధం చేసుకోగలదు. అందుకే కొడుకుకి, అత్తమామలకి ఆమె భర్త వంతు ప్రేమని కూడా పంచుతూ ఆయన బయట మృత్యువుని జయించడంలో ప్రజా సేవలో ఉంటే, ఆమె ఆయుధంలేని పోరాటం చేస్తూ ఆత్మస్థైర్యంతో నడుపుకొస్తోంది. ఇంతలో, “అమ్మా, రా మనం తాత బామ్మతో కథలు విందాం” అంటూ చెయ్యి పట్టుకుని లాగుతున్న కొడుకు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. పది నాన్నా అంటూ వాడి వెనకే నడిచింది ఆమె.
అటు సూర్య పరిస్థితి….
ఇంట్లోంచి బయల్దేరే సమయంలో కొడుకు ముద్దు మాటలు తల్చుకుంటూ కార్ నడుపుతూ హాస్పిటల్ కి వెళ్ళేదారిలో, వద్దని వారిస్తున్నా వినకుండా రోడ్లపైకి వచ్చి పోలీసుల దెబ్బలు తింటున్న సంఘటనలు చూసి, మనసులోనే బాధ పడ్డాడు. ఇంతలో హాస్పటల్ చేరాడు.
ఇంక తనలోని తండ్రి పక్కకి వెళ్ళాడు. వృత్తి లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి రోగులు సేవలో టైం ఎలా గడుస్తోందో, క్షణాలెలా చేతుల్లోంచి జారిపోతున్నాయో తెలీని పరిస్థితి. రకరకాల పేషెంట్లు లేరు. కేవలం ఒకరో ఇద్దరో ఎమర్జెన్సీ కేసులు. కానీ అదే హాస్పిటల్ లో ఒక నాలుగు గదులు మాత్రం క్వారెంటైన్డ్ పేషెంట్లు. విదేశాలనుండి ఇళ్ళకొచ్చి, తాము విదేశాలనుంచి దిగుమతయ్యామన్న విషయాన్ని కిమ్మనకుండా దాచిపెట్టి, తమతోబాటుగా తమ కుటుంబాలను కూడా ఈ ప్రమాదానికి గురిచేసిన ప్రబుద్ధులు. వీళ్ళంతా చదువుకున్న మూర్ఖులు. వీరికి వైద్య సేవలందించడానికి 24/7 వైద్య సిబ్బంది రెడీగా ఉండాలి. ఆ గ్రూప్ లో స్పెషల్ డ్యూటీలో తానూ ఉన్నాడు. ఏవో ఇంజెక్షన్ చేయడానికి లోపలికి వెళ్ళబోతూ, రక్షణ కిట్ వేసుకుంటున్న సూర్య మనసులో మళ్ళీ ఒకసారి కొడుకు సహజ్ మాటలు మెదిలాయి. నాన్నా కనీసం మీటర్ దూరంగా ఉండి మాట్లాడు అంటూ….
పేషెంట్ దగ్గర నిలబడి అన్ని రీడింగ్స్ చెక్ చేస్తున్నంత సేపూ అదే ఆలోచన. ఎంత వయసుంటుంది వీడికి? కనీసం 35 ఏళ్ళు. గొప్ప గొప్ప చదువులు, విదేశీ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు, ఖరీదైన భవంతులు, ఇతర సదుపాయాలు. ఏం నేర్పాయి వివేకాన్ని? ఎటుపోతున్నారు వీళ్ళు? ఇంత మూర్ఖత్వమెలా ఉంటుంది? అనుకుంటూ ఉండగానే, అదే పేషెంటు కారణంగా కరోనాకి గురైన అతని అరవై ఏళ్ళ తండ్రి ఆరోగ్యం విషమించి వెంటిలేటర్ లో ఉంచాల్సిన పరిస్థితి. ఆ వ్యక్తి తనలో తానే కుమిలిపోతూ చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ ఏడుపు.
ఇంక చేసేది లేక, సూర్య అతడికి ధైర్యం చెప్తూ కౌన్సిల్ చేసే పనిలో పడ్డాడు….
ఇంత కష్టమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో సమయం గడుపుతున్న అత్యవసర సేవా వాభాగాల ఉద్యోగులు, వారి కుటుంబాలకు శిరసా నమామి. కాస్త ఆలోచించండి.
ఇళ్ళల్లో అన్ని సదుపాయాలు ఉండి టైంకి ఇంత తిని కూర్చోవడానికి నెప్పులు పడి, వద్దన్నా వినకుండా రోడ్లమీదకొచ్చే నిర్లక్ష్యం కేవలం మూర్ఖులకే ఉంటుంది. ఇంట్లోంచి అడుగు బయటేసే ముందు వందసార్లు ఆలోచించండి.
తస్మాత్ జాగ్రత్త!!