First Step – Toli Adugu
- Bhavalavanyam
- 0
- on Sep 08, 2022
శరత్ చంద్ర ఈమధ్యే ట్రాన్స్ఫర్ మీద ఒక కొత్త ఊర్లో ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ అనుకునేరు, హెల్త్ ఇన్స్పెక్టర్ అండి. స్వతహాగా మంచి వ్యక్తి, పైగా సేవా తత్వం ఉన్నవాడు. ఎన్నో ఏళ్ళుగా అదే ఉద్యోగంలో ఉన్నమీదట, డాక్టరు కోర్సు చదవకపోయినా అనుభవం మాత్రం అంతకంటే ఎక్కువే. అందువల్ల చుట్టుపక్కల ఎటువంటి చిన్న చితక వైద్య సంబంధిత సహాయానికైనా అర్ధరాత్రి అపరాత్రి అనే భేదం లేకుండా ఉన్నపళంగా వెళ్ళి అక్కడ అన్నీ సర్దుకున్నాయని నిర్ధారించుకున్నాకే తిరిగివచ్చేవాడు.
అతడి మంచితనానికి తోడు అతడి ఇల్లాలు తారకి కూడా అంతే జాలి, దయ, సేవా తత్పరత. అందుకే దగ్గర ఉన్న అనాథాశ్రమం పిల్లలకి, మురికివాడల్లో పిల్లలకి స్వఛ్ఛందంగా పాఠాలు నేర్పడానికెళ్తుంది. ఏమైనా చిన్న చితకా మందుల అవసరాలు, ఆరోగ్య సమస్యలు ఉన్నచోట భర్త సాయంతో మందులు, తగిన సలహాలు అందించడం ఆమెకు ఇష్టమైన పని. ఇంకేం, భార్యా భర్త నిరంతరం ప్రజల సేవలో తమవంతు కర్తవ్యం నిర్వహిస్తూ, సాయంత్రానికి అలిసి ఇంటికొచ్చి సంతృప్తిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆరోజు జరిగినవన్నీ ఒకరితో ఒకరు పంచుకొని సేదతీరేవారు.
వీరికి తోడు వీళ్ళింట్లో దూరపు చుట్టం ఒకావిడ ఉండేది. ఆవిడ వీళ్ళకి పెద్దదిక్కుగా వంట వార్పు తక్కిన అవసరాలకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆవిడే వర్ధనమ్మ. ఆవిడ కూడా జీవితంలో పడరాని కష్టాలెన్నో పడి అలిసిపోయి బాధలో ఉన్నక్షణం, శరత్చంద్ర దంపతులు ఆదుకుని, కంటినీరు తుడిచి తెచ్చి తమ ఇంట్లోనే ఒక పెద్దదిక్కుగా ఉండమని అడిగారు. వీరి మంచితనానికి కరిగిపోయి, మనసులో ఆ భగవంతునికి కృతఙ్ఞతలు చెప్పుకునేది నిత్యం వర్ధనమ్మగారు.
అంతా మంచిగానే ఉంటే భగవంతుడు ఎలా గుర్తొస్తాడు అనుకుంటాడో ఏమో, ఏదో ఒక లోటు ప్రతీ ఒక్కరి జీవితంలోనూ పెడతాడాయన.
ఈ ఆదర్శదంపతులకి పిల్లలు లేకపోవడం ఒక లోటు. అందుకేనేమో చుట్టుపక్కల పిల్లలమీద మరింత మక్కువ శ్రధ్ధ ఉండేది తార కి.
వాళ్ళు కొత్తగా వచ్చిన ఊరు కాస్త టౌన్ హంగులు అప్పుడప్పుడే దిద్దుకుంటూ అటు పల్లెకీ ఇటు పట్నానికీ చెందకుండా ఉంది. ఊళ్ళో మగవారు కొంతమంది దగ్గర్లో ఉన్నపట్నంలో ఉద్యోగాలు, మరికొంతమంది వ్యాపారాలు. మిగిలిన ఒక ఇరవై శాతం ఊరి పంటపొలాలను పండిస్తూ రైతులుగా జీవితం గడిపేవారు.
ఇంతవరకూ ఈ దంపతులు ఒక పట్నం లో ఉండేవారు. అక్కడ మురికివాడలనీ, అనాథాశ్రమలనీ ఉండేవి కాబట్టి తార అక్కడికెళ్ళడం ఒక అలవాటుగా మార్చుకుంది. కానీ అప్పుడప్పుడే ఎదుగుతున్న పల్లె కావడం చేత ఇక్కడ అంతా దాదాపు బాగానే ఉంది. అవసరంలో ఉన్నవారికి మాటసాయం చేసేవారు ఇంకా ఉన్నారు. ఆ వాతావరణం ఆమెకు సహజంగానే నచ్చింది.
ఇంట్లోనే తనకు నచ్చిన పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తుండేది. పక్కింటి వాళ్ళు పొరుగింటివాళ్ళ రాకపోకలు పెరిగాక అంత తీరిక కుదిరేది కాదు. కానీ, ఆమె ఒక విషయాన్ని గమనించింది. అంతమంది వచ్చిపోతున్నా, ఎందుకో మనసుకు ప్రశాంతత లేదు. ఎందుకా అని ఆలోచించడం మొదలు పెట్టింది.
ఖాళీగా ఉన్న ఆడవారు సాధారణంగా వచ్చి కూర్చుని మంచీ చెడూ మాట్లాడుకుందాం అంటూ మెదలు పెట్టి, ఎక్కువగా వారి పొరుగువారిపై ఉన్నవి లేనివీ చెప్పడం, అనవసరమైన నెగెటివిటీని పెంచుతోంది. ఒకామె వచ్చినరోజున రెండవ అమె రాదు. ఇద్దరూ వచ్చినప్పుడు ఒక విధంగానూ, ఒక్కొక్కరే వచ్చినప్పుడు మరొకవిధంగానూ మాట్లాడడం, లేనిపోని డాబులు పలకడం ఇలా ఎన్నో విషయాలను ఆమె గమనించింది.
స్వతహాగా ఇలా కాలక్షేపం కబుర్లు గానీ, అర్ధం పర్ధం లేని టీవీ ప్రొగ్రామ్స్ గానీ తన జరుగుబాటుగా ఉండటం తార కి ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు విధిలేక నిత్యం ఇలాంటివాటిమధ్యే కాలక్షేపం చేయవలసి రావడం ఆమెను కలతపరుస్తోంది. అలాగని ఎవ్వరితోనూ సంబంధ బాంధవ్యాలు లేకుండా ఎలా ఉంటుంది?
అప్పుడు ఆమె వర్ధనమ్మగారితో కలిసి ఆలోచించడం మొదలు పెట్టింది, దీనికి పరిష్కారం ఏంటా అని. ఇద్దరూ కలిసి ఒక ఆలోచన చేశారు. వీళ్ళింటికి వచ్చే ఆడవారికి డబ్బులు గానీ, బీదరికం గానీ పెద్ద కష్టాలు కావు. కానీ పెద్దగా చదువు లేకపోవడం, చుట్టుపక్కల వాతావరణం అనుసరించి అంతకంటే వారివద్ద మార్గం లేదు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ప్రావీణ్యం ఉంది. అదే వాళ్ళమాటల్లో ఆమె తెలుసుకున్న విషయం. వారేదో మాట్లాడదామని మొదలు పెట్టిన క్షణం ఆమె మాట మార్చి ఎలా చదువుసాగింది, ఏమేం వచ్చు?, ఏ విషయంలో ఆసక్తి ఉంది, ఇలాంటి విషయాలను ముందుగా కూపీ లాగింది. అప్పుడర్ధమైంది ఆమెకు, చేయడానికి పెద్దగా పని, ఆలోచించడానికి పెద్ద విషయం లేకపోతే మనుషుల బుర్రలు ఎలా చెదలు పట్టి అక్కర్లేని విషయాలకు ప్రాధాన్యతనిస్తాయో. అందుకే “An empty brain is a devil’s workshop” అనే సామెత ఉంది ఇంగ్లీషులో.
ఒకరు చదువులో మంచి అందెవేసిన చెయ్యి. మరొకరు కుట్లు అల్లికలు, ఇంకొకరు వంటలలో దిట్ట ఐతే, ఇంకొకావిడ పాటలు పాడడంలో ప్రావీణ్యం కలది. ఇలా అందరికీ భగవంతుడు ఏదో ఒక చక్కటి నైపుణ్యం వరంగా ఇస్తాడు. కొంత మంది ఇతరులతో చేయించడం వచ్చినవారైతే, మరికొంతమంది నేర్చుకుని చక్కగా చేయడం వచ్చినవారౌతారు. ఇలా చేస్తే వారందరినీ ఏదో ఒక చక్కటి పనిలో లేదా మంచి సాధనలో నిమగ్నమయ్యేలా చేయడం ఆమెకు మంచివిషయంలా తోచింది. ఇంకేముంది. నెమ్మదిగా ఆమె తన స్పూర్తిదాయకమైన మాటలతో ఒక్కొక్కరినీ ప్రభావితం చేసింది.
“ఒదినా, నీకెంతో ఓర్పు, పైగా పిల్లలకి పాఠాలు కూడా చాలా చక్కగా చెప్తావు. మన చుట్టుపక్కల పిల్లలందరికీ నువ్వు ట్యూషన్ చెప్తే వాళ్ళకి మంచి గైడెన్స్ దొరుకుతుంది, నీకూ చక్కని కాలక్షేపం అవుతుంది” అని నచ్చచెప్పేసరికి ముందు కాస్త సంశయించినా సరళ నెమ్మదిగా ఆమె మాటలకి ప్రభావితం చెంది ఆ పనిలో పడింది. మిగతా వాళ్ళకి “సరళ ఒదిన దగ్గరకి మీ పిల్లలని పంపండి, ఆమె చదువు వారికి ఉపయోగపడుతుంది. అంతే కాక మీకు కూడా సరైన మార్గదర్శనం లేక పిల్లలు ఎటూ కాకుండా ఉండిపోతారేమో అనే భయం ఉండదు” అంటూ మిగిలినవారికి చెప్పి ఒప్పించింది.
మృదుల టైలరింగ్ లో అందెవేసిన చెయ్యి. కానీ బయటివాళ్ళకి ఆ పని చేస్తే చులకనౌతానేమో అనే ఆలోచన ముందుకెళ్ళనివ్వడం లేదు. ఆమెకు ధైర్యం చెప్పి, నీకు వచ్చిన విద్య పదిమందికి ఉపయోగపడడమే కాకుండా నీకు కూడా సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకోవచ్చో తెలుస్తుంది. కాబట్టి నా మాట విని ముందుగా నాకే బట్టలు కుట్టిపెట్టు అంటూ ప్రోత్సహించింది. కొద్దికాలం లోనే అందరూ ఆమె వద్దకే రావడం మొదలు పెట్టేరు. అంతే కాదు, చుట్టుపక్కల నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి క్లాసెస్ కూడా వారానికి మూడురోజులు చప్పున నడుపుతూ హాయిగా తన సమయాన్ని వినియోగించుకుంటోంది.
మరొకామె వాసంతి, చీరలకు అద్దకం పనులు చాలా చక్కగా చేస్తుంది.మంచి మంచి డిజైన్లు వేస్తుంది. ఆమెకు పట్నం నుంచి అవసరమైన వారిని కలిసి తగిన శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేసింది. కొద్దికాలం లోనే ఆమె అద్దకం డిజైనింగ్ పనులలో తగిన శిక్షణ తీసుకుని తన ఇంటి దగ్గరే లోనే మరి కొంతమంది ఆడవారితో కలిసి చిన్న కుటీర పరిశ్రమగా నడపగలిగేలా అడుగడుగునా సహాయం అందించింది తార.
ఇలా ఎవరికి ఏ విషయంలో అసక్తి ఉందో వారిని అటువైపు నడిపించింది.
ఎంత హడావుడిగా ఉన్నా ఆ ఊర్లో ఆడవారందరూ ప్రతి శనివారం సాయంత్రం ఒక రెండు మూడు గంటలు తార వాళ్ళింట్లో సమావేశమౌతారు. ఆ వారంలోని అన్ని విశేషాలూ కలిసి చర్చించుటకుంటారు. ఎవరికి తోచిన విషయాలు వారు హాయిగా పంచుకుంటారు. ఆ సమయంలో వాళ్ళిల్లు ఎంత సందడిగా ఉంటుందో చెప్పలేం. తార వీళ్ళందరినీ ఇలా ఆరోగ్యవంతమైన కాలక్షేపాలతో గడపడం చూసి మనసులోనే ఎంతో సంతోషించేది. వాళ్ళు ఈ ఊరొచ్చి దాదాపు రెండేళ్ళయ్యింది. ఈ రెండేళ్ళలో ఎంత మార్పు. ఒకప్పుడు అనవసరమైన విషయాలతో కాలక్షేపం చేసే వీళ్ళు ఈరోజు తాము హాయిగా ఉండడమే కాక తమ బంధువులకూ, చుట్టుపక్కలవాళ్ళకి కూడా ఇలాంటి ఉపయోగకరమైన మార్గాలని చూపిస్తూ ఆదర్శవంతంగా తయారయ్యారు. ఇది ఏ ఒక్కరితోనూ ఆగదు. ఒకరు ఇద్దరికి, ఇద్దరు నలుగురికీ ఇలా నెమ్మదిగా అందరికీ వ్యాప్తిచెంది వారంతా హాయిగా ఆరోగ్యవంతమైన అలవాట్లతో చక్కని జీవితాన్ని గడిపే ఒక మార్గానికి ఆమె నాంది.
తొలి అడుగు వేయించింది.
ఈ తొలి అడుగు అక్కడితో ఆగక ప్రతి ఒక్కరికీ ప్రేరణగా మారి దారిలో తనతొ కలిసే ఎన్నో అడుగులను నడుపుతూ ఒక కొత్త బాటకు, ఆలోచనకు మార్గం సులభం చేసింది. మహిళా సాధికారత అనేది పెద్దమాట కావచ్చు, కానీ సాధించలేనంత పెద్ద విషయం మాత్రం కాదు. ఇంటి ఇల్లాలు ఎంత చక్కగా ఆలోచిస్తుందో, ఎంత సంస్కారవంతంగా నడచుకుంటుందో, ఎటువంటి ఆదర్శమార్గాన్ని, జీవన శైలిని అలవరచుకుంటుందో ఆ ఇంటి సభ్యులు, వారి తర్వాతి తరాలవారు ఆ ఇంట్లో అంతే చక్కగా తమ జీవితాలను గడుపుతారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని చూడండి అనే ఒక సామెత పేరుగాంచింది తెలుగునాట. వీరంతా తమ దైనందిన జీవితాలలో తమకు ఖాళీ సమయాలలో ఉపయోగకరమైన పనులు చేసుకుంటూ తమకూ, తమ కుటుంబాలకూ, తాము జీవిస్తున్న సమజానికీ తమకు తెలియకుండానే ఎంతో మేలు చేస్తున్నారు. ఇది కనిపించకుండా వ్యాపించే ఆదర్శం. అందరూ పాటించదగ్గ సులువైన మార్గం.
ఇప్పుడు మళ్ళీ తార శరత్చంద్ర సాయంత్రాలు కూర్చుని రోజంతా జరిగిన విషయాలను సంతృప్తిగా ఒకరితో ఒకరు పంచుకుని ప్రశాంతంగా సేద తీరుతున్నారు.
“స్త్రీ తలచుకుంటే సాధించలేనిదేదీ లేదు” అనేది నిజమని నిరూపితమౌతుంటే శరత్చంద్ర తృప్తిగా తారను చూసి నిట్టూర్చాడు.
మిత్రులారా, ఆమె వేసిన ఈ ‘తొలి అడుగు’ ప్రతి ఒక్కరికీ ఆదర్శమే. సమయం ఎంతో విలువైనది. దానిని ఎంత తెలివిగా ఉపయోగించుకుంటామో అంత హాయిగా మన జీవనం సాగుతుంది. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక సామర్ధ్యం ఉంటుంది. దానిని కనుగొని వెలికి తీసి ఎలా ఆరోగ్యవంతంగా వినియోగించుకోవాలో తెలుసుకోవడం నేటి సమాజానికి అవసరం. స్త్రీ తలచుకుంటే సాధించలేనిదేదీ లేదు. ఈ దిశగా ఆమె వేసిన తొలి అడుగువెంట మనమూ అడుగులేద్దామా?