Trust-Friendship
- Bhavalavanyam
- 0
- on Sep 09, 2022
“ఇంకొక్క రెండ్రోరోజుల్లో ఈ లెక్కలన్నీ అప్పజెప్పేసి విడిగా పోతాను. ఆ పాటిదానికి వీడితో గొడవెందుకు. కాస్త ఓపిక పడితే అయిపోయేదానికి” అని ఆలోచించి నోటి చివరిదాకా వచ్చిన పరుషవాక్యాన్ని దిగమింగి అక్కడినుంచి లేచితన గదిలోకెళ్ళిపోయాడు నరేష్.
అతడు, అతడి ప్రాణస్నేహాతుడు దేవా. వాళ్ళు చిన్నప్పటినుంచిస్నేహితులు. దేవా బాగా డబ్బున్న వారబ్బాయి కావడం వలన కొంత నోటి దురుసు ఉన్నప్పటికీ నరేష్ అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. నరేష్ మధ్య తరగతి కుటుంబం నుంచి రావడం చేత సర్దుకుపోవడం అలవాటైన విషయమే. చదువులో, ఇంట్లో, పాటలో ఇద్దరూ పోటీ పడుతూ ఉండేవారు. కానీ ఎవరికి ఫస్టొచ్ఛినా రెండవ వారు నొచ్చుకోవడం, కుళ్ళుకోవడం లాంటివిఎప్పుడూ చేయలేదు.
వయసుతోపాటు వారి మధ్య స్నేహం కూడా పెరుగుతూనేవచ్చింది. చదువయ్యాకా దేవా తన తండ్రివ్యాపారాన్ని చూడడం మొదలు పెట్టాడు. నరేష్ ని పెట్టుబడి లేకుండానే తన వ్యాపారంలోభాగస్వామిని చేసుకుంటాఅన్నాడు దేవా. కానీ నరేష్ అందుకు ఒప్పుకోక అతడికి చేదోడు వాదోడుగా ఉండి వ్యాపారాన్ని చూడడానికి ఒప్పుకున్నా, ఒక ఉద్యోగి లాగే తన కష్టానికి తగిన ఫలితాన్ని మాత్రమే తీసుకొనేవాడు.
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటే చెప్పుకునేదేముంది. నాలుగేళ్ళ సమయం గడిచేసరికి ఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారాన్ని మంచి స్థాయికి తీసుకొని వచ్చారు. అదే సమయంలో దేవా చిన్నాన్న కొడుకు కౌశిక్ తన చదువు పూర్తి చేసుకుని ఢిల్లీ నుంచి తిరిగొచ్చాడు. కుటుంబంలోని వ్యక్తి కాబట్టి, సరే నువ్వూ నాతో ఇందులో భాగస్వామ్యం తీసుకుందువని తమ్ముడు కౌశిక్ ని ఆహ్వానించాడు దేవా. కౌశిక్ ఈ ఆఫర్ కి వెంటనే ఒప్పేసుకొని మర్నాటి నుంచి కంపెనీలో అన్ని పనుల్లోనూ తల దూర్చడం, నరేష్ చెప్పిన ప్రతి పనిని తిరిగి తన పద్ధతిలో చేయించడం, నరేష్ కు రావలసిన నెల జీతాన్ని కావాలనే ఆలస్యంగా ఇవ్వడం, నరేష్ చెప్పే సలహాలను సూచనలను కొట్టి పారెయ్యడం, అతడు చేసిన ఏ పనినైనాఇతర ఉద్యోగుల ముందే విమర్శించడం లాంటివి తరచూ జరుగుతూ ఉండేవి. అడపా తడపా ఈ సంఘటనలు దేవా చెవిన పడినా అతడు ఎప్పుడూ పట్టించుకున్నట్టే లేడు. పైగా ఒకవేళ నరేష్ ఏదైనా చెప్తే వాడు చిన్నవాడు కదా, అనుభవంతో తెలుసుకుంటాడు. కాస్త చూసీచూడనట్టు వదిలెయ్యాలి నరేష్ అంటూ నరేష్ కే నచ్చజెప్పేవాడు.
రాన్రాను తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇలా బ్రతకడం తనవల్ల కాదనిపించింది. ఇంతలో ఒక డీల్ కి సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అదే విషయం కౌశిక్ ని అడిగితే ఇది మా కంపెనీ, అడగడానికి నువ్వెవరివంటూ గదమాయించేశాడు. దేవాకి డైరెక్ట్ గా చెప్పినా వినడు. తనవద్ద ఉన్న ఋజువులు చూపించి ఇంక ఆ కంపెనీ వదిలేద్దాం అనే నిర్ణయానికొచ్చి ఆధారాలు సేకరించ సాగాడు.
కంప్లీట్ లాక్డౌన్ కు ముందురోజే అనుకోకుండా ఒక అత్యవసర సమావేశానికి దేవా, నరేష్ కలిసి వెళ్ళాల్సొచ్చింది. అక్కడ మీటింగ్ అయ్యేసరికే విమానాలు రద్దు చేసేశారు. వాళ్ళిద్దరూ తమ కంపెనీ గెస్ట్ హౌస్ లో చిక్కుపడ్డారు. వెళ్ళే దారి లేదు. బయట తిరిగే అవకాశమూ లేదు. రోజంతా లోపలే. టైం కి లేవడం, గెస్ట్ హౌస్ కేర్ టేకర్ చేసిన టిఫిన్ ఏదో తినడం, సాధ్యమైనంత ఫోన్ లలో వ్వవహారాలు నడపడం మళ్ళీ తినడం, టీవీ లో అప్డేట్స్ చూడడం, ఎప్పుడెప్ఫుడు బయటపడతామా అని దిగులు పడడం లాంటివి చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ మీటింగ్ కి ముందు రోజే నరేష్ దేవాతో చూచాయగా చెప్పేడు తన నిర్ణయం గురించి. దేవా ఏం మాత్రం సమాధానం చెప్పలేదు. ఉండు అని గానీ, అదేంటని అడగడం గానీ చెయ్యలేదు.
నిజానికి ఈ లాక్డౌన్ గనక లేకపోయుంటే తను ఆ మరునాడే అన్నీ వదిలించుకుని వెళ్ళిపోయేవారు. కానీ, ఇప్పుడు ఎటూ కాకుండా ఇరుక్కుపోయాడు. నరేష్ కి అందుకే చాలా అసహనంగా ఉంది. అటు దేవా మాత్రం ఎప్పటిలానే నరేష్ తో మామూలుగానే మసులుతున్నడు. ఇంక ఉండబట్టలేక, అతడితో గట్టిగానే మాట్లాడదామని, ఉన్నదంతా చెప్పి నీకిలా నష్టం కలుగుతున్నా పెడచెవిన పెడితే తర్వాత విచారించినా ఏం చేయలేమని అతడికి చెడు జరగకూడదని కోరుకునే మనిషిగా నిశ్చయించుకుని బయటికొచ్చాడు. ఇంతలో దేవా ఎవరితోనో కాల్ మాట్లాడడం చూసి ఆగిపోయాడు.
కాల్ విన్నదాన్ని బట్టి సారాంశం ఏమిటంటే, అవతల ఎవరో పెద్దామెకి ఎమర్జెన్సీ సందర్భంగా గుండె ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. ఖర్చు సంగతి వెనుకాడద్దు. ఫలానా హాస్పిటల్ కు తీసుకెళ్ళండి. దారిలో ఎవరూ ఆపరు.అంబులెన్స్ బుక్ చేస్తాను. దేనికీ ఇబ్బంది పడద్దు. నేనున్నానని భరోసా ఇచ్చి తగిన ఏర్పాట్లు చేయడానికి రకరకాల వ్యక్తులతో కాల్స్ మాట్లాడుతున్నాడు. నరేష్ కి ఆశ్చర్యం వేసింది. ఎవరు అంతటి ఆప్తులు? ఎవరికి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో చెల్లెలు శ్రావ్య కాల్. అన్నయ్యా! అంటూ ఏడుస్తూనే మొదలు పెట్టింది. ఆ గుండె నెప్పి తన తల్లికే. విన్నవెంటనే మనసు ఉండబట్టలేదు. నిలబడలేక అంటూ ఇటూ తిరుగుతూ అవకాశం దొరికితే వెళ్ళగలడేమో అని చూస్తున్నాడు.
ఇంతలోదేవా నరేష్ దగ్గరికొచ్చి, భుజం మీద ధైర్యం చెబుతున్నట్లుగా చెయ్యి వేశాడు. ఆపుకోలేని దుఃఖం కలిగి కళ్ళల్లోంచి నీరు జలజలా రాలడం మొదలైంది. దేవా అతడిని సముదాయించి, ఏమీ భయం లేదని చెప్పి, అన్నీ తను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. వెళ్ళే పరిస్థితి లేదు గనుక కాల్స్ లో అప్డేట్స్ తీసుకోవడం ఒక్కటే మార్గం. చాలా కాలం తర్వాత దేవా తో మళ్ళీ దగ్గరగా మసలడం వలన అతడిలో ఏ మార్పూ లేదని, తానే అపార్ధం చేసుకుంటున్నాడని అర్ధమైంది. అప్పుడే తెలిసింది, తన జీతం సమయానికి రాకపోతే దేవా అది అవసరానికి తనకందే ప్రతీ ఏర్పాటూ చేస్తూ వస్తున్నాడు. ఇక ఆ డీల్ విషయంలో,అప్పటికే అతను తన తమ్ముడితో మాట్లాడడం, అతడికి వార్నింగ్ ఇచ్చి ఇదే ఆఖరి అవకాశం, మారకపోతే పరిణామం విపరీతంగా ఉంటుందని గట్టిగా చెప్పడం అన్నీ అయ్యాయి. ఇదంతా అర్ధమయ్యేసరికి మనసు ఉండబట్టలేక దేవాకి క్షమాపణ చెపుదామని వెళ్ళాడు.
దేవా ఎప్పటిలాగే మామూలుగా చెదరని చిరునవ్వుతో, “అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు నరేష్. నాకు కంపెనీలో జరిగే ప్రతి విషయం తెలుస్తుంది. అలాగే నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనాతెలుస్తుంది. నువ్వు నా ప్రాణ స్నేహితుడిని. సందర్భాన్ని బట్టి అన్నీ నీకనుకూలంగా చేయలేకపోయినా, అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. మనిద్దరం ఒకటే. ప్రశాంతంగా ఉండు. అమ్మకి ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగానే ఉందిట. ఇప్పుడే శ్రావ్య తో మాట్లాడేను. రేపు లాక్డౌన్ అయ్యే సమయానికి మనం ఇద్దరం ముందు అమ్మని చూసి అప్పుడు మిగిలినవి ఆలోచిద్దాం” అన్నాడు.
దేవా ఎప్పుడింత ఉన్నతంగా ఎదిగిపోయాడో తాను గమనించనే లేదు. ఎంతటి మెచ్యూరిటీతో మాట్లాడుతున్నాడు!! బహుశా లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అదేనేమో. ఇప్పుడు ఒక స్నేహితుడిగా మాత్రమే కాక, ఒక కంపెనీకి అధినేతగా కూడా అతడిమీద గౌరవం పదింతలయ్యింది. నరేష్ కు ఇలాంటి వ్యక్తితో స్నేహం ఎంతో గర్వంగా అనిపించింది. మొత్తానికి లాక్డౌన్ పుర్తయ్యే సమయానికి అతడి తల్లి కూడా కోలుకుని ఇంటికి డిస్చార్జ్ అయి వచ్చేస్తుందని కబురు అందింది..
********************************************
స్నేహం నమ్మకంతో కూడుకున్నది.
సందర్భాలు వేరు కావచ్చు. కానీ ఆప్తులందరు వదిలేసినా, స్నేహితులే అండగా నిలబడి ఆ కష్టాన్ని గట్టెక్కించిన సంఘటనలు కోకొల్లలు…
ఇలాంటి స్నేహితులందరికీ నా అభినందనలు..