• lavibuddha@gmail.com
  • +91 81603 83161

Serve Humanity to Serve God

“మీ ఊరిలో కూడా కరోనా ప్రభావం అధికంగానే ఉందని వార్తల్లో చెప్తున్నారు. నువ్వూ పిల్లలూ క్షేమమేనా? ఇంట్లో సరుకులు అన్నీ ఉన్నాయా? ఆ పెద్దాడు అసలే దుడుకు. ఏదో వంకతో బయటికి వెళ్తాను అంటాడేమో పంపించకు. అవసరాన్ని బట్టి నువ్వే వెళ్లి తెచ్చుకో. నువ్వూ మీ వీధి దాటి బయటికి ఎక్కువ దూరం వెళ్లకు. ఒకవేళ గుంపులుగా జనం ఉంటే దూరంగా నుంచుని మాట్లాడు” అంటూ జాగ్రత్తలు చెప్తూ పోతున్న తల్లిని ఆపింది స్వాతి.

“అబ్బా, అమ్మా, నాకు తెలుసు కదే. నేను పిల్లలు జాగ్రత్తగా ఇంట్లోనే ఉన్నాం. లాక్డౌన్ ప్రకటించిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి సరుకులు కావలసిన కూరలు ఇతర వస్తువులు తెచ్చుకుని వచ్చేసా. ఇప్పుడొక పదిహేను రోజుల దాకా ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. నువ్వేం కంగారు పడకు. నువ్వూ నాన్న జాగ్రత్త. నాన్నని మాత్రం బయటికి వెళ్లద్దను. సరే ఐతే ఉంటాను. మళ్లీ మాట్లాడతాను” అని కాల్ కట్ చేసింది.

Listen to the story in audio form and follow me on Spotify for more stories

అలా కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా గుమ్మంలో నిలబడి రోడ్డు మీదకే చూస్తోంది గిరిజ. ఎదురింట్లోకి కొత్తగా దిగారు. అతను ఏదో మార్కెటింగ్ ఉద్యోగం వలన నెలకు ఇరవై రోజులు క్యాంపులోనే ఉంటాడు. ఈ అమ్మాయి చూస్తే నిండు గర్భవతి. ఇంకొక పది రోజులలో నెలలు నిండిపోతాయి. మొన్ననే సరదాగా మటల సందర్భంలో తెలిసినది ఏంటంటే, వాళ్ళది ప్రేమ వివాహం. ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోవడం వలన, బయటికి వచ్చి పెళ్లి చేసుకుని వాళ్ల సంసారమేదో వాళ్లు నడుపుకుంటున్నారు. ఈ మధ్యనే కొత్త ఉద్యోగం వలన ఈ వూరు వచ్చేరు. అతను క్యాంప్ మీద వెళ్లిన మరుసటి రోజే ఈ లాక్డౌన్ ప్రకటించారు. అటు నుంచి ఇటు తిరగడానికి లేకుండా చిక్కు బడిపోయాడు అతను. అక్కడ ఉండలేక, ఇక్కడికి రాలేక మానసికంగా చలా ఇబ్బందికి గురవుతున్నాడు. ఆమెని పోనీ మా ఇంట్లో ఉండచ్చు కదా, ఈ టైమ్ లో ఒక్కద్దానివీ ఉండడం సరి కాదని చెప్పినా, మొహమాటం వలనేమో, “వద్దులే అక్కా, తను ఏ టైమ్ లో అయినా కాల్ చేస్తారు. మీకు ఇబ్బంది గా ఉంటుంది. అవసరమైతే నేను కాల్ చేస్తాను, మీరు తప్పకుండా వద్దురు గాని” అని చెప్పి అక్కడే తనింట్లోనే ఉండిపోయింది.

పాపం తోచడం లేదేమో. కానీ ఈ సమయంలో భర్త తోడు లేకుండా ఉండడం కష్టమే మరి. జాలి పడినా, అటూ ఇటూ తిరిగి మళ్లీ ఆ అమ్మాయి దగ్గరకి వెళ్తే ఏ ఇన్ఫెక్షన్ వస్తుందో. ఈ సమయంలో అదంత మంచిది కాదని తను వెళ్లే ధైర్యం చేయడం లేదు. అవే ఆలోచనల్లో ఉండగానే ఆ అమ్మాయి ఏదో ఇబ్బందిగా గేటు పట్టుకుని కదలడం చూసి ఉండబట్టలేక పరుగున వెళ్లింది.

నెప్పులు మొదలు అయినట్టున్నాయి. ఆలోచనలు పక్కన పెట్టి ఏంబులెన్స్ కి కాల్ చేసి వెంటనే పిలిపించి దగ్గర్లో ఉన్న హాస్పటల్ కి మళ్లీ బయల్దేరింది. పిల్లలకి చెప్పి, అమ్మాయి భర్తకి కాల్ చేసి విషయం చెప్దామనుకుంది. కానీ కాల్ కలవకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. ఇంతలో హాస్పటల్ చేరుకున్నారు. డాక్టరు “ఆపరేషన్ చేయాలి, ఆమె బంధువులు ఎవరైనా ఉంటే సంతకం పెట్టమంటే” ఎవరూ లేరని వదలలేక, తనే పెద్దక్కని అని చెప్పి సంతకం పెట్టి ఆపరేషన్ కి డబ్బు కట్టి, కబురు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఒక అరగంట కి పండంటి బిడ్ద పుట్టిందన్న కబురు విన్న ఆమె ఆనందం చెప్పనలవి కానిది. అమ్మాయి కసేపటిలో స్ప్రుహలోకి వచ్చింది. లేవగానే తన పాపని చూసుకుంది. భర్తకి కబురు అందిందో లేదో అని అడిగింది స్వాతిని.

స్వాతి అప్పటికే ఒక ఇరవై సార్లు కాల్ చేసి ఉంటుంది. తన మనసెందుకో కీడు శంకించింది. అనవసరమైన ఆలోచనలకు ఇది సమయం కాదని, ఆమెకు స్ప్రుహ వచ్చే దాకా ఎదురు చూస్తూ కూర్చుంది. భగవంతుడా.. ఇక్కడ తల్లీ బిడ్డా క్షేమం.. అక్కడ తండ్రి ఎలా ఉన్నాడో అనుకుని, “కాల్ చేశాను. నాట్ రీచబల్ వస్తోంది. మెస్సేజ్ పెట్టేనులే. చూడగానే కాల్ చేస్తాడు. నువ్వు ప్రశాంతం గా ఉండు” అని చెప్పి రూమ్ లో పడుకోపెట్టించింది.

ఇంతలో టీవీలో వార్తల్లో, ఒక వార్త ఆమెను నిశ్ఛేష్టురాలిని చేసింది. గిరిజ భర్త ఉన్న గెస్ట్ హౌస్ లోనే ఇంకో ఇద్దరికి కరోనా పాజిటివ్ అనే అనుమానంతో అక్కడున్న వారందరినీ హాస్పటల్ కి టెస్టుల నిమిత్తం తీసుకెళ్తున్నారు. ఈ వార్త చూసిన స్వాతికి గుండెల్లో ఏదో కోత. అయ్యో దేవుడా. ఈ పిల్లని ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద కష్టానికి గురి చెయ్యకు, అని ప్రార్ధించసాగింది. మరుసటి రోజు శ్రీ రామ నవమి కావడంతో తాను కూడా అతడు ఆరోగ్యంగా ఉండాలని మనసులోనే ప్రార్ధించడం మొదలు పెట్టింది.

గిరిజకు స్ప్రుహ వస్తూనే మళ్లీ భర్త కాల్ కోసం ఎదురు చూడడం ఆమె గమనించినా, ఏదీ మాట్లాడకుండా నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది, బహుశా అందుకే అతను కాల్ చేయలేదేమో కంగారు పడకు అంటూ ధైర్యం చెప్పింది. ఆమె దిగులుగా ఉన్నా, పాపని చూసి మళ్లీ పడుకుంది. స్వాతి కి మాత్రం ఇంకో కబురేదైనా తెలిస్తే బగుండును..

ఎలా ఉన్నాడో అనుకుంటూ కంటి మీద కునుకు లేకుండా రామ నామ జపం జరుపుతూనే ఉంది తెల్లవార్లూ.

తెల్లారింది.. ఇప్పుడు గిరిజ నిద్ర నుంచి మెలకువ వస్తే ఏం సమాధానం చెప్పాలి ? అని భయపడుతూనే ఆమె రూం లోకి అడుగు పెట్టింది. అక్కా అంటూ ఆమె పిలవడం, ఇంతలో గిరిజ భర్త కాల్ రావడం ఒకేసారి జరిగాయి. సంకోచిస్తూనే కాల్ తీసి ముందు అతని యోగ క్షేమాలు అడిగింది. “ఎలా ఉన్నారు? నిన్న రాత్రి వార్తలు చూశాను, భయంతో ఏం చేయాలో తెలియలేదు. గిరిజ ఒకపక్క డెలివరీ అయి పాపని ప్రసవించింది. మీతో మాట్లాడాలని చాలా సార్లు అడిగింది” అంటూ గుక్క తిప్పుకోకుండా అడుగుతున్న స్వాతి ఆత్రాన్ని చూసి, అతడికి నిజంగానే మనసులో ఒక ఆత్మీయ భావన కలిగింది. అయిన వాళ్ళు అంతా వదిలేసినా ఆమె కష్టంలో ఆదుకుంది.

“బాగున్నాను అండి. అక్కడ గెస్ట్ హౌస్ లో వసతి బాగోలేదని మొన్ననే మా స్నేహితుడి ఇంటికి వెళ్లి, నిన్న ఉదయం పోలిసుల దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకుని ఇంటికి బయల్దేరేను. దారిలో మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇప్పుడే మా ఇంటికి వచ్చి చూస్తే తాళం కనపడి, మీ అబ్బాయి ని అడిగితే కబురు చల్లగా చెప్పేడు. ప్రస్తుతం ఫ్రెష్ అవుతున్నాను. అవగానే అటే వస్తాను. అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. గిరిజ కి సర్ప్రైజ్ ఇద్దాం” అని ఫోన్ పెట్టేసేడు. అరగంట లో వచ్చేసేడు. మళ్లీ కుటుంబం ఒకచోట చేరే సరికి స్వాతికి చాలా ఆనందం వేసింది.
భార్యాభర్తలు ఇద్దరూ ఆమెకు తమ కృతఙ్ఞతలు చెపుకున్నారు.

మనసులోనే ఆ శ్రీరాముడికి నమస్కరించుకుని అన్నం వండి పత్యానికి సిద్ధం చేసి తీసుకొస్తాను అని ఇంటికి బయల్దేరింది..

నమ్మిన వారిని ఆ శ్రీరామ చంద్రమూర్తి ఎల్లవేళలా కాపు కాస్తాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *