Cost of Negligence
- Bhavalavanyam
- 0
- on Sep 10, 2022
“జయ జయ రామ
జగదభి రామ
జయజయ రామ
జానకి రామ”
అంటూ భక్తజన సందోహమంతా ముక్త కంఠంతో ఎవరిళ్ళలోంచి వారే శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల వైభోగంగా చూసి పానకం వడపప్పు నైవేద్యం పెట్టి, ప్రసాదంగా తీసుకుంటున్న వేళ, అంతా బాగుండి ఉంటే ఈ నెల్లో పిల్లకి పెళ్ళి కుదిరిపోయేది. వచ్చే ముహూర్తాలలో ఆ పెళ్ళేదో చేసి పంపించేస్తే, దాని జీవితానికి ఒక దారి ఏర్పడిపోను. ఆ సంబంధం వాళ్ళు వస్తామన్నప్పుడే ఇదంతా జరగాలా?! ఇప్పుడేమో అతగాడు కొన్నాళ్ళు మళ్ళీ మనదేశంలోనే ఉండి తీరాలి. అలా సెలవులు కలిసొచ్చాయనుకోవడానికి లేకుండా ఇదొక పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ కష్టం ఇప్పుడే రావాలా. అంటూ జయరాం తెగ బాధ పడిపోతున్నాడు.
ఒక్కగానొక్క కూతురు శ్యామల. చక్కని కనుముక్కు తీరువతో చూసేవారి కంటికి చలువను ప్రసాదించే దేవతలా ఉంటుంది. చదువు, పని అన్నీ ఉన్నాయి. సరిగ్గా పెళ్ళీడు వచ్చిందని సంబంధాలు చూద్దామనుకునే సమయానికి తల్లికి అనారోగ్యం వలన కాలం చేసింది. అప్పటినుంచి ఆ కూతురే తన సర్వస్వం. ఆమె కూడా తండ్రిని కూతురిలా కాక ఒక తల్లిలా సాకుతూ వస్తోంది. తను పెళ్ళై వెళ్ళిపోతే తండ్రి బాగోగులెవరు చూస్తారనే దిగులుతోనే కాలం వెళ్ళబుచ్చేది. ఈ ఫారిన్ సంబంధం వాళ్ళు వస్తారన్నప్పుడు కూడా ఆమెకు అదే దిగులు. ఇంతలో ఈ లాక్డౌన్ రావడం ఆమెకు చాలా ప్రశాంతత నిచ్చిన విషయం.
ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగా, ఫోన్ మ్రోగింది. తీసి చూస్తే, ఆ ఫారిన్ సంబంధం తెచ్చిన వారి బంధువే. ఏమైఉంటుందో అని కాల్ తీసి చూద్దును కదా, ఆ కాల్ చేసిన బంధువు, జయరాం గారూ, మంచిదైంది ఆ సంబంధం వాళ్ళు మన శ్యామలని చూసుకోవడానికి రాలేదు. తెలిసొచ్చిన విషయం ఏంటంటే, అతగాడికి ఫారిన్ నించి దిగేటప్పటికే జ్వర లక్షణాలుంటే, పారాసిటమాల్ వేసేసుకుని సెక్యూరిటీ కన్ను గప్పి వచ్చేశాడు ట. మన అదృష్టం ఏంటంటే, వాళ్ళు రాకముందే లాక్డౌన్ ప్రకటించడం. ఇప్పుడతగాడు కుటుంబంతో సహా కరోనా లక్షణాలతో బాధ పడుతూ ఆసుపత్రిలో ఉన్నారట. అతడు దాదాపు వెంటిలేటర్ మీద ఉండే పరిస్థితి అని వినికిడి” అంటూ చెప్తూ పోతున్నాడాయన.
ఈ వార్త వినగానే మనసుకి చివుక్కుమంది. అయ్యో, అమ్మాయికి గండం తప్పిందని ఆనందించాలా లేక, పాపం పెళ్ళి సంబరాల్లో మునిగి తేలే వయసులో అతడు మృత్యువుతో పోరాడవలసి వచ్చిందే, ఎంత కష్టం అని బాధ పడాలా.
ఈ వయసులో ఆ తల్లిదండ్రులకెంత మానసిక క్షోభ?! మనసులోనే అంతర్మధనం. చాలాసేపు అవే ఆలోచనలు. అయ్యో, అమ్మాయి పెళ్ళి మాట ప్రక్కన పెడితే, ఆరోగ్యాలు విషయంలో, పరిస్థితులను ఇలా నిర్లక్ష్యం చేస్తున్న ఈ యువతరాన్ని తల్చుకుని ఒకరకమైన కోపం మరోపక్క బాధ కలిగాయి జయరాం కు.
విధి రాతనెవ్వరూ తప్పించలేమని అందుకే అంటారేమో. ప్రకృతి ముందు ఎవరు గెలవగలరు? మనం చేసుకున్న తప్పిదాలు మనల్నే ముప్పులోకి తోస్తే అనుభవం చాలా చేదుగా ఉంటుంది. అప్పుడు కండ్లు తెరుచుకున్నా ఉపయోగమూ ఉండదు.
ఇది ఆ పెళ్ళికొడుకు విషయం మాత్రమే కాదు. మన జీవన విధానం అంతగా మితిమీరి, ప్రకృతిని కలుషితం చేసేసింది. అందుకే మనకూ ఈ విపత్తు తప్పడం లేదు. ఈ సమయంలో ఎంతోమంది ఇళ్ళల్లో పదిలంగా వండుకుని తింటూ, కడుపులో చల్ల కదలకపోయినా, ఇంటికే అంటుకుని ఉండాల్సొస్తోందని బాధ పడుతున్నారు.
ఆయన కళ్ళముందు, తను రోజూ వాకింగ్ కి వెళ్ళే దారిలో వరుసగా ఉన్న నిరుపేదల గుడిసెలు కదలాడాయి. రెక్కాడితే గాని డొక్కాడని జీవులు. వాళ్ళెంత యాతన అనుభవిస్తున్నారో… అనిపించింది.
వెంటనే, మిగిలినవన్నీ పక్కన పెట్టి, అమ్మాయ్, శ్యామలా ఇటురా అంటూ పిలిచి కర్తవ్యం బోధించారు. గంటలో ఓ పాతిక మందికి సరిపడా పులిహార చకచకా కలిపి సిద్ధం చేసేసింది ఆమె. గుమ్మంలో నిలబడి ఎదురుగా ఉన్న గుడిసెలోని ఒకతడ్ని పిలిచి, ఆ పులిహార తీసుకెళ్ళి అందరూ తినమని ఇచ్చి పంపాడు. తండ్రి పెద్ద మనసుకు ఆమె మనసారా నమస్కరించుకుంది. ఆ పేదలు అంతా తలో కొంచెం పంచుకుని తినడం అక్కడే నిలబడి చూస్తూన్న ఆయన కళ్ళలో ఆనంద భాష్పాలు మెదిలాయి. మనవల్ల ఒకపూట ఓ గుప్పెడన్నం తినగలిగినా మన జన్మ ధన్యమైనట్టే అనుకున్నాడు.
ఈ కష్టం గట్టెక్కించమని, అందరికీ కనీసం తిండి అందించమని ఆ భగవంతుడిని ఆర్తిగా వేడుకున్నాడు.