Story behind the closed doors
- Bhavalavanyam
- 0
- on Sep 09, 2022
క్వారంటైన్…
అనుకుంటుండగానే ఆమెకి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. సరే ఇప్పుడే వెళ్లి తెచ్చుకొచ్చేస్తే మంచిది అని బయల్దేరబోయింది. ఇంతలో పాప నిద్ర లేచి ఏడవడం మొదలు పెట్టింది. అయ్యో, ఇప్పుడు బయటికి వెళ్తే పాపని ఎవరూ చూసుకోవడానికి లేరు. సర్లే రేపు చూద్దాం. అంటూ, అయ్యో నా తల్లే, దా అమ్మా…. అంటూ పాపని ఒళ్ళోకి తీసుకుని జోకొట్టడం మొదలు పెట్టింది. నెమ్మదిగా పాప ఎడుపు ఆపి తల్లి ఒడిలో నిద్రకి ఒరిగింది.
నెమ్మదిగా ఒడిలోంచి పక్కన పడుకోబెట్టి పక్కకి జరిగి తనూ ఒరిగింది. సన్నగా గుండెల్లో నెప్పి. కాస్త ఇబ్బందిగానే అనిపించింది. కానీ మందులు తెచ్చుకునే అవకాశం లేదు. అప్పటికే టైమ్ దాటిపోతోంది. ఆమె భర్త వస్తే అదో పెద్ద గొడవ. సాయంత్రం ఆరు దాటేకా నీకు బయట ఏం పనే? ఎవడిని కలవడానికి వెళ్ళేవ్ అంటూ చావబాదితే తప్ప కునుకు తీయడు. నిత్యం కూలి పని చేసి, తెచ్చిన డబ్బంతా తాగడానికి వాడేసి, ఆ మైకంలో ఇంటికి చేరి ఒళ్ళు పోయి తెలియకుండా నోటికి చేతికి వచ్చినట్టు ఆమెను హింసించి అప్పుడు ఉన్న రెండు మెతుకులూ తినేసి నిద్రపోవడం అతనికలవాటు. అతడికి భార్య అంటే ఏంటో, ఆమె మనసులో ఎముందో, తన బాధ్యత ఏంటో తెలుసుకునే చదువూ లేదు, సంస్కారమూ లేదు.
ఆమే చదువుకోకపోయినా తను పెరిగిన ఇల్లు వాతావరణం ఆమెకు ఎంతో సంస్కారాన్ని అలవాటు చేసింది. అర్ధం చేసుకుని నడవడం, ఉన్నదాంట్లో త్రుప్తి పడి బ్రతకడం, సహనం వంటివి సహజంగా ఆడవారిలో ఉంటాయి. ఆమెకి మరింత ఎక్కువ.
పదహారేళ్ళ వయసులో తన పిన్ని బాబయ్య తన బాగోగులు చూసుకుంటూ తనని స్వంత కూతురిలా చూసే అమ్మగారు అయ్యగారి ఇంటి నుంచి బలవంతంగా వాళ్ళు చెప్పినా వినకుండా తీసుకొచ్చి ఈ రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేసేసేరు. ఆ తరువాత ఎవ్వరూ చూడడానికి కూడా రాలేదు. ఆమె బాగోగులు కూడా పట్టించుకోలేదు. ఇంతలోనే కూతురు. జీవితం నరకంలా, ఆనందం అనేది అందని ఒక కలలా తోచడం మొదలు పెట్టింది.
అలా జరుగుతున్న సమయంలోనే ఆమెకు చిన్నగా గుండెనెప్పి తరచూ రావడం, ఆమె దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి అక్కడ డాక్టరమ్మకు చూపించుకోవడం, ఆమె పెద్ద కంగారు లేకపోయినా, మందులు క్రమం తప్పకుండా వాడాలి. తప్పనిసరిగా టైమ్ కి వచ్చి చూపించుకుని వెళ్లాలని మరీ మరీ చెప్పి పంపింది డాక్టర్. ఈరోజు ఆమె వద్దకు వెళ్లాల్సిన రోజు. బయట సోషల్ డిస్టన్సింగ్ పేరుతో ఎవరినీ ఒక టైమ్ దాటితే బయటికి రానివ్వడం లేదు. ఆమె పాపని పక్క ఇంట్లో కూడా పెట్టే పరిస్థితి కూడా లేదు. డాక్టరమ్మ వెళ్లిపోయి ఉంటుంది. భర్త వచ్చే సమయం కూడా ఐపోయింది. అనవసరంగా ఆగిపోయానా? వెళ్లి ఉండాల్సింది.
ఈ విపత్తు వచ్చేకా మొగుడు కూడా ఎప్పుడొస్తాడో, అసలు వస్తాడో రాడో ఆమెకు తెలియడం లేదు. తను ఇల్లు విడిచి వెళ్లేలా కూడా లేదు. తనకేమైనా ఐతే పాప పరిస్థితి ఏమిటో అని ఆలోచిస్తూనే కళ్లలోంచి వెచ్చని నీరు జల జలా రాలిపోతోంది. అలా ఆలోచనల్లో మునిగిపోయిన సమయంలో దడ దడా తలుపు శబ్దం వినిపించి ఇలా ఉండగా ఇంకా వీడి దెబ్బలు కూడా రాసిపెట్టి ఉన్నట్టున్నాయి లా ఉంది అనుకుంటూ వెళ్లి తలుపు నెమ్మదిగా తీసి చూసి ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయింది. తను చూస్తున్నది కలో నిజమో తెలియలేదు. ఎదురుగా ఉన్నది డాక్టరమ్మ. మందులు ఒక చేత్తో, భోజనం ఒక చేత్తో పట్టుకుని తను తీసుకోవడం కోసం ఎదురు చూస్తూ పిలుస్తోంది. రెండవ పిలుపుకి అమ్మగారూ, ఈ సమయంలో మీరు దేవతలా వచ్చేరు. రండమ్మా, లోపలికెళదాం అంటూ మర్యాదగా పిలిచింది.
వద్దు, నీకోసం ఎదురు చూసి ఇంకా రాలేదని, నీ కేసు రెజిస్టర్ చూసి నీ అడ్రెస్ పట్టుకుని వచ్చాను. ఈ సమయంలో నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో అని ఇంక ఉండబట్టలేక ఇలా వచ్చాను. ఇదిగో ఈ డబ్బు ఉంచు. ఎందుకైనా అవసరానికి ఉపయోగపడుతుంది, అని చేతిలొ పెట్టి బయెల్దేరింది ఆమె.
ఇప్పటికీ నమ్మలేకపోతోంది, మందులు వెంటనే వేసుకొమ్మని మరీ మరీ చెప్పి వెళ్లిన డాక్టర్ ని తల్చుకుని, తీసి చూసి వెంటనే వేసుకుంది. మళ్లీ వచ్చి పాప పక్కన నడుం వాల్చి ఆలొచన మొదలు పెట్టే లోపుగానే నిద్ర పట్టేసింది. ఆ రోజు భర్త ఇంటికి రానేలేదు. మరునాడు విషయం కనుక్కుందాం అని పక్కింటి అతడి స్నేహితుని ఇంటికి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే, రాత్రి తాగడానికి మందుకోసం షాప్ ముందు గొడవ చేస్తుంటే పోలీసులు పట్టుకుని పోయారట. ఈ ఇరవై ఒక్కరోజుల లాక్డొవ్న్ అయితే తప్ప వదలరు అని చెప్పేరట. ఒకపక్క మనసుకి ఏదోలా అనిపించినా, పోనీలే ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉన్నాడు. వాడు తిరిగి వచ్చే దాకా మనశ్శాంతి కూడాను అనుకుంటూ తనకోసం గంజి కాచుకోవడానికి గుడిసెలోకి మళ్లీ తిరిగి వెళ్లింది..
ఇలాంటి అభాగ్యులు ఎంతమందో..
ఇందులో ఉన్నలాంటి డాక్టర్ లు ఎంతమందో.
అలా తాము కూలీ చేసుకుని సంపాదించుకున్న సొమ్ములు తాగుడుకు బానిసలై పెళ్ళాం పిల్లలని పట్టించుకోని వాళ్ళు ఎంతమందో..
ఎవరి జీవితాలు ఎలా గడుస్తున్నాయో..
మూసిన తలుపుల వెనకాల ఎన్ని జీవితాలు ఎన్ని రకాల కష్టాలను చవి చూస్తున్నాయో..
ఎన్ని ప్రాణాలు తీరని ఆకలితో నరక బాధ పడుతున్నాయో..
మనకి చేతనైతే మన దగ్గరున్న దానిలోనే కొంత వారికీ పంచి మన పెద్ద మనసుని చాటుకుందాం..
మనమూ బతుకుదాం
మన తోటి వారినీ బతికించుకుందాం..
ఈ కష్టాన్ని గట్టెక్కుదాం….