• lavibuddha@gmail.com
  • +91 81603 83161

Thanks to the Journalists

పేపర్ చదువుతున్న ప్రతిసారీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి కావ్య. అసలు మన చుట్టూ ఏం జరుగుతోందనే విషయానికి అద్దం పట్టేదే న్యూస్ పేపర్. జనానికి ఒకరినొకరు తాకడం ద్వారా వివిధ మాధ్యమాల్లో వ్యాపించే ఈ వ్యాధిని అరికట్టడం కోసం ప్రభుత్వం వారు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఈ లాక్డౌన్. అందులో పేపర్ సర్క్యులేషన్ కూడా ఉంది. అయినా పాత్రికేయులు వారి పని మానకూడదు. ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా ప్రజలకు వార్తలు అందించడమే ఒక పత్రికా విలేఖరిగా నా కర్తవ్యం. ఇప్పుడు ప్రింట్ మీడియా బంద్ అయినా డిజిటల్ మీడియా ఉంది. దాన్ని నిలబెట్టడం చాలా అవసరం. నన్ను బయల్దేరనీ, గొడవ చెయ్యకు. నవ్వుతూ పంపు. కాల్ చేస్తాను. ఎప్పటికప్పుడు ‌ఎలా ఉన్నదీ చెప్తాను. అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తాను అంటూ చేతిలో చెయ్యేసి మాటిస్తున్న శేఖర్ ని చూసి కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళను తుడుచుకుని బై చెప్పింది. 

ఇంతలో మానస తన ఎనిమిదేళ్ళ కూతురు, అమ్మా, జర్నలిజం అంటే ఏంటమ్మా? నాన్న ఏం చేస్తారు? నువ్వెందుకు వెళ్ళద్దంటున్నావ్ అంటూ అమాయకంగా అడిగింది. 

పాపని దగ్గరికి తీసుకుని, ఆలోచనల్లో పడింది. పెళ్ళైన కొత్తల్లో జర్నలిజం అంటే టీవీ లో చూసే ‘గంగతో రాంబాబు’ లాగే అనుకునేది. పెళ్ళికి ముందు పెద్దగా వార్తలు చదవడం వినడం లాంటి అలవాట్లు, ఇంట్రెస్ట్ తక్కువే. తర్వాత మెల్లిగా ఆ ప్రొఫెషన్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టింది. వాళ్ళు చేసే రకరకాల రీసెర్చ్, ఎప్పటికప్పుడు కొత్త విషయాలని తెలుసుకొని వార్తల రూపంలో తెలియజేయడం, దానికోసం వాళ్ళు పడే రకరకాల పాట్లు ఇవన్నీ చూసినప్పుడు ఆమెకి అనిపించేది. ఎంతో బాధ్యతాయుతమైన వృత్తి. 

ఒక జర్నలిస్ట్ మీద ఎంతటి క్లిష్టమైన పని ఆధారపడి ఉంటుంది. జనజీవితానికి వాళ్ళు ఎంతగా సహకరిస్తారు, ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొంటారు, కొన్నిసార్లు ప్రమాదాలని కొనితెచ్చుకునే పరిస్థితులు కూడా ఎదురౌతాయి. తనకి అర్ధమయ్యాకా భర్తపై, అతని వృత్తిపై ఎంతో గౌరవం కలిగింది. ఎప్పుడూ అతనిని ఏ టైం లో బయటికెళ్ళినా ఎంత ఆలస్యంగా వచ్చినా అడ్డుకోలేదు‌. కానీ ఆరోజెందుకో మనసుకి కీడు శంకించింది. కరోనా బారిన పడ్డవాళ్ళ వార్తల కోసం వెళ్తున్నాడతను. కనీసం రోజంతా అక్కడ హాస్పిటల్ దగ్గరే గడపాలి. అందుకేనేమో ఆమె అంతటి ఇబ్బందికి గురౌతోంది. 

ఇంతలో ఒక ఆలోచనతో మనసు దిటవు చేసుకుంది. ఆ రోగులను డాక్టర్లు 24 గంటలూ వైద్యం కోసం తాకి మరీ సేవ చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుని గడుపుతున్నారు. అతను బయటనుంచేగా. పర్వాలేదు. భయంలేదు అనుకుంది. 

అమ్మా అమ్మా, అంటూ తన సమాధానం కోసం ఎదురు చూస్తున్న కూతురిని ముద్దాడి, ఏం లేదమ్మా. నాన్న ఆఫీస్ కి వెళ్తున్నారు. మనం మన డెన్ కి వెళ్ళి కథలు చెప్పుకుందాం రా, అంటూ పాపని తీసుకొని తన ఆటగదిలోకి చేరింది. 

– ఇది ఇంకా సాగుతూనే ఉంటుంది 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమవంతు బాధ్యతని, సమాజం పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఎప్పటికప్పుడు వివిధరకాల అత్యవసర సమాచారాన్ని చేరవేస్తున్న పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *