
Trip to Italy
- Bhavalavanyam
- 0
- on Sep 13, 2022
“అమ్మా, ఇటు రా.. ఇక్కడ చూడు” అంటూ అరుస్తున్న కొడుకు సంబరాన్ని చూసి మనసులోనే ఆనంద పడుతున్నా, అయ్యో అసలు ఈ తరం పిల్లలకి స్వేచ్చ, స్వాతంత్ర్యం లాంటివి ఏంటో తెలుసా? పాపం ఎండ మొహం చూస్తే వచ్చి పడే రకరకాల కలుషిత కిరణాల వలన వచ్చే ప్రమాదకరమయిన జబ్బులు, మట్టిలో అడుగు కాదు సరికదా, అసలు మట్టి అంటే ఏంటమ్మా అని అడిగే పరిస్థితులు, కాస్త కాలు చెయ్యి చక్కగా ఉంటే చాలు, ఎత్తుకెళ్లిపోయే ప్రమాదకరమైన గుంపులు, స్వైర విహారం చేసే క్రూర మ్రుగాలు.. భగవంతుడా.. నేను బతికుండగా ఇలాంటి రోజులు చూస్తాను అనుకోలేదు.
ఈ కరోనా వలన ప్రపంచం మొత్తం అస్తవ్యస్తమైపోయింది.. ఒక్క రాత్రిలో అన్నీ తారుమారు అయిపోయాయి. దురద్రుష్టం కాకపోతే, ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయ్యే ముందు ఇలా మేం ఇటలీ లో దిగడమేంటి. ఏదో పిల్లాడికి స్కూల్ వచ్చే ఏడాది తెరిచేస్తారు, నాకు కూడా సెలవలు ఉన్నాయి. నువ్వు ఒక వారం రోజులు సెలవు తీసుకుంటే మనం ముగ్గురం కలిసి ఇటలీ తిరిగేసి వద్దాం హాయిగా.. మళ్లీ నాకు ఎప్పుడు సెలవలు కలిసొస్తాయో తెలియదు కదా.. మా మేనేజర్ మంచి మూడ్ లో ఉండగానే సెలవు అడిగితే బెటర్ అని ఈ రోజు సాయంత్రమే అడిగితే యే కళ్ళనున్నాడో సరే అని ఒప్పేసుకున్నాడు.
వచ్చే వారం దాటితే కొత్త ప్రాజెక్టు మొదలైపోతుంది. మళ్లీ ఒక రెండేళ్లు ఖాళీ లేకుండా నడపాలి. ప్లీజ్ ఒప్పుకో అమ్మడూ అని భార్యని గోముగా అడుగుతున్న ఆదిత్యని చూసి, అయ్యో నిజమే కదా అని అలోచించి సరే వెళ్దాం అంది ఛాయ. వాళ్లకి రెండేళ్ల బాబు వంశీ.
సరే అనుకోగానే అన్నీ సిద్ధం చేయించేశారు కంపెనీ వాళ్ళు. ఐ టీ కంపెనీ లో ప్రాజెక్ట్ హెడ్ కావడం చేత అతనికి మంచి జీతం పేకేజ్ ఉంది. పైగా గత రెండేళ్లుగా చేస్తున్న ప్రాజెక్టు పూర్తి అయిన ఆనందంలో ఉన్నారు అందరూ. అందువల్ల బోనస్ కూడా ప్రకటించారు. ఇతడికి స్పెషల్ బోనస్ ఇచ్చారు.
సరే అంటూ సరదాగా మరునాడే ప్రయాణమై ఇటలీ తిరిగి వద్దాం అంటూ వెళ్లి అక్కడే క్వారంటైన్ లో చిక్కుబడిపోయారు. అప్పటికి కరోనా ఇంతలా వ్యాపించకపోవడం వలన, వాళ్లని 14 రోజులు క్వారంటైన్ లో పెడతారన్న ఆలోచన చూచాయగా కూడా వాళ్లకి లేదు.
ఫ్లయిట్ దిగగానే ముందు అయిసోలేషన్ లోకి పంపేసారు. ఆదిత్య అన్ని రకాల ప్రయత్నాలు చేసినా బయటకి వచ్చే మార్గం లేకపోయింది. వాళ్లు నరక ప్రాయంగా గడిపిన పధ్నాలుగు రోజులు పూర్తి అయ్యేసరికి అంతా లాక్డౌన్ ప్రకటించేశారు. విమాన ప్రయాణాలు కేన్సిల్ చేసేసేరు. అదిత్య కుటుంబం తో సహా ఇటలీ లో చిక్కుబడి పోయాడు. ఎవరితో మాట్లాడినా సరైన సమాధానం లేదు. అక్కడి పరిస్థితులు మరీ దారుణం. కరోనా కారణం గా మనుషులు కళ్ల ముందే పిట్టల్లా రాలిపోతున్నారు.. టీ వీ చూసినా, వార్తలు విన్నా, ఎక్కడికి ఫోన్ చేసినా అందరూ ఇటలీలో పరిస్థితి ప్రపంచంలో అందరికంటే దారుణం అనే వార్తలే వింటూ ఉంటే వాళ్లకి గుండెలు గుభిల్లు మనిపోతున్నాయి.
ఇంతలో ఆదిత్య ఏదో తినడానికి దొరుకుతుందేమో చూసొస్తాను అంటూ బయటికి వెళ్లేడు. అప్పటికి గత మూడు రోజులుగా కేవలం బ్రెడ్ పాలు మాత్రమే తీసుకుంటున్నారు వాళ్లు. పిల్లాడు వంశీ ని చూస్తే మనసు తరుక్కుపోతోంది. అందుకే ఆదిత్య తనే వెళ్లి చూసొస్తా అంటూ బయల్దేరితే భయంగా ఉన్నా ఒప్పుకోక తప్పలేదు. ఇంతలో వంశీ బయట బాల్కనీలోంచి పైన ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపుని చూస్తూ చప్పట్లు చరుస్తూ సంబరంగా తల్లిని పిలుస్తున్నాడు. ఆ పెద్ద పక్షి ఒకటి కొడుకు వైపు దూసుకుని వస్తోంది. భయంతో ఒణికిపోతూ ఆమె వంశీ, బయటికి వెళ్లద్దు. లోపలికి వచ్చేయ్ అంటూ అరుస్తోంది..
ఇంతలో దబదబా తలుపు చప్పుడు వినిపించింది. ఒక్క ఉదుటన కళ్లు తెరిచి చూసింది. కాసేపు అసలు తను ఎక్కడ ఉందో అర్ధం కాలేదు. కళ్లు నులుముకుని సరిగ్గా చూస్తే తను తన మంచం మీద ఉంది. పక్కనే తన రెండేళ్ల కొడుకు వంశీ, భర్త ఆదిత్య ప్రశాంతంగా నిద్ర పోతున్నారు..
రోజు తెల్లవారుతుండడం వలన బయట పాలబ్బాయి పాల పేకెట్లు ఇవ్వడం కోసం తలుపు కొడుతున్నాడు. ఆ చప్పుడుకే తనకి మెలకువ వచ్చింది. ఇంతకీ తనకి వచ్చింది కలన్నమాట. అది అర్ధం అయ్యే సరికి ఒక్కసారి మనసంతా అదోలా అయిపోయింది. ఇంట్లో ప్రశాంతంగా వండుకుని తినే నాకే ఇలా ఉంటే ఆ చైనా, ఇటలీ లాంటి దేశాలలో జీవితాలు ఎలా గడుస్తున్నాయో. జనం ఎంత నరకబాధలు అనుభవిస్తున్నారో కదా.. భగవంతుడా అందరినీ ఈ ముప్పు నుండి రక్షించు తండ్రీ అని గట్టిగా మొక్కుకుని పనులు మొదలు పెట్టింది..