
People Change with Times
- Bhavalavanyam
- 0
- on Sep 12, 2022
ఆమె పేరు శాంతి. కానీ ఆమె ఎక్కడున్నా ఆమె తలబిరుసు, టెంపరితనం, మాటల్లో గాడుతనం, చూపుల్లో ఓర్వలేనితనం ఇలా అన్ని అవలక్షణాలూ కలగలిపిన కుత్సితమైన బుధ్ధి కలిగిన వ్యక్తిత్వం వలన చుట్టూ ఉన్నవారెవరికీ మనశ్శాంతి ఉండదు. ఆమెను కన్న తల్లి తండ్రి కూడా ఆదరించరంటే నమ్మాలి.
చిన్నప్పటినుంచీ తోబుట్టువులు కలిసున్నా, తల్లి దగ్గర అక్క గారాలు పోయినా, తండ్రి తమ్ముడికి దగ్గర కూర్చోబెట్టుకుని లెక్కలు చెప్పినా, ఏ ఇద్దరు సఖ్యతగా ఉన్నా ఓర్వలేని తనంతో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, లేదా తనే ఏదో వంకన తల గోడకేసి కొట్టుకోవడం లాంటి చీలి పనులు చేసి ఇతరులు బాధపడితే చూసి ఆనందించేది.
ఆమెతో బాటుగా ఆమె టెంపరితనమూ పెరిగింది. తల్లి తండ్రి, స్కూల్ లో టీచర్లు ఇలా ఎవరేమి చెప్పినా, ఎలా నచ్చజెప్పినా మార్పులేదు. పెంకితనం పెరిగి పెరిగి తనేది కావాలంటే అదే ఇవ్వాలి. లేకపోతే ఆరోజు తినకపోవడం, తనని తానే గాయపరచుకోవడం లాంటివి చేసేది. అలా గొడవలు పడిన సమయంలో ఓ రెండ్రోజులపాటుఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా సమయం గడిపేది. అదే కాక, ఎవరు తన వలన బాధ పడ్డా తనలో మాత్రం ఏ పశ్చాత్తాపమూ, బాధ ఉండేవి కావు.
ఎలాగైతేనేం, చదువు పూర్తి అవగానే ఇక ఎక్కువ ఆలోచించకుండా పెళ్ళి చేసేద్దాం, అని ఆలోచించి, ఓ సంబంధం చూసి చేశారు. అబ్బాయి మంచివాడే. కాకపోతే తమతో పోల్చుకుంటే ఆర్ధికంగా కొంత స్థాయి తక్కువ వాడు. అలాంటి ఇంట్లో పడితే దీనికికూడా జీవితంలోని మంచిచెడులు తెలిసొస్తాయని నమ్మకంతోఅతగాడికి ఇచ్చి పెళ్ళి చేసేశారు.
అదృష్టమో దురదృష్టమో మరి, పెళ్ళైన రెండేళ్లకే తీవ్రమైన అస్వస్థతకు గురై ఆమె భర్త కాలం చేశాడు. ఆమెకు ఒక అత్తగారు, మంచం కదిలే పరిస్థితి లేదు. భర్త లేకపోయినా, నిస్సహాయురాలైన అత్తగారిని వదిలితే లోకం మొహాన కల్లాపు జల్లుతారని అక్కడే ఉండిపోయి ఆమెను చూసుకోసాగింది. ఎలాగూ ఇంటికెళ్ళినా పెద్ద ఆదరణ దొరకదని ఆమెకు తెలుసు. నెమ్మదిమీద జీవితంలో కష్టాలు ఎదురై ఒక్కొక్కటిగా మీదపడసాగాయి. ముందుగా ఇంట్లో అత్తగారికి అనారోగ్యం, భర్త లేకపోవడం వలన ఉద్యోగం చేస్తూ ఇల్లు గడపాల్సిన బాధ్యత ఆమెపైనే పడ్డాయి.
కాలచక్రం ఏ పాఠాలు నేర్పించినా అది కఠినంగానే ఉంటుంది. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని సమయం నెట్టుకొస్తోంది. ఓనాలుగేళ్ళు అయ్యేసరికి, అత్తగారు తనువు చాలించారు. నిజానికి అప్పుడు, శాంతి నిజమైన ఒంటరితనం అంటే తెలిసొచ్చింది. రోజులు నడుస్తున్నాయి. ఓ చల్లని శుభవేళ ఆమె ఒక శుభలేఖ అందుకుంది. తన మేనల్లుడి పెళ్ళి. సరే ఈ పెళ్ళి వంకన అందరినీ ఓసారి చూడచ్చనే ఆలోచనతో పెళ్ళికి ప్రయాణమైంది.
ఆడపెళ్ళి వారు అధికమైన హంగూ ఆర్భాటం లేకపోయినా ఉన్నంతలో చాలా చక్కగా జరిపించారు. పెళ్ళై తమ్ముడింటికి తిరిగి వచ్చారు. ఇక సాయంత్రం బయల్దేరి వెళ్దామనుకునేలోపు ఈ లాక్డౌన్ ప్రకటన వెలువడింది. అంతే ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోవల్సొచ్చింది.
సరే, ఆమెపై ఉన్న అభిప్రాయాలన్నీ దండగుచ్చి, చిన్నప్పటి విషయాలన్ని చెప్పినట్టున్నాడు తమ్ముడు మరదలికి. మరదలు మాత్రమే కాదు, అందరూ అంటీ ముట్టనట్టేవ్యవహరిస్తున్నారు. కానీ ఈ గడిచిన వారం రోజులు లాక్డౌన్ పీరియడ్,ఆమెను ఇంట్లో వాళ్ళు సరిగ్గా అర్ధంచేసుకోవడానికి దోహదపడ్డాయి. ఆమెలోని మార్పు ఆమెతమ్ముడికి అడుగడుగునా తెలుస్తోంది. తన అక్క ఇంట్లో పనులన్నింటికీ తన భార్యకు సహకరిస్తోంది. అవసరమైనంతే మాట్లాడుతోంది. బహుశా జీవితం నేర్పిన పాఠాలు అక్కని ఇలా మార్చినట్టున్నాయి. అనవసరంగా ఆమెను దూరంగా ఉంచేశాము. ఎన్నింటిని ఒంటరిగా ఎదుర్కందో. అనుకున్నాడు. ఈ కరోనా కారణంగా ఆమెను తెలుసుకొనేందుకు ఒక అవకాశాన్నిచ్చింది అనుకున్నాడు.
శాంతి, తల్లిదండ్రులకు మనసులోంచి క్షమాపణ వేడుకుంది. చిన్నప్పటి తన విపరీత ప్రవర్తనకు పశ్చాత్తాపంగా.