
White Shirt – తెల్ల చొక్కా
- Bhavalavanyam
- 0
- on Sep 15, 2022
“అహా, ఈరోజెందుకో తెల్ల చొక్కా వేసుకోవాలనుంది..” అనుకుంటూ బీరువా తీసి చూసిన శేఖర్ కి చిన్నగా షాక్ తగిలినట్టయింది. ఎప్పుడూ ఉండే చోట తెల్ల చొక్కా లేదు. సరే “బహుశా తలుపు వెనక్కాల తగిలించి మర్చిపోయి ఉంటాను” అనుకుని వెళ్లి చూద్దును కదా, అక్కడా లేదు..
దాదాపు గావు కేకలు పెట్టినట్టు భర్య పార్వతిని పిలిచాడు, “ఏమోయ్, ఇక్కడ నా తెల్ల చొక్కా పెట్టేను, ఏమైంది?” అంటూ..
అరుపులు విని కంగారుగా పరుగు పెట్టుకుని లోపలికి వచ్చి చూసి, “ఏదీ జరిగినట్టు లేదే, ఎందుకా గావుకేకలు? నేనింకా ఏదో జరిగిపోయింది అనుకుని కంగారు పడిపోయా” అంటూ విసుక్కుని వెనక్కి తిరిగింది పార్వతి.
“ఆగవోయ్ అర్ధాంగి, ఎక్కడికి, కాస్త నా గోడు వినూ..” అంటూ రాగాలు తీస్తున్న శేఖరాన్ని చూసి కోపం పోయి వస్తున్న కాస్త నవ్వు ఆపుకుని, “హా చెప్పండీ” అంది గంభీర్యాన్ని నటిస్తూ.
“ఇక్కడ నా తెల్ల చొక్కా పెట్టేను, కనిపించడం లేదోయ్. వెతుకుతున్నాను” అన్నాడు సాలోచనగా..
“ఏమండీ, ఒకమాట చెప్తాను, తిట్టరు గా” అంటూ గోముగా అడుగుతున్న భార్యని అనుమానంగా చూస్తూ, “చెప్పు మరి నా కొంప ఎలా ముంచేవో” అన్నాడు..
“అది కాదండీ, మొన్న బట్టలు మిషన్ లో వేస్తూ చూసుకోకుండా మీ తెల్ల చొక్కా కూడా వేసేసా.. దానికేమో కొంచెం రంగు అంటుకుంది, తీసి పక్కన పెట్టేను” అంది అమాయకంగా..
“అనుకున్నాను, ఇదేదో నీ పనే అని. ఏదీ ఎంత రంగు అంటుకుందో చూపించు” అన్నాడు శేఖర్.
మెల్లగా పైకి తీసి చూపించిన ద్రుశ్యం చూసి హతాశుడైపోయాడు శేఖర్. “ఇదీ ఇదీ .. మొన్న నేను కొనుక్కున్న తెల్ల చొక్కా నే కదా ?!” అన్నాడు..
“అవునండీ, కాస్త రంగు అంటుకుంది” అంటున్న పార్వతిని చూస్తూ పళ్లు కొరుకుతూ, “దీన్ని కొంచెం అంటారా? అసలు దీన్ని తెల్ల చొక్కా అంటే ఎవరైనా నమ్ముతారా? ఒకసారి చూడు.. ఇదేదో, వంట వండడం రాని వాడు వండినప్పుడు తుళ్లి పడిన నూనె, మసాలా మరకల్లా, రంగులేసే పెయింటర్ రంగులేసేటప్పుడు వేసుకునే చొక్కాలా, ఆదివారం దూరదర్శన్ చానెల్ లో వచ్చే రంగోలీ లో వివిధ రకాల భాషల పాటలలా, ఏంటిది? అసలిలా ఉంటుందా తెల్ల చొక్కా?? దారుణం.. ఎన్ని సార్లు చెప్పేను, విడిగా ఉతకమని..” అంటూ
“అన్నట్టు ఈ వాషింగ్ మెషీన్ కాదు కానీ, అసలు యేదీ దాని అసలైన రంగులో ఉండదు. బనీన్లు అన్నీ నీరు కావి రంగుకి మారిపోయి, యెప్పుడు వేసుకున్నా అసలు దీన్ని ఉతికారా అనే అనుమానం వచ్చేలా తయారయ్యేయ్..
అది చాలదన్నట్టు, బట్టలకి పట్టేసిన డిటర్జెంట్ మరకలు, ముద్దలు ముద్దలుగా మిగిలిపోయిన బట్టల పోగులు, బయటికి తీసే సమయానికి బట్టలన్నీ ఒకదానికొకటి మెలికలు తిరిగిన తీగెలలా చుట్టుకుపోయి విడదీసేటప్పుడు, బొత్తాలు ఊడిపోయినవి, జిప్పులు విడిపోయినవి, వేరే బట్టల హుక్కులు తగులుకుని చిరిగిపోయినవి ఇలా ఒకటి కాదు.. పైగా ఒక్క చొక్కా కి కూడా కాలర్ కి పట్టిన మకిలి వదిలి చావదు. ఏమైనా చూస్తావా అసలు?? ఇలాగే ఉంటాయా?” అంటూ ఏకరువు పెట్టేడు శేఖర్.
వింటున్న పార్వతికి ఇదంతా నిజమే అని మనసులో తెలిసినా, “ఇప్పుడు బట్టలు చెతులతో ఉతకడం నా వల్ల కాదు. ఎలా ఉంటే అలా వేసుకోండి. ఈ సారికి ఏం చేయలేను. వచ్చే సారి నుంచి మీ బట్టలు విడిగా వేస్తా.” అని క్షమాపణగా చెప్తూ, “ఇదిగో కాఫీ తాగండి” అని తనకిష్టమైన కాఫీ తెచ్చి ఇచ్చింది.
ఆ విసుగు చిరాకులో అందుకున్న కాఫీ తుళ్లి మళ్లీ పక్కనున్న అదే తెల్ల చొక్కా మీద పడింది. ఇంకొక నాలుగు మరకలు పడి తెలుపు రంగు వెక్కిరిస్తున్నట్టు తయారయింది. పార్వతి నవ్వు ఆపుకోలేక నోటికి చీర కొంగు అడ్డు పెట్టుకుని చూస్తూ ఉండిపోయింది.
చేసేదేం లేక మూతి విరిచి ఉన్న పచ్చచొక్కా వేసుకుని బయల్దేరాడు ఆఫీస్ కి..